చెన్నై.. అలవోకగా

ABN , First Publish Date - 2021-04-17T09:05:44+05:30 IST

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వాంఖడే మైదానం బౌలింగ్‌కు స్వర్గధామంగా నిలిచింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న..

చెన్నై.. అలవోకగా

 పంజాబ్‌పై గెలుపు

వణికించిన దీపక్‌ చాహర్‌  

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వాంఖడే మైదానం బౌలింగ్‌కు స్వర్గధామంగా నిలిచింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న చెన్నై పేసర్‌ దీపక్‌ చాహర్‌ (4-1-13-4) నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్‌పై దాడికి దిగాడు. దీంతో రాజస్థాన్‌పై ఇదే స్టేడియంలో 200 పరుగులు సునాయాసంగా దాటించిన రాహుల్‌ సేనకు వంద పరుగులు చేయడమే గగనమైంది. ఆ తర్వాత 107 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. 


ముంబై: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘనమైన బోణీ చేసింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో అదిరిపోయే గణాంకాలు నమోదు చేయడంతో పంజాబ్‌ కింగ్స్‌ దారుణంగా తడబడింది. దీంతో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో గెలిచింది.   శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. చాహర్‌తో పాటు ఇతర బౌలర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పంజాబ్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆరో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ షారుక్‌ ఖాన్‌ (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) ఒక్కడే రాణించాడు. బ్రావో, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 107 పరుగులు చేసి నెగ్గింది. మొయిన్‌ అలీ (31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), డుప్లెసి (33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 నాటౌట్‌) రాణించారు. షమికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా దీపక్‌ చాహర్‌ నిలిచాడు. మరోవైపు చెన్నై తరఫున ధోనీకిది 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌ కావడం విశేషం.



ఆడుతూ.. పాడుతూ:

స్వల్ప ఛేదనలో చెన్నై పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం రాలేదు. అయితే పంజాబ్‌ బౌలర్లు ఆరంభంలో పరుగులను కాస్త కట్టడి చేశారు. దీంతో తొలి మూడు ఓవర్లలో జట్టు 8 పరుగులే చేసింది. కానీ రిచర్డ్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో డుప్లెసి బ్యాట్‌ ఝుళిపిస్తూ 4,4,6తో 14 పరుగులు పిండుకున్నాడు.


అటు బ్యాటింగ్‌ చేసేందుకు ఇబ్బందిపడిన మరో ఓపెనర్‌ రుతురాజ్‌ (5)ను అర్ష్‌దీప్‌ సింగ్‌ అవుట్‌ చేశాడు. అయితే మొయిన్‌ అలీ మాత్రం దూకుడుగా ఆడాడు. వచ్చీ రాగానే రెండు ఫోర్లు బాదడంతో చెన్నై పవర్‌ప్లేలో 32/1 స్కోరు సాధించింది. ఆ తర్వాత కూడా ఓవర్‌కో ఫోర్‌ ఉండేలా చూసిన అలీ.. జట్టును వేగంగా లక్ష్యం వైపు నడిపించాడు. 11వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 12వ ఓవర్‌లో భారీ సిక్స్‌ సాధించిన అతడిని అర్ధసెంచరీకి చేరువలో ఉండగా ఎం.అశ్విన్‌ అవుట్‌ చేశాడు. ఇక విజయానికి 8 పరుగుల దూరంలో షమి వరుసగా రైనా (8), రాయుడు (0) వికెట్లను తీశాడు. అయితే సామ్‌ కర్రాన్‌ (5 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.


