మూడు రోజులుగా..ఎడతెగని వర్షం

ABN , First Publish Date - 2020-08-15T10:31:44+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా వర్షాలు విస్తారంగా కురిశాయి

మూడు రోజులుగా..ఎడతెగని వర్షం

నిండిన చెరువులు, కుంటలు

పొంగిపొర్లుతున్న వాగులు

ములుగు జిల్లాలో 116 మీమీ నమోదు

తోతట్టు ప్రాంతాలు జలమయం

మరో మూడు రోజులు కురిసే అవకాశం


హన్మకొండ, ఆగస్టు 14, (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా వర్షాలు విస్తారంగా కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడగా మరికొన్ని చోట్ల ఎడతెరిపిలేకుండా ముసురుపడింది. సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీ వర్షాల వల్ల చెరువులు, కుంటలు పూర్తిగా నిండి  జళకళను సంతరించుకున్నాయి. కాకతీయుల కాలం నాటి రామప్ప, లక్నవరం,  గణపసముద్రం నీటి మట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. పెద్ద చెరువుల్లోకి వరదనీరు ప్రవహించడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కల్వర్టుల మీది నుంచి పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. పాత ఇళ్ళు నాని కూలుతున్నాయి. వరంగల్‌ ఏనుమాముల ప్రాంతంలో వరదనీటిలో ఒక మృతదేహం కొట్టుకు వచ్చింది.  ములుగు జిల్లాలో మారుమూలు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి.


వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో..

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో గత 24 గంటల్లో సరాసరి 82.5 మిమీ వర్షం పడింది. హన్మకొండ మండలంలో రికార్డు స్థాయిలో 120.4 మిమీ వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 62.2 మిమీ, ఎల్కతుర్తిలో 66.4 మిమీ, కమలాపూర్‌లో 86.6 మిమీ, హసన్‌పర్తిలో 93.4మిమీ, ధర్మసాగర్‌లో 67.6మిమీ, వరంగల్‌లో 80.6 మిమీ వర్షం పడింది. వరంగల్‌ అండర్‌ రైల్వే గేట్‌ ప్రాంతంలో గుడిసెల్లోకి వర్షపు నీరు చేరింది. రంగశాయిపేటలో ఇంటి గోడ కూలింది. ధర్మసాగర్‌ మండల కేంద్రంలో వందేళ్ళనాటి పెద్ద రావిచెట్టు కూలిపోయింది. కమలాపూర్‌ మండలంలోని గూడూరులో ఒక ఇంటి గోడ కూలింది. భీమదేవరపల్లి మండలంలో పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో వంగర గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.   

 

రూరల్‌ జిల్లా..

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 80.5 మిమీ వర్షపాతం రికార్డయింది. కటాక్షపూర్‌ చెరువు నిండి వరదనీరు జాతీయ  రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. పాకాల సరస్సులోకి 31 అడుగులకు గాను 29.1 అడుగుల మేరకు నీరు చేరింది. 

 

మహబూబాబాద్‌ జిల్లా..

మహబూబాబాద్‌ జిల్లాలో 38.1 మిమీ వర్షం పడింది. కొత్తగూడ మండలంలోని పెద్దవాగు పొంగిపొర్లుతుండడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుగ్రామాల్లో నాట్లు నీటమునిగాయి. పాత ఇళ్ళు నాని గోడలు కూలాయి. 

 

జనగామ జిల్లాలో..

జనగామ జిల్లాలో 29.7 మి.మి వర్షపాతం నమోదైంది. విస్తృతంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచి ముసురుపడుతూనే ఉంది. జిల్లాలోని అన్ని చెరువులోకి భారీగా వరదనీరు చేరుతోంది.

 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో..

జిల్లాలో 74 మిమీ వర్షపాతం నమోదైంది. పలిమెల మండలంలోని పెద్దవాగు పొంగి పోర్లుతోంది. వాగవతల ఉన్న సుమారు 10 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. రవాణా ఆగిపోయింది. బొగ్గుగనుల్లో, ఓపెన్‌ కాస్ట్‌లోకి వరదనీరు చేరింది.  బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు రూ. 7 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. మేడిగడ్డ బ్యారేజీలోకి 2.91 లక్షల క్యుసెక్కుల వరద నీరు చేరింది. 57 గేట్లను ఎత్తివేశారు. దిగువకు 2.42 లక్షల క్యుసెక్కులనీరు ప్రవహిస్తోంది. మహదేవ్‌పూర్‌ మండలంలోని అన్నారం బ్యారేజీ 11 గేట్లు ఎత్తివేశారు. దిగువకు 29,700 క్యుసెక్కులనీరు ప్రవహిస్తోంది.

 

ములుగు జిల్లాలో..

ములుగు జిల్లాలో సరాసరి 116 మిమీ వర్షపాతం నమోదయింది. రామప్ప చెరువులోకి 31 అడుగుల మేరకు వరదనీర  చేరింది. జంపన్నవాగు, దయ్యాలవాగు  ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. మేడారం వద్ద జంపన్నవాగు బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద 7.3 మీటర్ల ఎత్తుకు వరదీ నీరు చేరింది. మారుమూల గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. అయిదు లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది.

Updated Date - 2020-08-15T10:31:44+05:30 IST