Abn logo
Jun 17 2021 @ 10:32AM

సీఎం జగన్‌కు లేఖ రాసిన చంద్రబాబు

అమరావతి: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. మద్దతుధరకు కొనుగోలు చేయడంలోనూ  ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారిని నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతల్లో నగదు జమచేసేవారమని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో 21 రోజులకు పెంచిన బకాయిలు.. ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా ఉలుకు పలుకు లేదన్నారు. పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు?.. ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరు ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ. 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. రాయలసీమలో మొత్తం వేరుసెనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదన్నారు. మిల్లర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.