Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఖబడ్దార్‌!

 • సీఎం, డీజీపీకి ఇదే నా హెచ్చరిక: బాబు
 • ఇప్పటివరకు మంచితనమే చూశారు
 • ప్రజాస్వామ్య రక్షణకు ఏం చేయాలో చేస్తా
 • ఇది మాపై, కార్యాలయాలపై కాదు..
 • ప్రజాస్వామ్యంపైనే జరిగిన దాడి
 • జగన్‌ వ్యక్తిత్వంలోనే అసలు లోపం..
 • ఆయనను సరిచేసే శక్తి టీడీపీకే ఉంది
 • పిల్లలకు డ్రగ్స్‌, గంజాయి పెనుశాపం..
 • దానిపై పోరాడమంటే మాపై దాడులా? 
 • పట్టాభి వాడిన భాష తప్పైతే సీఎం, 
 • బూతుల మంత్రుల భాష మాటేంటి?
 • నిరసన దీక్షలో చంద్రబాబు ఆగ్రహం


‘‘గతంలో కొందరు ముఖ్యమంత్రులు తప్పులు చేసినా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని సరిచేసేందుకు అవకాశం ఉండేది. కానీ జగన్‌రెడ్డి చేస్తున్న తప్పులను సరిచేయడం భవిష్యత్తులోనూ సాధ్యంకాదు. మేం తిరిగి అధికారంలోకి వచ్చాక కూడా.. ఈ తప్పులను ఎలా సరిచేయాలో తెలియక ఇబ్బందిపడే స్థాయిలో రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు’’


‘‘ఇంతవరకూ నా మంచితనాన్నే చూశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏంచేయాలో అది చేసి చూపిస్తా. ఖబడ్దార్‌... జాగ్రత్తగా ఉండాల్సిందిగా పోలీసు వ్యవస్థనూ, సీఎంనూ హెచ్చరిస్తున్నా’’

చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కాదు, ప్రజాస్వామ్య విధ్వంసం. ప్రజాస్వామ్యం, ప్రజలపై జరిగిన దాడి. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై పోరాడుతున్నవారిపై చేసిన దాడి. భయపెట్టేందుకు చేసిన దాడి. ఇది తెలుగుదేశం, వైసీపీ వ్యవహారం కాదు. రెండుపార్టీల మధ్య ఆస్తి తగాదాలు ఏమీలేవు. అక్రమాలపై పోరాడుతున్నందునే దాడులు చేశారు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. ఒక బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశమే తట్టుకోలేకపోతే...39ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీనే తట్టుకోలేని పరిస్థితి వస్తే ఇక ప్రజలు వ్యక్తిగత స్థాయిలో తట్టుకోగలరా? అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది తెలుగుదేశం-వైసీపీ వ్యవహారం కాదన్నారు. జగన్‌ వ్యక్తిత్వంలోనే లోపం ఉందని, అయితే దాన్ని సరిచేసే శక్తి కూడా టీడీపీకి ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటివరకు నా మంచితనాన్నే చూశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో అది చేస్తా. సీఎం, డీజీపీ ఖబడ్దార్‌’’ అంటూ హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో... పగిలిన అద్దాలు, ఎన్టీఆర్‌ విగ్రహం ముందు కూర్చుని 36 గంటల నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించి మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే...


ఇలాంటి దాడి చూడలేదు

రాష్ట్రంలో, ఇతర రాష్ర్టాల్లో కూడా నేను ఎందుకు 36 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నాననే ఆసక్తి కనిపిస్తోంది. సాధారణంగా సమస్య వస్తే దాని పట్ల ప్రజా చైతన్యం కోసం అనేక విధాలుగా పోరాటాలు చేస్తాం. కానీ ఎక్కడ దాడి జరిగిందో అక్కడే జరుగుతున్న దీక్ష ఇది. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న భవనం ఇది. తెలుగు వారందరికీ పవిత్రమైన దేవాలయం. అలాంటి దేవాలయంపై దాడి బాధాకరం. దేశ చరిత్రలో, 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ పార్టీ ఆఫీసులపై దాడి జరగలేదు. ఇలా వ్యవస్థీకృతంగా, పద్ధతిగా మాత్రం దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీని తుదముట్టించాలని, టెర్రరైజ్‌ చేయాలని, భయభ్రాంతులకు గురిచేయాలనేదే ఈ దాడుల లక్ష్యం. టీడీపీలో ఉండాలన్నా, అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడిపోయే పరిస్థితిని కల్పించాలని పెద్ద కుట్ర చేశారు. 


పక్కనే ఉన్నా.. ఫోన్‌కూ స్పందించలేదు..

