ఓపెన్ రాక్ మ్యూజియం ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

ABN , First Publish Date - 2022-01-07T00:23:50+05:30 IST

నగరంలోని సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ (ఎన్ జిఆర్ఐ)లో వినూత్నంగా ఏర్పాటైన "రాక్ మ్యూజియం"ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ (స్వతంత్ర), ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి,అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు.

ఓపెన్ రాక్ మ్యూజియం ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

హైదరాబాద్: నగరంలోని సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ (ఎన్ జిఆర్ఐ)లో వినూత్నంగా ఏర్పాటైన "రాక్ మ్యూజియం"ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ (స్వతంత్ర), ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి,అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు మంత్రి పర్యటించనున్నారు.తెలియని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని విద్యావంతులను చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో 530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి కొన్ని రాళ్లు కూడా ఉన్నాయి. భూమి అడుగు భాగాన 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లు కూడా వీటిలో ఉన్నాయి. 


ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ జ్ఞాన ఆధారిత  ఆర్థిక వ్యవస్థలో " బిగ్ ఎర్త్ డేటా" అత్యంత కీలకం పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ అంశాన్ని గుర్తించిన భారతదేశం ఈ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోందని మంత్రి చెప్పారు. భూ శాస్త్ర రంగ అభివృద్ధికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సాధికార భారతదేశ నిర్మాణ సాధనకు భూగర్భ శాస్త్రం అంశాలు ఎంతగానో సహకరిస్తున్నాయని పేర్కొన్న మంత్రి ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.వినూత్న విధానాలతో శాస్త్రీయ విధానాలను అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు సౌలభ్య జీవన సౌకర్యం అందించవచ్చునని జితేంద్ర సింగ్ అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రం సహకారంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు.శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక ఆధారిత వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టుల అమలుకు పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. 


దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు ' అజాది కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న సమయంలో  సిఎస్ఐఆర్ 80 సంవత్సరాల సేవను పూర్తి చేసుకుని ప్రగతిపథంలో పయనిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సమయంలో శాస్త్ర రంగంతో సంబంధం కలిగి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు శాస్త్ర సాంకేతిక అన్వేషణలకు ప్రాధాన్యత ఇచ్చి స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు. బలమైన శాస్త్ర సాంకేతిక పునాదితో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుందని అన్నారు. 100 సంవత్సర స్వాతంత్రం పూర్తి చేసుకునేందుకు 25 సంవత్సరాల సమయం ఉందని, ఈ సమయంలో కలలు సాకారం కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 




Updated Date - 2022-01-07T00:23:50+05:30 IST