శతాధిక నాటక రచయిత

ABN , First Publish Date - 2022-04-04T06:54:13+05:30 IST

కీర్తిశేషులు కొర్రపాటి గంగాధరరావుగారు 1922 మే 10న జన్మించారు. వీరు కథ-నవల- నాటక ప్రక్రియలన్నింటా ప్రవేశమున్నా-నాటక రచయితగానే వాసికెక్కారు...

శతాధిక నాటక రచయిత

కీర్తిశేషులు కొర్రపాటి గంగాధరరావుగారు 1922 మే 10న జన్మించారు. వీరు కథ-నవల- నాటక ప్రక్రియలన్నింటా ప్రవేశమున్నా-నాటక రచయితగానే వాసికెక్కారు. ఈయన రచయితేగాక, నటుడు, నాటక ప్రయోక్త కూడానని చాలామందికి తెలియదు. నాకు తెలిసి నాటకాలు, నాటికలు కలిపి 131 రాశారు. అలాగే 12 రేడియో నాటకాలు వీరి ఖాతాలో ఉన్నాయి. ఈయన విశిష్టమయిన కథలు, నవలలు (లంబాడోళ్ళ రాందాసు, బోధిశ్రీ) తెలుగు పాఠకులకు పరిచయమే. కొర్రపాటి గంగాధర రావు గారు 27.01.1986న మరణించారు. 


రంగస్థల కళాకారుల ఉపయుక్తార్థం 65 వ్యాసాలు వీరి అనుభవసారంగా వచ్చాయి. వీరు వృత్తిరీత్యా యల్‌.యం.పి డాక్టర్‌గా బాపట్లలో స్థిరపడినా ప్రవృత్తిరీత్యా నాటక రచయితగా నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రంగస్థలాభిమానులకు తెలిసినవారే. వీరి సంభాషణ చతురత తెలిసి నాటి ఆదుర్తి సుబ్బారావు (ఇద్దరు మిత్రులు), బి.యన్‌. రెడ్డి (బంగారు పంజరం) లాంటి దర్శకులు వారి చిత్రాలకు మాటల రచయితగా పరిచయం చేశారు. ఐదు సినిమాలకు మాటలు రాసినా సినీ పరిశ్రమలో ఇమడలేకపోయారు. వీరి నాటకాలలో అత్యుత్తమమైనది ‘యథా ప్రజా - తథా రాజ’. తెలుగు నాటక ప్రియులనేగాక, సాహిత్య ప్రియులనూ కదిలించింది. ఈ నాటకానికి యాభై ఏళ్ళు (మొదటి ప్రదర్శన- 9.2.1972). 1976లో ఇది ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతిని అందుకుంది. వీరి రంగస్థల సేవలను ఆంధ్ర ప్రదేశ్‌ నాటక అకాడమీ వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. సంగీత నాటక అకాడమీవారు నిర్వహించిన నాటకోత్సవాలలోనూ ఉత్తమ రచనగా ‘యథా ప్రజ - తథా రాజ’ నాటకం ఎంపికయింది. 


గంగాధరరావు డాక్టర్‌ గరికపాటి రాజారావుగారికి మద్రాసులో యల్‌.యం.పిలో సహాధ్యా యులు. ఆయనతో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు. వీరి నాటకాలలో ‘నిజరూపాలు’, ‘తెరలో తెర’, ‘భవబంధాలు’, ‘రాగశోభిత’, ‘గృహదహనం’, ‘రాగద్వేషాలు’, ‘ఆరని పారాణి’, ‘నిర్మల’, ‘కమల’, ‘ఈ రోడ్డెక్కడికి’, ‘తస్మాత్‌ జాగ్రత్త’, ‘భాయి భజరంగ్‌’, ‘గుడ్డిలోకం’ ప్రజాదరణ పొందాయి. నాటికల్లో ‘పెండింగ్‌ ఫైల్‌’కు విశేష ఆదరణ లభించింది. రాయం రంగనాథం పేరున 13 హాస్య నాటికలు (స్త్రీ పాత్ర లేనివి) ప్రత్యేకించి కాలేజీ యువకులు, ఔత్సాహిక నటుల కోసం ప్రదర్శనా సౌలభ్యంగా రాశారు. తెలుగు నాటక రంగాన ఇలా ఒకే పేరు మీద సీక్వెల్‌గా రాయటం- ప్రదర్శించడం ఒక అద్భుతం. నేటికీ ఏ రచయితా చెయ్యని ప్రయోగంగా ఇది నిలిచిపోయింది. 