దాడి చేయడానికి వాళ్లు కార్యాలయానికి వచ్చినప్పుడు మేం వర్చువల్‌ సమావేశంలో ఉన్నాం. పార్టీ ఆఫీసులో కొందరున్నారు. నేను ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. 4.30గంటలకు పట్టాభి ఇంటిపై దాడి చేశారు. దానిపై చర్చించుకుంటున్నాం. ఎనిమిదేళ్ల పాప ఇంట్లో ఉంటే మొత్తం ఇంటినే ధ్వంసం చేశారు. డీసీపీ, డీజీపీ కోసం ప్రయత్నించాం. మరో 200 మంది పార్టీ ఆఫీసుపైకి బయలుదేరారని సమాచారం వచ్చింది. నేను 5.03 నిమిషాలకు డీజీపీకి ఫోన్‌ చేశాను. శాంతిభద్రతలు ఎవరు కాపాడాలి? ప్రజల ప్రాణాలు, ప్రతిపక్ష నాయకుల ప్రాణాలకు పోలీసులు రక్షణ ఇవ్వాలి. అలాంటి డీజీపీ వేరే పనులు ఉన్నాయని ఫోన్‌ తీసుకోవడానికి నిరాకరించారు. అర్బన్‌ ఎస్పీకి ఫోన్‌ చేసినా లైనులోకి రాలేదు. సీపీకి ఫోన్‌ చేసినా లైనులోకి రాలేదు. ఆ సందర్భంలో నేను నేరుగా గవర్నర్‌కు ఫోన్‌ చేసి మొత్తం వివరించారు. విశాఖపట్నం, హిందూపూర్‌లో బాలకృష్ణ ఆఫీసుపై, కడపలో అమీర్‌బాబు ఇంటిపై దాడి జరిగింది. కడప పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడుపై దాడికి ఆయన ఇంటిపైకి వెళ్లారు. కాళహస్తి పార్టీ ఇన్‌చార్జ్‌ సుధీర్‌రెడ్డి కారు పగలకొట్టారు. ఇవన్నీ గవర్నర్‌కు చెప్పాను. చంపాలని ప్రయత్నిస్తున్నారని, రాజ్యాంగ అధికారాలు ఉపయోగించి ఆపాలని కోరాను. ఆ తర్వాత అమిత్‌షాకు ఫోన్‌ చేశాను. ‘పక్కనే డీజీపీ ఆఫీసు, సీఎం క్యాంపు ఆఫీసు ఉన్నా దాడి జరుగుతుంటే ఫోన్‌ తీయలేదు. పోలీసులు, వైసీపీ గుండాలు ఈ దాడి చేశారు. కేంద్ర మంత్రిగా జోక్యం చేసుకోవాల’ని అడిగాను. ఆయన చర్యలు తీసుకుంటామన్నారు. 


నా మనసు కార్యాలయంపైనే..

దాడి జరుగుతుంటే నా మనసు ఆఫీసుపైనే ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబం టీడీపీ ఆఫీసు. ఇది మనపై దాడి కాదు. ఇది ప్రజాస్వామ్యంపై, ప్రజలపై దాడి. అందుకే ప్రాణం పోయినా ఫరవాలేదని, తాడో పేడో తేల్చుకోవాలని నేరుగా ఆఫీసుకు వచ్చాను. పట్టపగలు డీజీపీ ఆఫీసు పక్కనే దాడులు జరిగాయి. ఇనుప గేట్లను కొట్టారు. సుత్తులు, కర్రలు, బీరు సీసాలు తెచ్చి స్వైర విహారం చేశారు. పార్టీ కార్యకర్తలను దారుణంగా కొట్టారు. అంతా అయ్యాక పోలీసులు వచ్చి సాగనంపారు. ‘డీజీపీ, పోలీసులూ... మీకు సిగ్గు అనిపించలేదా?’ ఏం సందేశం ఇచ్చారు? మమ్మల్ని మేం కాపాడుకోవాలా? మమ్మల్ని మేం కాపాడుకుంటాం. మీకు చేతకాకపోతే పోలీసు వ్యవస్థను మూసేసి ఇంటికి వెళ్లండి. ఇదే నా సవాల్‌. నేనూ సీఎంగా పనిచేశా. 22 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. ఎవరికి ఆపద వచ్చి నా కాపాడిన పార్టీ టీడీపీ. అది రాజ్యాంగ ధర్మం. రాజ్యాంగంపై ఏ ప్రమాణం చేశాడో దానిని నిర్వర్తించాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. డీజీపీగా ఏ ప్రమాణం చేశాడో ఆయన బాధ్యత ఇది. రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన పెడతారు.


ఆర్టికల్‌ 356 ఉపయోగిస్తారు. టీడీపీ ఎప్పుడూ 356 అడగలేదు. కానీ నేడు ఒక పార్టీ ఆఫీసుపై ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రమంతా సంఘటనలు జరిగాయి. అందుకే ఎప్పుడూ అడగకపోయినా నేడు ఆర్టికల్‌ 356 ఉపయోగించి, రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్నాం. మేం విలువల రాజకీయమే చేశాం. ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్లు తిడుతూ, తిరిగి మాపై దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. చాలా మంది సీఎంలు, అధికారులను చూశాం. కొన్ని తప్పులు చేస్తారు. కానీ ఈ సీఎం డబ్బు వ్యామోహం రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితికి తెచ్చారు. రాష్ట్రంలో 25వేల ఎకరాల్లో 8వేల కోట్ల విలువైన గంజాయి తయారవుతోంది. వాట్సాప్‌ ద్వారా డెలివరీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఏపీ మూలం అవుతోంది. 


