చలో రాజ్‌భవన్‌.. ఉద్రిక్తం!

ABN , First Publish Date - 2021-07-23T08:10:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది

చలో రాజ్‌భవన్‌.. ఉద్రిక్తం!

ఫోన్‌ ట్యాపింగ్‌పై టీపీసీసీ నిరసన

ధర్నా చౌక్‌ నుంచి రాజ్‌భవన్‌ వెళ్లేందుకు యత్నం

భట్టి, జగ్గారెడ్డి, అంజన్‌ సహా ముఖ్యుల అరెస్టు

స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన దుస్థితి వ చ్చింది: భట్టి


కవాడిగూడ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఉదయం గాంధీభవన్‌ నుంచి ధర్నా చౌక్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు.. అక్కడ భారీ సమావేశం నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరాగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఎం.అంజన్‌కుమార్‌యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్‌గౌడ్‌తోపాటు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. సమావేశం ముగియగానే చలో రాజ్‌భవన్‌ అంటూ కాంగ్రెస్‌ నేతలు, నాయకులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్య నేతలను అరెస్టు చేసేక్రమంలో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ముఖ్య నేతలను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత రాజ్‌భవన్‌ కాకుండా లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజే సేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లాయి. కొద్దిదూరం వెళ్లిన తర్వాత వారిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రతోనే కేంద్రం అప్రజాస్వామికంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. స్వాతంత్య్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసమని, కానీ ప్రస్తుతం ఆ స్వేచ్ఛనే హరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు. 


మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, ఎవరైనా ప్రశ్నిస్తే 124ఏ కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పెగాసస్‌ ఇజ్రాయిల్‌కు చెందిన సంస్థ అని, ఈ సంస్థను ఎవరు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. అంజన్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లే కుండా పోయిందని అన్నారు. కేంద్రం ప్రతిపక్షాల నోర్లు నొక్కేస్తుందని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతున్న మోదీ, అమిత్‌షా కూడా రాజద్రోహులేనని అన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయని అన్నారు. కాగా, చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


బలమూరి వెంకట్‌కు తీవ్ర గాయాలు

పోలీసులతో జరిగిన తోపులాటలో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌  గాయాలపాలయ్యారు. చికిత్స కోసం ఆయన్ను అబిడ్స్‌లోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. వెంకట్‌ పక్కటెముకలు విరిగాయని డాక్టర్లు తెలపడంతో హుటాహుటిన ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. బలమూరి వెంకట్‌పై పోలీసుల దాడి అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ పేర్కొన్నారు. 


ఇక.. గవర్నర్‌ ముట్టడే: జగ్గారెడ్డి


హైదరాబాద్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజ్‌ భవన్‌ ముట్టడే కాదని.. గవర్నర్‌ ముట్టడి చేపడతామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ‘‘మేము ఎలాంటి కార్యక్రమాలు చేసినా పోలీసులు రిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేేస్త కాంగ్రెస్‌ నాయకులు పోరాటాలు ఆపేస్తారని అనుకుంటున్నారా! మరోసారి అనుమతి ఇవ్వకపోతే నేరుగా గవర్నర్‌నే ముట్టడిస్తాం’’ అని తేల్చిచెప్పారు. చల్‌ రాజ్‌భవన్‌ కార్యక్రమం నేపథ్యంలో జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. అబిడ్స్‌ పోలీస్‌ ేస్టషన్‌కు తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇదే పోలీసులతో కేసీఆర్‌ సంగతి చూస్తామని అన్నారు. ‘పోలీసులకు మజాక్‌ అయిపోయింది.. మా ఓపిక నశిస్తుంది..శాంతియుతంగా గవర్నర్‌కు వినతి పత్రం ఇస్తామన్నా మమ్మల్ని అరెస్ట్‌ చే శారు. కాంగ్రెస్‌ వాళ్లు దరఖాస్తులు పెట్టి ఈడనే ఉంటరనుకుంటే పొరపాటు’’ అని మండిపడ్డారు. 

Updated Date - 2021-07-23T08:10:54+05:30 IST