గుండె గోడు పాటయ్యింది!

ABN , First Publish Date - 2020-07-22T05:30:00+05:30 IST

‘ఎవలు రమ్మన్నారు కొడుకా... నిన్ను ఎవలు పొమ్మన్నారు కొడుకా’... ఇన్నాళ్లూ గొడుగల్లే నీడై... కొండంత అండై...

గుండె గోడు పాటయ్యింది!

‘ఎవలు రమ్మన్నారు కొడుకా... నిన్ను ఎవలు పొమ్మన్నారు కొడుకా’... ఇన్నాళ్లూ గొడుగల్లే నీడై... కొండంత అండై... కడుపులో పెట్టుకున్న హైదరాబాద్‌ను కరోనా కష్ట కాలంలో జనం విడిచి వెళ్లిపోతున్నారు. ఇది చూసి తట్టుకోలేక చరణ్‌ అర్జున్‌ తన గుండె లోతుల్లోని బాధను ఇలా గళంలో వినిపించారు. అతడే రాసి... బాణీ కట్టి... ఆలపించిన ఈ పాట ఇప్పుడు భాగ్యనగరంతో అనుబంధం ఉన్న ప్రతి తెలుగువాణ్ణీ కదిలిస్తోంది. కళ్లు చమ్మగిల్లేలా చేస్తోంది. సినిమాల్లో ‘చిన్ని చరణ్‌’ పేరుతో సంగీత దర్శకుడిగా... రచయితగా... గాయకుడిగా... చిన్న వయసులోనే ఎత్తుపల్లాలు ఎన్నో చూసిన అతడి ‘పాట’ వెనుక కథ ఇది... 


‘‘కరోనా విజృంభణ... లాక్‌డౌన్‌! అందరిలా నేనూ హైదరాబాద్‌ నుంచి మా ఊరు... నల్లగొండ జిల్లాలోని మేళ్లదుప్పలపల్లికి వెళ్లిపోయాను. అక్కడే రెండు మూడు నెలలున్నా. ఆ సమయంలో ఊళ్లో... అయినదానికీ కానిదానికీ ఎవరెవరో వచ్చి నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. పుట్టి పెరిగిన గ్రామంలోనే ఈ పరిస్థితి ఎదురైంది. కానీ... హైదరాబాద్‌లో కాలు పెట్టినప్పుడు నగరం నన్నేమీ అడగలేదు.


అమ్మలా చూసుకుంది. అందుకే కరోనా కష్టాలున్నా సరే... ఊరి నుంచి తిరిగి నగరానికి వచ్చేశాను. నాలా ఎంతో మంది హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతున్నారు. అలా చూసినప్పుడు నాకెంతో బాధ కలిగింది. ఆ బాధనే పాటగా మలిచాను. అదే... ‘ఎవలు రమ్మన్నారు కొడుకా... నిన్ను ఎవలు పొమ్మన్నారు కొడుకా’’ వీడియో సాంగ్‌. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. బతుకు తెరువు కోసం నగర బాట పట్టి... దాన్ని ఆసరాగా చేసుకున్న ప్రతి ఒక్కరిదీ! ‘మీ ఖాళీ జేబులకు మీ గాలి మేడలకు రహదారి చూపిందే... వెదురయ్యి కదిలొచ్చి వేణువులా ఎదిగేంత వేదికను ఇచ్చిందే’... అంటూ అందులో నన్ను నేను చూసుకున్నా. ఈ నెల 8న నా యూట్యూబ్‌ ఛానల్‌ ‘జీఎంసీ టెలివిజన్‌’ ద్వారా దీన్ని విడుదల చేస్తే... ఇప్పటికి ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. లిరిక్స్‌, సంగీతం, గాత్రం నావే. అయితే అనుకోకుండా యూట్యూబ్‌ స్టార్‌ కనకవ్వ స్టూడియోకు వస్తే... ఆమెతో కూడా ఇందులో పాడించాను. కనకవ్వ పాడుతుంటే... ఆమె గొంతులోని ఆర్ద్రత పాటకు ప్రాణం పోసినట్టయింది. వీడియో చూసిన వారు ఎంతో మంది తమను తాము చూసుకున్నట్టుందంటున్నారు. ఇదే నేను కోరుకున్నది. సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా సినిమా రంగంలో ఎంతో అనుభవం గడించిన వీడు ఇప్పుడిలా ప్రైవేటు పాటలు చేసుకుంటున్నాడేమిటని చాలామంది అడుగుతుంటారు. నిజమే... హైదరాబాద్‌ వచ్చినప్పుడు నా లక్ష్యం కూడా అదే! కానీ అన్నీ మనం ఊహించినట్టు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది? 




