బాదుడుకు లేదు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-04-19T08:28:40+05:30 IST

‘జగనన్న బాదుడు లేకుండా రాష్ట్రంలో రోజు గడవడం లేదు. కరెంటు బిల్లు నుంచి ఆర్టీసీ చార్జీల వరకూ మోత మోగిస్తున్నారు.

బాదుడుకు లేదు బ్రేక్‌

ప్రజలను ఎంత పిండినా జగన్‌ దాహం తీరదా?

కేబినెట్‌ విస్తరణలో బయటపడిన పిరికితనం

అందరినీ మార్చేస్తానని సగం మంది కొనసాగింపు

బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయి మళ్లీ వారికే పదవులు

రోజుకో చోట  కొత్త మంత్రుల అరాచకాలు

అభివృద్ధి లేదు.. పంటలు కొనరు.. కరెంటు కోతలు

టీడీపీ వ్యూహ కమిటీ భేటీలో చంద్రబాబు ఆగ్రహం

త్వరలో రాష్ట్ర పర్యటనలు.. 21 నుంచి సభ్యత్వ నమోదు


ప్రభుత్వ బాదుళ్లపై జనంలో అసంతృప్తి, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు అవి అగ్నిపర్వతంలా బద్దలవడం ఖాయం. రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగింది. నష్టపోని వర్గమంటూ లేదు. జగన్‌రెడ్డి ఏదో చేస్తారని ఆశించిన సొంత సామాజిక వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉంది. - మాజీ సీఎం చంద్రబాబు


అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘జగనన్న బాదుడు లేకుండా రాష్ట్రంలో రోజు గడవడం లేదు. కరెంటు బిల్లు నుంచి ఆర్టీసీ చార్జీల వరకూ మోత మోగిస్తున్నారు. ప్రజలను ఎంత పిండినా జగన్‌ ప్రభుత్వ దాహం తీరేటట్లు కనిపించడం లేదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన అధ్యక్షతన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు.. వారిలో ప్రభుత్వ బాదుళ్లపై అసంతృప్తి, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని, ఆ అసంతృప్తి సమయం వచ్చినప్పుడు అగ్నిపర్వతంలా బద్దలవడం ఖాయమని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా ఏ కోశానా చిన్న అభివృద్ధి కూడా లేదన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాఽథుడు లేడని.. ప్రజలు మరచిపోయిన కరెంటు కోతలు తెచ్చిపెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌రెడ్డి పిరికితనం మంత్రివర్గ విస్తరణలో బయటపడిందన్నారు. ‘అందరినీ మార్చేస్తామని ముందు ప్రచారం చేసుకున్నారు. చివరకు సగం కేబినెట్‌ అంతే ఉంచారు. బ్లాక్‌మెయిల్‌ చేసిన వారికి జగన్‌ లొంగిపోయి పదవులు ఇచ్చారని ఆ పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఆ పార్టీ డొల్లతనం, లోలోపల పేరుకుపోయిన అసంతృప్తి విస్తరణ సమయంలో బయటపడ్డాయి. తేడా వస్తే ఆ పార్టీ పేకమేడలా కూలిపోతుందని ప్రజలకు అర్థమైంది’ అని తెలిపారు. జగన్‌ అసమర్థ పాలనకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలువుటద్దంలా కనిపిస్తోందన్నారు. ‘పాత టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండర్లు పిలుస్తున్నామని, దీనితో ప్రజా ధనం ఆదా అవుతుందని గొప్పలు చెప్పారు. 2020లో పూర్తి కావలసిన ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉంది. రివర్స్‌ టెండర్లలో ఆదా కాకపోగా నిర్వహణ లోపం వల్ల కలిగిన నష్టానికి ఎదురు రూ.800 కోట్లు అదనంగా ఖర్చవుతోంది’ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా త్వరలో తన పర్యటనలు ఉంటాయని తెలిపారు. 


కొత్త మంత్రుల అరాచకం బయటపడుతోంది

కొత్త మంత్రుల అరాచకం రోజుకో చోట బయటపడుతోందని పార్టీ నేతలు ఈ సమావేశంలో చెప్పారు. ‘ఒక మంత్రి చేసిన ఆర్భాటం అనంతపురం జిల్లాలో పసిబిడ్డ ప్రాణం పోవడానికి కారణమైంది. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకపోగా నిరసన తెలిపిన టీడీపీ నేతలపై దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబెట్టిన ఒక మంత్రిని శ్రీకాళహస్తిలో భక్తులు దుమ్ము దులిపారు. ముఖ్యమంత్రిని ఆరాధిస్తేనే పనులవుతాయని మరో మంత్రి దిక్కుమాలినతనంగా మాట్లాడారు. వందల కోట్ల విలువైన భూమి వ్యవహారంలో క్విడ్‌ ప్రొ కోగా భూమి బదులుగా ఒకరికి మంత్రి పదవి దక్కిందని విశాఖలో అందరూ మాట్లాడుకుంటున్నారు. వారం రోజుల్లోనే ప్రజల్లో ఇంత పలచనైన మంత్రివర్గం రాష్ట్రంలో లేదు’ అని ఒక సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు పత్రాల చోరీ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. దీనిపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రను మూడేళ్లపాటు దోచుకున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమపై పడ్డాడని.. కులాల మధ్య చిచ్చుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడని కొందరు నేతలు ధ్వజమెత్తారు. ఒకటో తేదీన పింఛను ఇవ్వడానికే వలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు మొదటివారం దాటినా ఇవ్వలేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.  పార్టీ మహానాడు వేదికపై సమావేశంలో తుది నిర్ణయం జరగలే దు. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కలిపిస్తున్నట్లు చెప్పారు. ఈ బీమా సౌకర్యం ద్వారా ఇప్పటికే రూ.వందకోట్ల వరకూ పరిహారం అందించినట్లు వెల్లడించారు.

Updated Date - 2022-04-19T08:28:40+05:30 IST