చలో అమలాపురం ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-09-19T08:46:43+05:30 IST

హిందూ దేవతా విగ్రహాల ధ్వంసాలు... ఆలయ రథాల దగ్ధం... గుళ్లో ఆభరణాల దొంగతనం... రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై రాష్ట్ర బీజేపీ

చలో అమలాపురం ఉద్రిక్తం

  • భద్రతను ఛేదించుకుని బీజేపీ నేతల ఆందోళన
  • ఎమ్మెల్సీ మాధవ్‌ సహా 60 మంది నేతల అరెస్టు
  • పలు జిల్లాల్లో నేతల ముందస్తు గృహనిర్బంధం 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హిందూ దేవతా విగ్రహాల ధ్వంసాలు... ఆలయ రథాల దగ్ధం... గుళ్లో ఆభరణాల దొంగతనం... రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై రాష్ట్ర బీజేపీ ఉద్యమానికి దిగింది. ‘చలో అమలాపురం’ పేరుతో అన్ని జిల్లాల నుంచి పార్టీ నేతలు  కోనసీమకు బయలుదేరడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే అప్రమత్తమైన పోలీసులు అమలాపురం ప్రాంతంలో కర్ఫ్యూ ఉందని హెచ్చరించడంతోపాటు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొందరిని ముందుగానే గృహ నిర్బంధంలో ఉంచారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును బెజవాడలో, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో, పురందేశ్వరి ప్రకాశం జిల్లాలో, భానుప్రకాశ్‌రెడ్డి తిరుపతిలో, తిరుపతిరావు శ్రీకాకుళంలో... ఇలా రాష్ట్రవ్యాప్తంగా కీలక నేతలను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. అమలాపురం హోటల్లో విష్ణువర్ధన్‌రెడ్డిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణా జిల్లా సరిహద్దుల్లో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, రామకోటయ్య, అనంతపురంలో చిరంజీవిరెడ్డి తదితరులను అడ్డుకున్నారు.


ఉభయగోదావరి జిల్లాల సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి నేతల వాహనాలను పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారు. కోనసీమవ్యాప్తంగా శుక్రవారం నుంచి మూడు రోజులపాటు 144 సెక్షన్‌, 30 యాక్టులను అమల్లోకి తెచ్చారు. బీజేపీ చేపట్టే చలో అమలాపురం కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులతో పాటు తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దున గోదావరిపై ఉన్న చించినాడ బ్రిడ్జిని పోలీసులు స్వాధీన పర్చుకుని రాకపోకలను పూర్తిగా నిషేధించారు.   కోనసీమ వ్యాప్తంగా దాదాపు వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినా బీజేపీ కార్యకర్తలు అమలాపురం చేరుకున్నారు. 


బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వేర్వేరు మార్గాల నుంచి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లోకి చేరుకుని ఆందోళనకు దిగే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌, రాష్ట్ర కార్యదర్శులు నాగోతు రమేశ్‌నాయుడు, నీలకంఠ హరీశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కోశాధికారి వామరాజు సత్యమూర్తి, మహిళా నేత సాధినేని యామినీశర్మ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమాతోపాటు పలుచోట్ల ఆందోళనకు దిగిన 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లాలోని వివిధ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నారాయణన్‌నాయక్‌, రంపచోడవరం ఏఎస్పీ గరికపాటి బిందుమాధవ్‌, పలువురు పోలీసు ఉన్నతాధికారులు అమలాపురంలోనే మకాం వేశారు.


Updated Date - 2020-09-19T08:46:43+05:30 IST