చిన్న ఊరు... పెద్ద కల... 

మాది చిన్న గ్రామం. ఊళ్లోనే చదువుకున్నా. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఏదో ఒకటి పాటలా రాస్తుండేవాడిని. అలా ఓసారి నా రాత అరుణా మేడమ్‌ కంటపడింది. నాలో మంచి రచయిత ఉన్నాడని తొలుత గ్రహించింది ఆమే. ఆ ప్రోత్సాహంతో స్కూల్లో పలు కార్యక్రమాలకు పాటలు రాసేవాడిని. ఓ పాటకు ‘జన్మభూమి’ రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాటల రచయిత కావాలన్న ఆకాంక్షను రగిలించింది. కాలేజీలో చేరాక అక్కడక్కడా స్టూడియోల్లో పని చేస్తూ చదువుకొనేవాడిని. నా గురించి దర్శకుడు ఎన్‌.శంకర్‌కు తెలిసింది. అప్పుడాయన రాజశేఖర్‌ హీరోగా ‘ఆయుధం’ సినిమా చేస్తున్నారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ సంగీత దర్శకుడు. నన్ను ఆయనకు పరిచయం చేశారు. నాతో అందులో ఓ పాట రాయించారు. ‘ఇదేమిటమ్మా మాయా మాయా’ గీతం నేను రాసిందే. ఆ పాట సూపర్‌హిట్‌ అయింది. అలా 18 ఏళ్ల వయసులోనే చిన్ని చరణ్‌గా సినిమా రంగంలో అడుగు పెట్టాను. లిరిక్స్‌ ఒక్కటే కాకుండా ఆ సమయంలో వందేమాతరం శ్రీనివాస్‌ గారి వద్దే ఉంటూ ఆయన ఏమేం చేస్తున్నారో పరిశీలించాను. అవన్నీ చూసిన తరువాత సంగీత దర్శకుడిని కావాలని ఫిక్సయ్యాను. 


చదువు మానేసి... 

మొదటి పాటతోనే మంచి పేరొచ్చింది. దీంతో డిగ్రీ మధ్యలో ఆపేసి పూర్తిగా సినీ రంగం వైపు వచ్చేశాను.చెన్నై వెళ్లి మణిశర్మ గారి దగ్గర చేరాను. కొంతకాలం యువన్‌ శంకర్‌రాజా తదితర సంగీత దర్శకుల వద్ద కూడా పని చేశాను. ఈ క్రమంలో డ్యాన్స్‌ మాస్టర్‌ లారెన్స్‌ పరిచయమయ్యారు. ఆయన దర్శకత్వంలో  ‘స్టైల్‌’ సినిమాలో ‘మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా..’ పాట రాయించారు. దానికి అభినందనలు వచ్చాయి. తరువాత ఆయన నాగార్జునతో 2006లో ‘డాన్‌’ తీశారు. దానికి అధికారికంగా సంగీత దర్శకుడు లారెన్సే కానీ, ఆ భారమంతా తను నాపైనే పెట్టారు. పాటలన్నీ రాశాను. ‘డాన్‌’ తరువాత ‘మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిన్ను నేనే పరిచయం చేస్తా’నని లారెన్స్‌ చెప్పారు. కానీ ఆయనకు చాలా గ్యాప్‌ వచ్చింది. నా కల నెరవేరలేదు. దానివల్ల వేరే అవకాశాలూ పోయాయి. ఇక్కడే నా జీవితం మలుపు తిరిగింది. 