వికెట్లు టపటపా..:

టాస్‌ ఓడిన పంజాబ్‌ను పేసర్‌ దీపక్‌ చాహర్‌ తన అద్భుతమైన పేస్‌తో గడగడలాడించాడు. అలాగే చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ మినహా అంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ పరుగుల కోసం తంటాలు పడాల్సి వచ్చింది. అటు తొలి స్పెల్‌లోనే చాహర్‌ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. అతడి ధాటికి  మయాంక్‌ అగర్వాల్‌ (0), గేల్‌ (10), పూరన్‌ (0), హూడా (10) పెవిలియన్‌కు చేరారు. ఇక కెప్టెన్‌ రాహుల్‌ (5) మూడో ఓవర్‌లో జడేజా మెరుపు త్రోతో రనౌట్‌ అయ్యాడు. దీంతో కేవలం 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును షారుక్‌ ఖాన్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. చెన్నై బౌలర్లను అతడొక్కడే దీటుగా ఎదుర్కొన్నాడు. జే రిచర్డ్‌సన్‌ (15)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు.. ఏడో వికెట్‌కు ఎం.అశ్విన్‌ (6)తో కలిసి 30 పరుగులు జోడించాడు. చెత్త బంతులను వదలకుండా బౌండరీ దాటిస్తూ జట్టును వంద పరుగులు దాటించి పరువు కాపాడాడు. అయితే చివరి ఓవర్‌లో ఆరు పరుగులే ఇచ్చిన సామ్‌ కర్రాన్‌.. తొలి బంతికే షారుక్‌ను అవుట్‌ చేశాడు.


పాయింట్ల పట్టిక

జట్టు గె పా నెట్‌ ర.రే

బెంగళూరు 2 2 0 4 +0.175

చెన్నై 2 1 1 2 +0.616

ముంబై 2 1 1 2 +0.225

ఢిల్లీ 2 1 1 2 +0.195

రాజస్థాన్‌ 2 1 1 2 +0.052

కోల్‌కతా 2 1 1 2 +0.000

పంజాబ్‌ 2 1 1 2 -0.909

హైదరాబాద్‌ 2 0 2 0 -0.400


స్కోరు బోర్డు

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (రనౌట్‌) 5; మయాంక్‌ (బి) దీపక్‌ చాహర్‌ 0; గేల్‌ (సి) జడేజా (బి) దీపక్‌ చాహర్‌ 10; దీపక్‌ హూడా (సి) డుప్లెసి (బి) దీపక్‌ చాహర్‌ 10; పూరన్‌ (సి) ఠాకూర్‌ (బి) దీపక్‌ చాహర్‌ 0; షారుక్‌ఖాన్‌ (సి) జడేజా (బి) కర్రాన్‌ 47; రిచర్డ్‌సన్‌ (బి) మొయిన్‌ అలీ 15; మురుగన్‌ అశ్విన్‌ (సి) డుప్లెసి (బి) బ్రావో 6; షమి (నాటౌట్‌) 9; రిలే మెరిడిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 106/8; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-19, 4-19, 5-26, 6-57, 7-87, 8-101; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-13-4; సామ్‌ కర్రాన్‌ 3-0-12-1; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-35-0; జడేజా 4-0-19-0; మొయిన్‌ అలీ 3-0-17-1; బ్రావో 2-0-10-1. 


చెన్నై: రుతురాజ్‌ (సి) హూడా (బి) అర్ష్‌దీప్‌ 5; డుప్లెసి (నాటౌట్‌) 36; మొయిన్‌ అలీ (సి) షారుఖ్‌ (బి) ఎమ్‌.అశ్విన్‌ 46; రైనా (సి) రాహుల్‌ (బి) షమి 8; రాయుడు (సి) పూరన్‌ (బి) షమి 0; సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 15.4 ఓవర్లలో 107/4; వికెట్ల పతనం: 1-24, 2-90, 3-99; 4-99; బౌలింగ్‌: షమి 4-0-21-2; రిచర్డ్‌సన్‌ 3-0-21-0; అర్ష్‌దీప్‌ 2-0-7-1; మెరిడిత్‌ 3.4-0-21-0; ఎం.అశ్విన్‌ 3-0-32-1. 

Updated Date - 2021-04-17T09:05:44+05:30 IST