అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-02-28T01:20:38+05:30 IST

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర అటవీ శాఖ ఉన్నతాధికారుల బృందం అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పర్యటించింది.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం

హైదరాబాద్: తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర అటవీ శాఖ ఉన్నతాధికారుల బృందం అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పర్యటించింది. అటవీ శాఖ నేతృత్వంలో పులుల అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ది, సంక్షేమ పథకాలను కేంద్ర బృందం పరిశీలించింది. శ్రీశైలం దారిలో మన్ననూరు వద్ద అమ్రాబాద్ టైగర్ రిజర్వు కేంద్రానికి కొ్త్తగా ఏర్పాటు చేసిన ముఖ ద్వారాన్ని డైరెక్టర్ జనరల్ చంద్ర ప్రకాష్ గోయల్, అధికారులతో కలిసి ప్రారంభించారు.టైగర్ రిజర్వు విశిష్టతను కాపాడుతూ అటవీ శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కేంద్ర బృందం ప్రశంసించింది. అమ్రాబాద్ నుంచి దోమల పెంట దాకా సుమారు 70 కిలో మీటర్ల మేర రహదారిని ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు అటవీ శాఖ తీవ్రంగా కృషిచేస్తోంది. పర్యాటకులు, ప్రయాణీకులు ప్లాస్టిక్, గ్లాస్ వస్తువులను వదిలేస్తే, రోజూ వారీ చెత్తను వెంటనే సేకరించి మన్ననూరులో ఏర్పాటు చేసిన రీ సైక్లింగ్ కేంద్రానికి తరలించేందుకు 15 చెంచులతో కూడిన బృందాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేసింది.టైగర్ రిజర్వు కేంద్రాల్లో ఈరకమైన రీ సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం దేశంలోనే మొదటి సారి అని కేంద్రం బృందం మెచ్చుకుంది. 


దీనితో అభయారణ్యంలో జంతువులకు ప్లాస్టిక్ చేరకుండా అడ్డకట్ట వేయవచ్చని అధికారులు అన్నారు. మన్ననూరులో ఉన్న వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రాన్ని, జంతు విసర్జితాలు, అవశేషాలను విశ్లేషించి, అధ్యయనం చేసే బయోల్యాబ్ ను ఉన్నతాధికారులు పరిశీలించారు. అపోలో ఫౌండేషన్ సహకారంతో చెంచు మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ప్యాకేజింగ్ వర్క్ షాపు ను అధికారులు బృందం ప్రారంభించింది.టైగర్ రిజర్వు పరిధిలో వాడేందుకు వీలుగా పర్యావరణ హిత జ్యూట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని చెంచులతో తయారు చేయించేందుకు వీలుగా ఒక కేంద్రాన్ని మన్ననూరులో అటవీ శాఖ ఏర్పాటు చేసింది. అలాగే అపోలో హాస్పటల్ సహకారంతో ఏర్పాటు చేసినఆరోగ్య కేంద్రాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించింది. అటవీ శాఖ సిబ్బందితో పాటు, గిరిజనులకు అవసరమైన వైద్యం, మందుల సహాయాన్ని ఈ కేంద్రం అందిస్తుంది. 


వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యాన్ని అందించేందుకు వీలుగా సంపెన్ పడేల్ గడ్డి క్షేత్రం దగ్గర సోలార్ బోర్ వెల్ ను అధికారులు ప్రారంభించారు.అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ద్వారా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం అటవీ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అచ్చంపేట అటవీ కార్యాలయంలో చౌసింగా పేరుతో మీటింగ్ హాల్, నల్లమల అటవీ ప్రాంతానికి ప్రత్యేకమైక ఔషధ మొక్కలతో కూడిన మెడిసినల్ గార్డెన్ ప్రారంభించటంతో పాటు, కొత్తగా నిర్మించనున్నఅటవీ అమరవీరుల స్థూపానికి అధికారులు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సీపీ గోయల్ తో పాటు జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్.పీ యాదవ్, నేషనల్ కంపా సీనియర్ అధికారి రమేష్ పాండే, ఉత్తర ప్రదేశ్ పీసీసీఎఫ్ మధు శర్మ, పీసీసీఎఫ్ ఆర్. శోభ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, నాగర్ కర్నూల్ డీఎఫ్ఓ కిష్టా గౌడ్, ఎఫ్డీఓ రోహిత్ గోపిడి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-02-28T01:20:38+05:30 IST