ఎన్నికలు ముందే వచ్చే చాన్సు!

ABN , First Publish Date - 2022-05-18T07:35:31+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024 కంటే ముందే వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఎన్నికలు ముందే వచ్చే చాన్సు!

శ్రేణులు, నేతలు సిద్ధంగా ఉండాలి

జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

వైసీపీ నేతల్లో ఓటమి భయం

గ్రామాల్లో వారికి నిలదీతలు

టీడీపీకి ఎదురొచ్చి స్వాగతాలు

ప్రజలకు మనమే ఆశాకిరణం

చంద్రబాబు స్పష్టీకరణ

గ్రామ నేతలతో టెలికాన్ఫరెన్స్‌

నేటి నుంచి సీమలో పర్యటన

బాదుడే బాదుడుకు హాజరు


అమరావతి/కడప, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024 కంటే ముందే వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. దానిని అదుపు చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎన్నికలకు ముందే వెళ్లే ఆలోచనలు చేస్తున్నారు. మన శ్రేణులు, నేతలు అన్నింటికీ సిద్ధపడి ఉండాలి’ అని పిలుపిచ్చారు. మంగళవారం ఆయన తమ పార్టీ గ్రామ, మండల కమిటీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అసమర్థ పాలనతో జగన్‌ సర్కారుపై అన్ని వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. టీడీపీ నేతలు, శ్రేణులు గ్రామాల్లో ఇళ్లకు వెళ్తుంటే ప్రజలు ఎదురొచ్చి తమ సమస్యలు చెప్పుకొంటున్నారని.. ‘గడప గడపకు’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు వెళ్తుంటే సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ నిర్ణయాలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు టీడీపీ ఆశాకిరణంగా కనిపిస్తోందని, తన పర్యటనలకు స్పందనలో ఈ కోణం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని.. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని  సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులే ఎదుగుతారని, అహం పెంచుకుని దూరంగా ఉంటే నష్టపోతారని స్పష్టం చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో బాదుడే బాదుడు, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితాల తనిఖీ, మహానాడు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.


నేడు కడపకు టీడీపీ అధినేత..

చంద్రబాబు రాయలసీమలోని మూడు జిల్లాల్లో బుధవారం నుంచి మూడ్రోజుల పాటు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుధవారం వైఎ్‌సఆర్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.30 గంటలకు ఇర్కాన్‌ సర్కిల్‌లోని డీఎ్‌సఆర్‌ ఫంక్షన్‌ హాలులో తొలుత జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఉమ్మడి కడప జిల్లాకు చెందిన టీడీపీ ఇన్‌చార్జులు, కార్యకర్తలతో భేటీలో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం చెన్నూరు, ఖాజీపేట మీదుగా వెళ్లి సాయంత్రం 4 గంటలకు కమలాపురంలో జరుగునున్న బాదుడే బాదుడులో పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు కర్నూలు చేరుకుంటారు. గురువారం (19న) కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం పీయపుల్లి మండలం జలదుర్గం గ్రామంలో సాయంత్రం 4 గంటలకు బాదుడే బాదుడులో పాల్గొంటారు. 20వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో సాయంత్రం 4 గంటలకు ఇదే కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated Date - 2022-05-18T07:35:31+05:30 IST