పోటీలో ఒకే నాటికను వివిధ సంస్థలచే ప్రదర్శింపజేసే ప్రయోగానికి ఊపిరి పోసింది కొర్రపాటివారే. అలాగే పరిషత్తులో ఉత్తమ నటులను, నటీమణులను ఎంపిక చేసి, వారికి ఒక సంఘటన చెప్పి, అప్పటికప్పుడు (పది నిమిషాల్లో) నటింపజేసే పోటీలకూ ఆయనే కర్త. అలాగే నాటక పోటీలలో ఉత్తమ నటుడు, నటి, హాస్య నటుడు, కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌ లాంటి బహుమతులకు గాను మొత్తం నాటకాలకు అయిదు లేక పది ఉత్తమ నటులు అంటూ బహుమతులివ్వడం, సత్కరించడం పద్ధతీ ఆయనదే!


కళావని నాటక విద్యాలయం ప్రారంభించి ఎందరో ఔత్సాహిక కళాకారులకు శిక్షణనిచ్చారు. వారి శిష్యులలో పి.యల్‌. నారాయణ, కె.యస్‌.టి. శాయి నటులుగా రంగస్థలాన, సినీ రంగాన భాసిల్లారు. నటుడు, ప్రయోక్త, విశ్రాంత ఆచార్యులు డి.యస్‌.యన్‌. మూర్తిగారు నేటికీ రంగ స్థలాన ఉత్సాహంగా కనిపిస్తూనే వున్నారు. వీరు గంగాధరరావుగారి బృందం వారె. 


నాటక రచయితగా ఆయనది ఒక ప్రత్యేక స్థానం. సమాజం పట్ల, జీవితం పట్ల ఒక నిర్దిష్ట అభిప్రాయం గల మనిషి కావడంతో ఆయన రచనలన్నింటా సామాజిక స్పృహ కనిపిస్తుంది. అయోమయంలో చీకట్లో బతుకుతున్న సామాన్యులకు అవసరమైన ఆసరాగా ఆయన రచనలు సాగాయి. ఒకనాటి కంచికచర్లలో జరిగిన సజీవ దహనానికి రూపకల్పనే ‘యథా ప్రజ - తథా రాజ’ నాటకం. నాటకంలో సంక్షిప్తంగా ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న ఆగడాలను చూపిస్తూ- ‘‘పది రూపాయలిస్తే (పది ఉచిత పథకాలిస్తే) ఓట్లేసే జనానికి పదికోట్లకు (వేలకోట్లకు) దేశాన్ని అమ్మేసే (తాకట్టు పెట్టే) ప్రభుత్వాలు వస్తాయి’’ అని హెచ్చరిస్తాడు రచయిత. 


కీ.శే. కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ కథను నాటకంగా ఊహించలేము. అలాంటి క్లిష్టమైన కథాంశాన్ని అద్భుతంగా నాటికగా మలిచి, గొప్ప కథల్ని ఎలా నాటకంగా మలచాలో దారి చూపిన గురువతను. ఆ స్ఫూర్తితోనే ఎందరో రచయితలు మంచి కథలని దృశ్యమానం చేశారు రంగస్థలాన. 


వచ్చే మే నెల 10వ తేదీన కొర్రపాటి గంగాధరరావు శతజయంతి సందర్భంగా కళాకారులు, నాటక రచయితలదీ ఒక  అభ్యర్థన. గంగాధరరావుగారి 131 నాటకాలు/ నాటికలు మరుగున పడిపోకుండా రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య/ నాటిక అకాడమీలు ముందుకు వచ్చి వాటికి పునర్ముద్రణ భాగ్యం కల్పించాలి. కనీసం రెండు రాష్ట్రాల తెలుగు యూనివర్సిటీలైనా ముందుకొచ్చి నాటక ప్రియులకు సాహిత్యాభిలాషులకు ఊరట కలిగించడమే ఆయన శతజయంతి వేడుకల్లో మనమందించే ఘనమైన నివాళి. 

వారాల కృష్ణమూర్తి

Updated Date - 2022-04-04T06:54:13+05:30 IST