అమ్మ కోసం... 

అదే సమయంలో కిడ్నీలు చెడిపోయి అమ్మ అనారోగ్యం పాలైంది. ఎక్కువ రోజులు బతకదన్నారు. అమ్మ చనిపోయే లోపు నేను సంగీత దర్శకుడినై చూపించాలనుకున్నా. దీంతో చిన్నా పెద్దా అని చూడకుండా ఏదొస్తే ఆ సినిమా చేశా. అవి సరిగ్గా ఆడక... నా బాణీలు జనాలకు చేరక ఫ్లాప్‌ ముద్ర పడిపోయింది. కొన్నాళ్లకు అమ్మ చనిపోయింది. అవకాశాలు చివరి దాకా వచ్చి చేజారిపోయాయి. ఇదివరకు ఒక బ్లాక్‌బస్టర్‌ సినిమా పడితే మంచి పేరు వస్తుందని అనుకొనేవాడిని. కానీ... ‘సినిమాలతో కాకుండా నేను పేరు తెచ్చుకోలేనా’ అనిపించింది. అలా గత ఏడాది ప్రైవేటు పాటలు చేయడం మొదలుపెట్టాను. నా తొలి సినిమాయేతర పాట ‘ఎట్టుండెరా ఊరు ఎట్టుండెరా..’ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే క్షణాల్లో వైరల్‌ అయింది. ఇది మా ఊరు... అక్కడి పరిస్థితులపై రాసింది. ‘జీఎంసీ టెలివిజన్‌’ ఛానల్‌ పెట్టి, దాని ద్వారా ఇప్పటి వరకు పన్నెండు వీడియోలు వదిలితే అన్నీ బంపర్‌ హిట్‌ అయ్యాయి. హైదరాబాద్‌పై పాటకైతే దేశ విదేశాల నుంచి అభినందిస్తున్నారు. సినిమావాళ్లు కూడా నా నంబర్‌ వెతికి పట్టుకొని మరీ ఫోన్లు చేస్తున్నారు. ‘కేసీఆర్‌ కథాగానం’ చేస్తే కోటి మందికి పైగా వీక్షించారు. 




చిరకాలం బతికుండాలి...

దాదాపు వంద సినిమాలకు పాటలు రాశాను. అనధికారికంగా ఎన్నో బాణీలు సమకూర్చాను. నేనో కంపోజర్‌నని, లిరిసిస్ట్‌నని, గాయకుడినని చెప్పుకొని తిరిగినన్నాళ్లూ నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ... ఈ ప్రైవేటు పాటలతో జనం నన్ను గుర్తించారు. భావోద్వేగంతో స్పందిస్తున్నారు. కనుక నా లక్ష్యం ఇప్పుడు డబ్బు సంపాదన ఒక్కటే కాదు... ఏ పాట చేసినా అది కలకాలం ఉండాలి. రెండేళ్ల కిందట వచ్చిన బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ మళ్లీ కనిపించడం లేదు. ఇళయరాజాగారి బాణీలు ముప్ఫై ఏళ్లయినా మనం ఇంకా వింటున్నాం. ఎందుకు? వాటిల్లో జీవం ఉంది కనుక! అందుకే నన్ను మాత్రమే కాదు... పాటను బతికించడానికి నా వంతు ప్రయత్నించాలనుకొంటున్నా. చేసే ప్రతి పాటలో ‘ఆత్మ’ ఉండేలా చూసుకొంటున్నా. అప్పుడే కదా ఈ జనం మనల్ని ఎన్నాళ్లయినా మరిచిపోకుండా ఉంటారు.’’


- హనుమా

Updated Date - 2020-07-22T05:30:00+05:30 IST