సీఎం, డీజీపీ పెద్ద తప్పు చేశారు

ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలు త్యాగం చేస్తాం. 1984లో ఎన్టీఆర్‌ను బర్త్‌రఫ్‌ చేస్తే ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడి 30 రోజుల్లో ఎన్టీఆర్‌ను సీఎంను చేసిన చరిత్ర ఈ పార్టీది. అప్పుడు ఈ డీజీపీ పిల్లాడుగా ఉండి ఉంటాడు. సర్వీసులోకి వస్తా అని కూడా అనుకుని ఉండడు. నాకు కథలు నేర్పిస్తావా? ఈ సీఎం అప్పుడు గోలీలు ఆడుకుంటున్నాడేమో. రాష్ట్రంలో డ్రగ్స్‌  కిల్లీ కొట్లలో అమ్ముతున్నారు. దానిపై టీడీపీ పోరాడుతుంటే మా నోర్లు మూయడానికి దాడి చేశారు. సీఎం, డీజీపీ మీరు చేసింది పెద్ద తప్పు. సరిచేసుకోలేని తప్పు చేశారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్‌పై యుద్ధం చేయండి. మా పార్టీపై ప్రతాపం చూపించడం కాదు. డ్రగ్స్‌ వాడుతున్నవారిపై ఉక్కుపాదం మోపండి. ఇది ప్రభుత్వ ఉగ్రవాదం. దానిపై పోరాడేందుకే ఈ సమావేశం’’.శిక్ష పడేవరకు వదలను..

‘‘జగన్‌ కేరెక్టర్‌లోనే లోపం ఉంది. అలాంటి వారిని కూడా సరిచేసే శక్తి టీడీపీకి ఉంది. సమాజమే నాశనం అయిపోయాక మీరు, నేను కూర్చుని పదవులు తీసుకుంటే ఏం వస్తుంది? ఇంతవరకూ నా మంచితనాన్నే చూశారు. భవిష్యత్తులో మీ తప్పులకు శిక్ష పడే వరకూ వదలను. ఎప్పుడైనా ఆలయాలపై, మసీదులపై, చర్చిలపై దాడులు జరిగాయా? ఇప్పుడు చేయిస్తున్నాయి. కులాల మధ్య చిచ్చుపెట్టింది వైసీపీ నాయకులు. టీడీపీ కార్యకర్తలు చూపిన సాహసం, చేసిన త్యాగాలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని టీడీపీ ఏటా నెమరవేసుకుంటుంది. కానీ ఇప్పుడు పోలీసులను చూస్తే ఏం చెప్పాలో అర్థంకావట్లేదు. సమాజ హితం కోరే వారిపై దాడులు చేస్తున్నారు. అధికారపార్టీ శాశ్వతం కాదని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం. దీనికి ప్రజలంతా సహకరించాలి విజ్ఞప్తి చేస్తున్నాను.


దాడులకు పోలీసులను పంపుతారా?

ఆఫీసుపైకి దాడికి పంపడానికి డీజీపీకి  ఎన్ని గట్స్‌ ఉండాలి? ఎవరో వచ్చి గదుల్లో దాక్కుని, అనుమానంగా తిరుగుతున్నాడు. మనవాళ్లు అతన్ని పట్టుకుని ఎవరు నువ్వంటే చెప్పలేదు. ప్రెస్‌ ముందు పెట్టి ఇతనెవరో చెప్పలేదని ఫొటోలు తీశాం. పోలీసులను పిలిపించి వారికి అప్పగించాం. ఫిర్యాదు కూడా చేశాం. కానీ అతను వెళ్లి మాపై ఫిర్యాదు చేశాడు. సిగ్గుందా డీజీ? ఎంతమందిని అరెస్టు చేస్తారు? 307 ఏంటి మేం కొట్టామా? మీ అధికారి మా ఆఫీసుకు ఎందుకొచ్చాడు? నా అనుమతి లేకుండా ఎలా వస్తాడు? మీ ఇంటికొస్తే ఊరుకుంటారా? నీ ఆఫీసుకు వస్తే ఊరుకుంటారా? అలా జరిగితే మాపై హత్యా ప్రయత్నం కేసులు పెట్టారు. మమ్మల్ని కొట్టి, మాపైనే కేసులు పెట్టే మహా వ్యవస్థకు నాంది పలికాడు ఈ డీజీపీ! హ్యాట్సాప్‌ డీజీపీ, శభాష్‌ డీజీపీ, చెయ్యి డీజీపీ నేను చూస్తా నీ కథ. ఏం చేస్తావ్‌. పట్టాభి వాడిన భాష తప్పైతే సీఎం భాష, బూతులు మంత్రుల భాష ఏంటి? మీ ఎమ్మెల్యేల మాటలేంటి? 5 కోట్ల మంది ముందు చర్చిద్దామా?

Advertisement
Advertisement