ఆనాడు జగన్ అలా... నేడు చంద్రబాబు ఇలా!

ABN , First Publish Date - 2021-03-01T19:03:55+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రేణిగుంట ఎయిర్‌పోర్టుపై పడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆనాడు జగన్ అలా... నేడు చంద్రబాబు ఇలా!

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రేణిగుంట ఎయిర్‌పోర్టుపై పడింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతున్న తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే బైఠాయించారు. అకారణంగా తనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలతో మాట్లాడటానికి వెళతానని చెప్పినా పోలీసులు ఆయనను బయటకు వెళ్లనివ్వలేదు. దీంతో తనకు అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. 


రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబును అడ్డుకోవడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఆనాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎపిసోడ్‌తో అటు వైసీపీ మద్దతుదారులు, ఇటు టీడీపీ మద్దతుదారులు కూడా పోల్చుతుండడం విశేషం. ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. తమ నేతను ఇలాగే అడ్డకున్నారు కదా అని వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్షనేతను అడ్డుకుంటే ప్రశ్నించని వాళ్లు ఇప్పుడెలా మాట్లాడతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. 


ఆనాడు పెట్టుబడుల కోసం విశాఖలో అత్యంత భారీ స్థాయిలో సదస్సు జరుగుతుంటే.. వైఎస్ జగన్ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారని టీడీపీ మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. 2017 జనవరిలో జరిగిన సమ్మిట్‌కు సంబంధించిన పేపర్ క్లిప్పింగులు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు కృషి చేస్తుంటే అది ఓర్చుకోలేక ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు జగన్ ప్రయత్నించారని.. అందుకే అడ్డుకోవలసి వచ్చిందంటూ ఆనాటి ఘటనలను గుర్తు చేస్తున్నారు. అయితే జగన్‌లా తమ నాయకుడు చంద్రబాబు ‘మీ అందరినీ గుర్తుంచుకుంటా’ అంటూ పోలీస్ అధికారులపై చిందులు వేయలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే కాబోయే ముఖ్యమంత్రిని అంటూ థర్డ్ గ్రేడ్ నేతలా వ్యవహరించలేదని ఎద్దేవా చేశారు. పోలీసులను గుర్తుంచుకుంటా అంటూ బెదిరింపులు లేవని, ప్రజాస్వామ్యం మీద, వ్యవస్థల మీద నమ్మకం ఉందని సూటిగా చెప్పారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలు, నిర్బంధాలనైనా ఎదుర్కునే సహనం తమ నాయకుడికి ఉందని, ఇది కదా అసలైన ప్రజానాయకుడి పోరాటం అంటూ టీడీపీ మద్దతుదారులు చెబుతున్నారు.

Updated Date - 2021-03-01T19:03:55+05:30 IST