సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా..

ABN , First Publish Date - 2021-04-16T07:00:41+05:30 IST

సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా..

సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా..

నిరుపేద కుటుంబం నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన చందూలాల్‌

రెండుసార్లు గిరిజన శాఖ మంత్రిగా కీలక బాధ్యత

రెండు పర్యాయాలు పార్లమెంట్‌లో అడుగు

చందూలాల్‌ మృతితో ములుగు జిల్లాలో విషాద ఛాయలు

ములుగు, ఏప్రిల్‌ 15: టీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌(66) మృతి చెందడంతో ములుగు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   గ్రామసర్పంచ్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్‌ ఓ సాధారణ రైతు రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా, రెండుసార్లు ఎంపీగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధి సారంగపల్లికి చెందిన అజ్మీరా మీరాబాయి-మీటూనాయక్‌కు 1957 ఆగస్టు 17న జన్మించిన చందూలాల్‌ హెచ్‌ఎ్‌ససీ వరకు ములుగులో చదువుకున్నారు. 1981లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జగ్గన్నపేట సర్పంచ్‌గా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీఆర్‌ ములుగు అసెంబ్లీ స్థానం నుంచి చందూలాల్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. ఇలా 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన చందూలాల్‌ ఇక వెనుతిరిగి చూడలేదు. 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఎన్టీఆర్‌ గిరిజన సంక్షేమ శాఖమంత్రి పదవిని కట్టబెట్టారు. 1996లో వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసిన చందూలాల్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామసహాయం సురేందర్‌రెడ్డిపై గెలిచారు. 1998లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో  రెండోసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆతర్వాత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 2005లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఆయనకు కేసీఆర్‌ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. సుదీర్ఘ విరామం తర్వాత 2014లో ములుగు నుంచి పోటీ చేసిన ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తొలి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖను అప్పగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు. ఆతర్వాత రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను ఆశించినప్పటికీ ఫలితం లేకపోవడంతో  ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ములుగుకు రెవెన్యూ డివిజన్‌ హోదా తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పరకాల కేంద్రంగా ఉన్న డివిజన్‌ను ములుగుకు తీసుకొచ్చి ఆ ప్రాంతాభివృద్ధికి బాటలు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మంత్రిగా ఆయన జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి కృషి చేశారు. ములుగులో తొలిసారి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించి విద్యాభివృద్ధికి బాటలు వేశారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సంక్షేమ కమిటీ సభ్యుడిగా, పార్లమెంట్‌లో లోకల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ స్కీం కమిటీ సభ్యుడిగా, కేంద్ర ట్రైకార్‌ డైరెక్టర్‌గా, ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌గా పనిచేసిన చందూలాల్‌ గిరిజన సంక్షేమం కోసం పాటుపడ్డారు.

Updated Date - 2021-04-16T07:00:41+05:30 IST