చెమటోడ్చిన చెన్నై

ABN , First Publish Date - 2021-04-22T09:33:00+05:30 IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఓడినా వీరోచిత పోరాటంతో ఆకట్టుకుంది. 221 పరుగుల భారీ ఛేదనలో ఓ దశలో కేకేఆర్‌ స్కోరు 31/5. ఈ దశలో కమిన్స్‌ (34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్‌), రస్సెల్‌

చెమటోడ్చిన చెన్నై

వణికించిన కోల్‌కతా


ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఓడినా వీరోచిత పోరాటంతో ఆకట్టుకుంది. 221 పరుగుల భారీ ఛేదనలో ఓ దశలో కేకేఆర్‌ స్కోరు 31/5. ఈ దశలో కమిన్స్‌ (34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్‌), రస్సెల్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54) అసమాన పోరాటంతో ధోనీ సేనకు ఓటమిని కళ్లముందుంచారు. చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో గట్టెక్కింది. దీపక్‌ చాహర్‌ (4-0-29-4) ఆదిలోనే కోల్‌కతా వెన్నువిరిచాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. డుప్లెసి (95 నాటౌట్‌), రుతురాజ్‌ (64) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. ఆ తర్వాత కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డుప్లెసి నిలిచాడు.  


అద్భుత పోరాటం..

పవర్‌ప్లే ముగిసేసరికి కేకేఆర్‌ 45/5 స్కోరుతో ఉంది. ఈ దశలో 100 పరుగులు చేస్తేనే గొప్ప అనే అంచనాకు వచ్చారు. కానీ రస్సెల్‌, కమిన్స్‌ అత్యద్భుత బ్యాటింగ్‌తో గెలుపు అంచుల వరకు తీసుకొచ్చారు. టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌లో అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా ఇందులో నాలుగు వికెట్లు దీపక్‌ చాహర్‌ తీశాడు. ఆరో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన రస్సెల్‌ చెన్నై బౌలర్లను వణికిస్తూ జట్టును పోటీలో ఉంచాడు. భారీ సిక్సర్లతో గుబులు పుట్టించిన అతడు 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దెబ్బకు కేకేఆర్‌ 11వ ఓవర్‌లోనే వంద దాటింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే రస్సెల్‌ ఊచకోతకు సామ్‌ కర్రాన్‌ ముగింపు పలికాడు.


లెగ్‌ సైడ్‌ వైడ్‌గా వెళుతుందనుకున్న బంతి అతడి వికెట్లను గిరాటేసింది. దినేశ్‌ కార్తీక్‌ (40) అవుటయ్యాక కమిన్స్‌ ఆశలు రేపాడు. 16వ ఓవర్‌లో అతడు 2,6,6,6,4,6తో ఏకంగా 30 పరుగులు సాధించాడు. అతడి జోరుతో ఛేదన చివరి ఆరు బంతులకు 20 పరుగులకు వచ్చింది. గెలిచే అవకాశం ఉన్నా తొలి బంతికే ఆఖరి వికెట్‌ పడడంతో మ్యాచ్‌ ముగిసింది.


ఆది నుంచీ జోరే..

చెన్నై ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే టాప్‌గేర్‌లో సాగింది. చివరి 10 ఓవర్లలో 138 పరుగులు పిండుకుంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసి మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీరి విధ్వంసంతో  తొలి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. ముఖ్యంగా తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన రుతురాజ్‌ ఈసారి కెప్టెన్‌ ధోనీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఓవర్‌కో ఫోర్‌ చొప్పున ఉండేలా అతడి ఆట సాగింది. అటు డుప్లెసి కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ చివరి వరకు నిలిచాడు. 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన రుతురాజ్‌ను 13వ ఓవర్‌లో వరుణ్‌ చక్రవర్తి దెబ్బతీశాడు. మొయిన్‌ అలీ (25), ధోనీ (17) ఉన్న కాసేపు వేగం కనబరిచారు. ఇక 19వ ఓవర్‌లో డుప్లెసి వరుసగా 4,4,4తో స్కోరు 200కి చేరింది. చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లతో 19 పరుగులు వచ్చాయి. 



స్కోరుబోర్డు

చెన్నై: రుతురాజ్‌ (సి) కమిన్స్‌ (బి) వరుణ్‌ 64; డుప్లెసి (నాటౌట్‌ 95); మొయిన్‌ అలీ (స్టంప్డ్‌) దినేశ్‌ కార్తీక్‌ (బి) నరైన్‌ 25; ధోనీ (సి) మోర్గాన్‌ (బి) రస్సెల్‌ 17; జడేజా (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 220/3. వికెట్ల పతనం: 1-115, 2-165, 3-201. బౌలింగ్‌: వరుణ్‌ చక్రవర్తి 4-0-27-1; కమిన్స్‌ 4-0-58-0; నరైన్‌ 4-0-34-1; ప్రసిద్ధ్‌ 4-0-49-0; రస్సెల్‌ 2-0-27-1; నాగర్‌కోటి 2-0-25-0.


కోల్‌కతా: శుభ్‌మన్‌ (సి) ఎన్‌గిడి (బి) దీపక్‌ 0, నితీష్‌ (సి) ధోనీ (బి) దీపక్‌ 9; రాహుల్‌ (సి) ధోనీ (బి) ఎన్‌గిడి 8; మోర్గాన్‌ (సి) ధోనీ (బి) దీపక్‌ 7; నరైన్‌ (సి) జడేజా (బి) దీపక్‌ 4; దినేశ్‌ కార్తీక్‌ (ఎల్బీ) ఎన్‌గిడి 40; రస్సెల్‌ (బి) కర్రాన్‌ 54; కమిన్స్‌ (నాటౌట్‌) 66; నాగర్‌కోటి (సి) డుప్లెసి (బి) ఎన్‌గిడి 0; చక్రవర్తి (రనౌట్‌) 0; ప్రసిద్ధ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 19.1 ఓవర్లలో 202 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-17, 3-27, 4-31, 5-31, 6-112, 7-146, 8-176, 9-200; 10-202; బౌలింగ్‌: చాహర్‌ 4-0-29-4; కర్రాన్‌ 4-0-58-1; ఎన్‌గిడి 4-0-28-3; జడేజా 4-0-33-0; శార్దూల్‌ 3.1-0-48-0. 

Updated Date - 2021-04-22T09:33:00+05:30 IST