అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-24T17:03:03+05:30 IST

ఏపీకి అమరావతినే రాజధానిగా 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు చంద్రబాబు...

అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రైతుల ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామన్నారు. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు. 


రాజ‌ధాని ప్రాంతం శ్మశానం అన్న వాళ్లే... ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు  తెచ్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాజధాని విషయంలో నిలకడలేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి శాపంలా మారిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో నిలిచి పోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-24T17:03:03+05:30 IST