ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-09-15T05:44:16+05:30 IST

ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

తొర్రూరు, సెప్టెంబరు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు మరో సాయుద పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుద పోరాట వారోత్సవాల్లో భాగంగా 73వ వార్షికోత్సవ సందర్భంగా ప్రారంభించిన బస్సు యాత్ర మంగళవారం తొర్రూరుకు చేరుకుంది. ఈసందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రజాకార్లను తరిమికొట్టిన ఎర్రజెండాకు నియంత కేసీఆర్‌, మోదీ పాలన అంతం చేయడం లెక్క కాదన్నారు. రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు, ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుంటే రైతులపై మోదీ ప్రభుత్వం దాడులు చేస్తుందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం చులకనగా చూస్తుందని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులను వంచన చేసుకుని పాలన కొనసాగిస్తున్నారని, వారికి తెలంగాణ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలు సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే రాష్ట్ర ఫలాలు కొన్ని వర్గాల ప్రజలకే అందుతున్నాయని, అందుకే మరో సామాజిక తెలంగాణ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

అనంతరం అమరవీరుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు విజయవంతం చేయాలని, సీపీఐ మరో భూపోరాటాలకు సిద్ధం అవుతుందని, ప్రజలను చైతన్యవంతం చేయడానికే ఈయాత్ర నిర్వహిస్తున్నామని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, తమ్మెర విశ్వేశ్వరరావు, జిల్లా కార్యదర్శి విజయసారథి, ఓమ బిక్షపతి, ఎల్లయ్య, గట్టు శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.    

Updated Date - 2021-09-15T05:44:16+05:30 IST