కేంద్రం లాక్డౌన్ను సడలిస్తే ఎలా?
ABN , First Publish Date - 2020-04-12T08:49:32+05:30 IST
కేంద్రం ఒకవేళ లాక్డౌన్ను సడలిస్తే ఎలా వ్యవహరించాలన్న అంశంపై శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మొదలైన
- పరిశ్రమలకు సడలింపు ఇచ్చే అవకాశం
- కరోనా కట్టడికి పూర్తి లాక్డౌన్ తప్పనిసరి
- కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఒకవేళ లాక్డౌన్ను సడలిస్తే ఎలా వ్యవహరించాలన్న అంశంపై శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మొదలైన మంత్రివర్గ సమావేశం ఐదు గంటలపాటు సాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో లాక్డౌన్ అమలుకు సంబంధించి కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్ మంత్రులకు తెలియజేశారు. ప్రత్యేకించి పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. దేశవ్యాప్త లాక్డౌన్ గడువు 14న ముగియనున్న నేపథ్యంలో నెలాఖరు వరకు కొనసాగించాలని తాను వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీకి స్పష్టం చేసినట్లు కేసీఆర్ వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఈ నెల 30వరకు లాక్డౌన్, రాత్రి వేళల్లో యఽథావిధిగా కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగిద్దామని, అలా చేస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని మంత్రులకు చెప్పారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. సడలింపుల వల్ల లాక్డౌన్ను సమర్థంగా అమలు చేయటంలో సమస్యలు రావచ్చని కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రజల రాకపోకలను నియంత్రించటం కూడా ఇబ్బందిగా మారుతుందన్నారు. అయితే కేంద్రం దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగింపు విధివిధానాలను ప్రకటించిన తర్వాత, అందుకనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారిద్దామని చెప్పారు. కాగా, ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగంతో మంత్రులు సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని సీఎం కేసీఆర్ మంత్రులకు వివరించారు. కేంద్రం ఆర్థిక సాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ ఖర్చులు తగ్గించుకోవాలని ఆదేశించారు.
శభాష్ గంగుల
కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ను అభినందించారు. కరీంనగర్లో కరోనా కట్టడికి చేసిన కృషి ఫలించిందన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజల్లో ధైర్యం నింపారని ప్రశంసించారు.