తెలంగాణకు లేని ఆ సమస్య ఏపీకి ఎందుకు వచ్చింది?: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-11T21:45:53+05:30 IST

రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టీడీపీ అధినేత మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు లేని ఆ సమస్య ఏపీకి ఎందుకు వచ్చింది?: టీడీపీ నేతలు

అమరావతి: రాష్ట్రంలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టీడీపీ అధినేత మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఏపీలోనే విద్యుత్ చార్జీలు అధికంగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఇవాళ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పేర్కొన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు.  సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చామని తెలిపారు. జగన్ రెడ్డి అంతా నాశనం చేశారని ధ్వజమెత్తారు. బొగ్గుకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే బహిరంగ మార్కెట్‌లో రూ.15 నుంచి రూ.20 పెట్టి కొనాల్సిన అవసరం రాదన్నారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారని చెప్పారు. తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని టీడీపీ నేతలు ప్రశ్నించారు. హౌస్ సైట్స్ విషయంలో వైసీపీ నేతలతోనే కోర్టులో పిటిషన్ వేయించి టీడీపీపై బురద జల్లుతున్నారని చెప్పారు. గృహ నిర్మాణ పునాదిపైన కేంద్రం రూ.3,700 కోట్లు విడుదల చేసిందన్నారు. దీనిలో రూ.2 వేల కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. దారిమళ్లించిన నిధులు లబ్ధిదారులకు ఎగనామం పెట్టేందుకు వైసీపీనే కోర్టులో కేసులు వేయించి దాన్ని ప్రతిపక్షాలకు అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి కట్టే ఇళ్లు శోభనానికి కూడా పనికిరావని వైసీపీ శాసనసభ్యులే చెప్పారని వ్యాఖ్యానించారు. సెంటు పట్టాలో రూ.6,500 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. రెండు సెంట్లు నగరాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నిధుల నుంచి మరో రూ.2 లక్షలు గృహనిర్మాణానికి విడుదల చేయాలన్నారు.

Updated Date - 2021-10-11T21:45:53+05:30 IST