జడ్డూ ఆల్‌రౌండ్ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన చెన్నై

ABN , First Publish Date - 2021-04-26T00:55:28+05:30 IST

పటిష్ఠ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై సూపర్ కింగ్స్ మట్టి కరిపించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో చిత్తు చేసి క్రికెట్ అభిమానులకు అదిరిపోయే మజా..

జడ్డూ ఆల్‌రౌండ్ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన చెన్నై

ముంబై: పటిష్ఠ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై సూపర్ కింగ్స్ మట్టి కరిపించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ సీజన్లో ఆర్సీబీ జైత్ర యాత్రకు బ్రేక్ వేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి సూపర్ ఓపెనింగ్ దక్కింది. 3 ఓవర్లలోనే 44 పరుగులు చేసి చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. అయితే నాలుతో ఓవర్ వేసిన శామ్ కర్రాన్ చెన్నైకు తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(8: 7 బంతుల్లో.. 1 ఫోర్)ని అవుట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అప్పటివరకు బౌండరీలతో విరుచుకుపడుతున్న దేవ్‌దత్ పడిక్కల్(34: 15 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌‌లు)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి గండి పడింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్(7: 11 బంతుల్లో.. 1 ఫోర్) మరోసారి నిరాశపరిచాడు. అయితే అప్పటికీ మ్యాక్సీ, ఏబీడీ ఉన్నారు కదా.. అనే ధీమాతో ఆర్సీబీ అభిమానులుండగా.. చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వారి ఆశలను ఆవిరి చేశాడు. 


వరుస ఓవర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్(22: 15 బంతుల్లో.. 3 ఫోర్లు)తో పాటు, ఏబీ డివిలియర్స్(4: 9 బంతుల్లో..)ను ఏకంగా బౌల్డ్ చేసి ఒక్కసారిగా మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పేశాడు. 83 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ఓటమి ఖరారైపోయింది. ఆ తర్వాత కూడా డానియల్ క్రిస్టియన్(1)ని కూడా జడేజానే రనౌట్ చేయడంతో ఆర్సీబీ 7వ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కైల్ జేమీసన్(16: 13 బంతుల్లో.. 1 ఫోర్, 1 సిక్స్)ను ఇమ్రాన్ తాహిర్ రనౌట్ చేశాడు. 


అలాగే హర్షల్ పటేల్‌‌ను బౌల్డ్ చేయడమే కాకుండా, నవ్‌దీప్ సైనీ వికెట్ కూడా తీశాడు. ఇక చివర్లో యుజ్వేంద్ర చాహల్(8నాటౌట్: 21 బంతుల్లో..), మహ్మద్ సిరాజ్(12నాటౌట్: 14 బంతుల్లో.. 1 సిక్స్) చివర్లో ఆలౌట్ కాకుండా వికెట్ కాపాడుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్లకు కేవలం 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై 69 పరుగుల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లతో మెరవగా.. ఇమ్రాన్ తాహిర్ 2 వికెట్లు తీశాడు. శామ్ కర్రాన్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అర్థ సెంచరీతో రాణించడమే కాకుండా 3 వికెట్లు కూడా తీసి సూపర్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన జేడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది. ఆర్సీబీ రెండో స్థానానికి పడిపోయింది.



Updated Date - 2021-04-26T00:55:28+05:30 IST