ఇచ్చేది తక్కువ... ప్రచార మోతెక్కువ

ABN , First Publish Date - 2020-06-05T09:58:45+05:30 IST

పేదల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచార మోత ఎక్కువ... లబ్ధి పొందుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అభిప్రాయపడింది.

ఇచ్చేది తక్కువ... ప్రచార మోతెక్కువ

  • పేదల పథకాలపై టీడీపీ పొలిట్‌బ్యూరో వ్యాఖ్య
  • క్షేత్రస్థాయిలో పర్యటించి అవినీతిపై పోరాటం


అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచార మోత ఎక్కువ... లబ్ధి పొందుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. అనేక నిబంధనలు, ఆంక్షలతో సామాన్యులకు ప్రభుత్వ లబ్ధి అందే అవకాశం ఉండటం లేదని విమర్శించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ‘‘ఇచ్చే రూ.పదివేలకే అనేక నిబంధనలు పెట్టి తమకు పఽథకాలు అందకుండా చేస్తున్నారని ఆటో డ్రైవర్లు, దర్జీలు, చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆరు లక్షల మంది డ్రైవర్లు ఉంటే, అందులో నాలుగు లక్షల మందికి ప్రభుత్వ సాయం ఎగ్గొట్టారు. ఆటో డ్రైవర్లకు సాయం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ జరిమానాల కింద రెండింతలు వసూలు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సున్నా వడ్డీ రాయితీ కూడా రెండు మూడు వందల రూపాయలే వచ్చిందని మహిళలు నిందిస్తున్నారు’’ అని పొలిట్‌బ్యూరో సమావేశం విమర్శించింది. వైసీపీ ఏడాది పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోవడంపై ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇళ్ల స్థలాలకు భూసేకరణలో అనేక నియోజకవర్గాల్లో పెద్దపెద్ద కుంభకోణాలు చోటుచేసుకొన్నాయి. రూ.ఏడు లక్షల విలువైన భూమికి రూ.70లక్షలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. భూముల రేట్లు పెంచి ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు వాటాలు వేసుకొని పంచుకొంటున్నారు.


బలిగొంటున్న నాసిరకం మద్యం 

ఇసుక విక్రయాల్లో విపరీతమైన అక్రమాలు చోటు చేసుకొంటున్నాయు. ఎక్కడి ఇసుకను అక్కడ విక్రయించకుండా వేరే జిల్లాలకు తరలించి లారీ 50 నుంచి 70 వేలకు అమ్ముతున్నారు. మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. కమీషన్లు తీసుకొని నాసిరకం మద్యం అమ్ముతున్నారు. మద్యం ధరలు భరించలేక స్పిరిట్‌ తాగి ఏడుగురు చనిపోయారు. వైసీపీ అధ్వాన్న పాలనకు ఇది నిదర్శనం’’ అని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. జగన్‌ పాలన బాగాలేదని స్వయాన వైసీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా మాట్లాడుతున్నారని ఈ సమావేశం వ్యాఖ్యానించింది. ఏడాది పాలనలో రూపాయి అభివృద్ధి కూడా జరగలేదని ఒక వైసీపీ ఎమ్మెల్యే చెబితే, ఇళ్ల స్థలాలకు పేదల నుంచి బలవంతంగా వసూళ్లు జరుగుతున్నాయని మరో ఎంపీ అనడం వైసీపీపాలన ఎంత మోసపూరితంగా జరుగుతోందో నిరూపిస్తోందని ఓ సీనియర్‌ నేత విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, గురువారం అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తల మామిడి చెట్లను నరికివేశారని సమావేశం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల ఖర్చును వైసీపీ నుంచి వసూలు చేయాలని డిమాండ్‌ చేసింది.


సీఎం తీరుతోనే కేంద్రం విద్యుత్‌ బిల్లు..

రైతులు దేశంలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అనుమతి ఇస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని పొలిట్‌బ్యూరో అభినందించింది.  కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లు గురించీ చర్చ జరిగింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పీపీఏల విషయంలో చేసిన నిర్వాకం వల్లే ఈ బిల్లు తేవాల్సిన పరిస్థితి వచ్చిందని సమావేశం అభిప్రాయపడింది. రెండు రాష్ట్రాల్లోను ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ప్రజల్లో చైతన్యం కలిగించాలని సమావేశం నిర్ణయించింది. ఈ భేటీలో యనమల, అశోక్‌ గజపతిరాజు, సోమిరెడ్డి, అయ్యన్న, ప్రతిభాభారతి, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, కాల్వ శ్రీనివాసులు, గల్లా జయదేవ్‌, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T09:58:45+05:30 IST