కట్టుబట్టలతో మిగిలాం

ABN , First Publish Date - 2020-10-24T08:45:51+05:30 IST

‘‘చెరువులు తెగాయి. నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లలోకి ఆరేడు అడుగుల మేర వరద నీరు రావడంతో కట్టుబట్టలతో మిగిలాం. ఒక్కసారిగా వరద రావడంతో కనీసం నిత్యావసరాలు, గృహోపకరణాలు

కట్టుబట్టలతో మిగిలాం

ఇళ్లలో ఆరడుగుల మేర నీళ్లొచ్చాయి..

కేంద్ర బృందంతో ముంపు ప్రాంత వాసులు

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు

స్థానికులతో మాట్లాడి సమాచార సేకరణ

ప్రభుత్వ విభాగాల నుంచి నష్ట వివరాలు!

 ముగిసిన పర్యటన.. నేడు ఢిల్లీకి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌ వర్క్‌)

‘‘చెరువులు తెగాయి. నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లలోకి ఆరేడు అడుగుల మేర వరద నీరు రావడంతో కట్టుబట్టలతో మిగిలాం. ఒక్కసారిగా వరద రావడంతో కనీసం నిత్యావసరాలు, గృహోపకరణాలు కూడా కాపాడుకోలేకపోయాం’’.. రాజధాని హైదరాబాద్‌లో వరద ముంపునకు గురైన పలు కాలనీలు, బస్తీలవాసులు కేంద్ర బృందం ఎదుట వ్యక్తం చేసిన ఆవేదన ఇది. వరద ముంపు తీవ్రత, నష్టం అంచనాకు కేంద్ర బృందం గురువారం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బృందం వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో పర్యటించింది. ముంపునకు కారణాలను, చెరువులు, నాలాల పటిష్ఠతకు, పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వారికి వివరించారు. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, ఎస్పీడీసీఎల్‌కు కలిపి దాదాపు రూ.700 కోట్ల వరకు నష్టం జరిగిందని తెలిపారు.


రెండో బృందం..

వరదల కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్న రెండో బృందం.. రైతులు, అధికారుల నుంచి వివరాలు సేకరించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలోని గౌరెల్లిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద, గౌరెల్లి బ్రిడ్జి సమీపంలో వరదలకు ధ్వంసమైన వరిపంటలను పరిశీలించారు. చేతికి వచ్చిన పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో తడిసిన వరి పైరును కేంద్ర బృందానికి చూపించారు. అలాగే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకరవర్గంలోని తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధి రావిరాల, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో కూడా వారు పర్యటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టానికి గాను ఎకరాకు రూ. 30 వేల చొప్పున ఆయా రైతులకు పరిహారంగా ఇవ్వాలంటూ కేంద్ర బృందాన్ని కిసాన్‌ కాంగ్రెస్‌ కోరింది. దెబ్బతిన్న పంటల సేకరణలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి నిబంధనలు సడలించాలనీ విజ్ఞప్తి చేసింది. వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందాన్ని కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఇక.. భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌ నగరంలో ఏర్పడిన విపత్తు.. మానవ తప్పిదమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. తమకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే వివరిస్తామంటూ కేంద్ర బృందాన్ని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారంనాడు కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ వశిష్టకు ఈ మెయిల్‌ ద్వారా లేఖ  పంపారు. 


మార్గదర్శకాల ప్రకారం మదింపు..

రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం పర్యటన శుక్రవారంతో ముగిసింది. శనివారం ఉదయం వారు న్యూఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. మరోవైపు కచ్చితమైన లెక్కలతో త్వరలో కేంద్రప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలోపే రాష్ట్రప్రభుత్వం నివేదిక ఢిల్లీకి వెళ్లనుంది. వరద లతో అన్ని శాఖలకు జరిగిన నష్టం రూ.8 వేల కోట్లలోపే ఉండే అవకాశాలున్నాయని సమాచారం. వరదలతో 33ుమేర పంట దెబ్బతిని ఉండాలన్న కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి పంట నష్టం అంచనాలను మదింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2020-10-24T08:45:51+05:30 IST