డిస్కమ్‌ల చేతిలోనే చార్జీల పెంపు

ABN , First Publish Date - 2022-08-14T10:04:46+05:30 IST

అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా పెట్రోలియం కంపెనీలు పెట్రోలు/డీజిల్‌ ధరలు పెంచుకున్నట్లే ఇక కరెంట్‌ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు

డిస్కమ్‌ల చేతిలోనే చార్జీల పెంపు

నెలనెలా చార్జీలు పెంచుకునేందుకు ఫార్ములా..

ఖర్చుకు తగ్గట్లుగా చార్జీలు వసూలు చేసుకోవాలి

ప్రతినెలా కమిషన్‌ అనుమతి అక్కర్లేదు

విద్యుత్తు బిల్లు పక్కనపెట్టి, రూల్స్‌ ముసాయిదా విడుదల

సెప్టెంబరు 11 లోగా అభ్యంతరాల స్వీకరణ


హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ విపణిలో  ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా పెట్రోలియం కంపెనీలు పెట్రోలు/డీజిల్‌ ధరలు పెంచుకున్నట్లే ఇక కరెంట్‌ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు డిస్కమ్‌లకే స్వయంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.  పెట్రోల్‌ ధరలు ఏ రోజుకు ఆరోజే పెరిగితే కరెంట్‌ చార్జీలు మాత్రం ఏ నెలకు ఆ నెల పెరగనున్నాయి. ఇందుకుగాను డిస్కంలకు వెసులుబాటు కల్పిస్తూ ‘ముసాయిదా విద్యుత్తు నిబంధనలు(సవరణ)-2022ను కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.


నెలవారీ పెంచుకునే చార్జీలకు సంబంధించి ఏడాదిలో ఒకసారి మొత్తం వాస్తవిక వ్యయంపై పిటిషన్‌ దాఖలు చేసుకొని, రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్‌సీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.  చార్జీల పెంపు కోసం ఒక ఫార్ములాను విడుదల చేసే బాధ్యత ఈఆర్‌సీకే ఉంది. లేనిపక్షంలో కేంద్రమే ఆ నిర్ణయం తీసుకోనుంది. ముసాయిదా నిబంధనలపై రాష్ట్రాలు, డిస్కమ్‌లు, ప్రభావ వర్గాలు సెప్టెంబరు 11వ తేదీలోగా అభిప్రాయాలు/అభ్యంతరాలు/సూచనలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తుది రూల్స్‌ను కేంద్రం విడుదల చేయనుంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డిస్కమ్‌లు మూడునెలలకు ఒకసారి, నెలకోసారి కరెంట్‌ చార్జీలు సవరించుకొని అనుమతి కోరుతూ ఈఆర్‌సీలో పిటిషన్‌లు దాఖలు చేస్తున్నాయి. ఆ వెసులుబాటు ఉన్నా తెలంగాణ మాత్రం ఇప్పటిదాకా ఈఆర్‌సీ అనుమతి తీసుకోలేదు. కాగా, ఎలక్ట్రిసిటీ సవరణ రూల్స్‌-2022 అమల్లోకి వచ్చాక 90 రోజుల్లోగా రాష్ట్రాల ఈఆర్సీలు...ఇంధన ధరలు, విద్యుత్తు కొనుగోలు ధరల్లో హెచ్చుతగ్గులను టారిఫ్‌లో సర్దుబాటు చేయడానికి వీలుగా డిస్కమ్‌ల కోసం ఫార్ములాను ప్రకటించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కేంద్రప్రభుత్వమే నేరుగా ఫార్ములాను విడుదల చేసి, ప్రతినెల ఛార్జీలు పెంచుకోవడానికి డిస్కమ్‌లకు వీలు కల్పించనుంది. ఇక డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఈఆర్‌సీ నివేదిక కోరాల్సి ఉంటుంది. 


వన్‌నేషన్‌... వన్‌ టారిఫ్‌

సెంట్రల్‌ పూల్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే ధరతో డిస్కంలు పునరుత్పాదక విద్యుత్తు కొనుగోళ్లు జరపాలని కేంద్రం మరో కీలక ప్రతిపాదన చేసింది. సౌర, పవన, హైడ్రో, హైబ్రిడ్‌, స్మాల్‌ హైడ్రో వంటి ప్రతి పునరుత్పాదక విద్యుత్తుకి ఇకపై ప్రత్యేక సెంట్రల్‌ పూల్‌ ఉంటుంది.. ఏవైనా మధ్యవర్తి కంపెనీలు(ఇంటర్మీడియేటరీ) పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి కంపెనీల నుంచి పోటీ బిడ్డింగ్‌ ద్వారా కొనుగోలు చేసి ఒకటికి మించిన రాష్ట్రాల్లోని డిస్కంలకు విక్రయిస్తేనే ఈ నిబంధనలు వర్తించనున్నాయి. సెంట్రల్‌ పూల్‌ నిర్వహణకు కేంద్రం ఏర్పాటు చేసే ప్రత్యేక ఏజెన్సీ(ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీ) ప్రతి నెలా ఈ ధరను ఖరారు చేస్తుంది. సెంట్రల్‌ పూల్‌ ద్వారా పునరుత్పాదక విద్యుత్తు క్రయవిక్రయాలు పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో జరగనున్నాయి. 


పక్కాగా విద్యుత్తు సబ్సిడీ లెక్కలు 

వ్యవసాయం, గృహాలు, ఇతర కేటగీరీల వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్తు సరఫరా  చేసినందుకు డిస్కంలకు సర్కారు ఏకమొత్తంలో సబ్సిడీలు కేటాయిస్తోంది. ఇకపై ఈ లెక్కలు కచ్చితంగా ఉండనున్నాయి. కేంద్రం ప్రకటించనున్న స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ఆధారంగా సబ్సిడీ బకాయిలను డిస్కంలు లెక్కించాల్సి ఉండనుంది. దీనికోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేయాలి. 


2003 ఎలక్ట్రిసిటీ చట్టం నుంచే

ముసాయిదా ఎలక్ట్రిసిటీ రూల్స్‌-2003కి అనుగుణంగా 2005లో ఎలక్ట్రిసిటీ రూల్స్‌ రాగా... తాజాగా వాటిని సవరిస్తూ 2022 రూల్స్‌ ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం... విపక్షాల నిరసనతో దాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపింది. ఆ బిల్లు వచ్చేలోపే 2003 ఎలక్ట్రిసిటీ చట్టాన్ని అనుసరించి... సవరణ రూల్స్‌కు తుదిరూపు ఇచ్చే పనిలో ఉంది. 

Updated Date - 2022-08-14T10:04:46+05:30 IST