ఉపాధి పనులపై కేంద్రం నజర్‌

ABN , First Publish Date - 2022-08-08T08:00:09+05:30 IST

ఉపాధి పనులపై కేంద్రం నజర్‌

ఉపాధి పనులపై కేంద్రం నజర్‌

అనుమతి లేని పనులపై తెలంగాణలో తనిఖీలు

ఏపీలోనూ ఉంటాయంటూ సంకేతాలు

చట్ట విరుద్ధంగా జగనన్న కాలనీల్లో లెవలింగ్‌

అదే బాటలో సచివాలయాల నిర్మాణాలు

రూ.1,150 కోట్ల రికవరీ తప్పదా?

కేంద్రం ఆదేశాలతో అధికారుల గుండెల్లో రైళ్లు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఇంటి స్థలాల చదును పనుల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందా? కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనుమతి లేని పనులు చేపట్టినందుకు జగన్‌ సర్కారు మూల్యం చెల్లించుకోనుందా? రాష్ట్రంలో ఉపాధి నిధులతో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల చదును పనులకు వెచ్చించిన రూ.1,150 కోట్లను అధికారుల నుంచి రికవరీ చేసి రాష్ట్ర ఉపాధి హామీ నిధుల్లో జమచేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందా? అవును.. ఇలాంటి పనులకు వెచ్చించిన నిధులను వెంటనే సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఇప్పటికే ఆదేశించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉపాధి పథకంలో అనుమతి లేని కొన్ని రకాల పనులు చేపట్టిందని కేంద్రం తేల్చింది. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి తనిఖీలు జరగవచ్చనే ఆందోళన అధికారుల్లో ఏర్పడింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అనుమతి లేని పనులు ఎక్కువగానే జరిగాయి. ఉపాధి పథకంలో అనుమతి లేని జగనన్న కాలనీల లెవలింగ్‌ పనులు, సచివాలయాల భవన నిర్మాణాలు భారీగా రాష్ట్రంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్‌ జారీచేసింది. అనుమతి లేని పనులు చేపట్టిన అధికారుల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించింది. ఇక నుంచి ఉపాధి చట్టంలోని జాబితాలో ఉన్న పనులనే మంజూరు చేయాలని ఆదేశించింది. 


రాష్ట్ర అధికారుల అత్యుత్సాహం..

ఉపాధి చట్టం ప్రకారం ఇళ్ల కాలనీల చదునుకు ఉపాధి నిధులు వినియోగించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన పేదల వ్యక్తిగత ఇంటి నివేశన స్థలాల చదునుకు ఉపాధి నిధులు వినియోగించుకునే అవకాశముంది. అది కూడా ఆయా కుటుంబాలకు కేటాయించిన 100 రోజుల పనిదినాల్లో ఆయా కుటుంబాలే పని చేసుకోవాలి. రవాణాకు కొద్దిపాటి మెటీరియల్‌ నిధులు వినియోగించుకోవచ్చు. అంటే వ్యక్తిగత ఇంటి స్థలాల చదునుకు మాత్రమే అవకాశముంది. కాలనీల చదునుకు  అవకాశం లేదు. ఈ చట్టంలోని షెడ్యూల్‌-1లోపేర్కొన్న జాబితాలో కాలనీల చదును పనులు లేవు. అయితే రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి అధికారులు అత్యుత్సాహంతో జగనన్న కాలనీల చదునుకు ఉపాధి పథకంలో అనుమతించారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇలాంటి అనుమతిలేని పనులు చేపట్టారని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గుర్తించింది. బాధ్యులైన ప్రోగ్రాం అధికారి/ఏజెన్సీ నుంచి ఆ నిధులు రికవరీ చేసి ఆ రాష్ట్ర ఉపాధి హామీ పథకం నిధుల ఖాతాలో జమచేయాలని ఆదేశాలిచ్చింది. 


దోపిడీకి తెరతీశారు..

ఉపాధి చట్టంలోని షెడ్యూల్‌-1 ప్రకారం 45 కేటగిరీల్లో 262 రకాల పనులు చేపట్టేందుకు అనుమతి ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మాస్టర్‌ సర్క్యులర్‌-2020-21లోనూ ఇదే పేర్కొన్నారు. ఇవి మినహా ఇతర ఏ పనులు చేపట్టినా ఆ నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాల చదును పనులు వైసీపీ మండల, గ్రామ స్థాయి నేతలకు కల్పతరువులుగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి పథకం కింద చేపట్టిన ఈ పనుల్లో అధిక అంచనాలు రూపొందించి నేతలకు అప్పనంగా దోచిపెట్టేందుకు మార్గం సుగమం చేశారు. సిమెంట్‌, ఇటుకల్లాగే మట్టినీ కొనుగోలు చేస్తున్నట్లు ఎస్టిమేట్లలో చూపించి సుమారు రూ.1150 కోట్లు వైసీపీ నేతల జేబుల్లో వేసుకున్నారని ఫిర్యాదులొచ్చాయి. ప్రభుత్వ భూముల్లో తవ్వి తెచ్చిన మట్టిని కొనుగోలు చేసినట్లు చూపించి స్వాహా చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఎకరాకు సుమారు 4 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరమని అంచనాలు వేశారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.230 నుంచి రూ.300 దాకా రేట్లు నిర్ణయించి ఎకరాకు సుమారు రూ.10 లక్షలకుపైగా అంచనాలు తయారుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందులో కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ అనే పేరుతో క్యూబిక్‌ మీటర్‌కు రూ.134.34 ధర నిర్ణయించారు. ఇది కాకుండా మట్టి తీసుకురావడం, చదును చేయడం తదితర ఇతర కార్యక్రమాలకు వేరుగా రేట్లు రూపొందించారు. కాస్ట్‌ ఆఫ్‌ గ్రావెల్‌ అంటే మట్టిని రవాణా చేసేందుకు అనుకూలంగా చేయడానికి వెచ్చించిన వ్యయంగా భాష్యం చెప్పారు. వాస్తవానికి క్యూబిక్‌ మీటర్‌ మట్టి తవ్వి తీసేందుకు ఏ రకంగా రేటు నిర్ణయించినా రూ.34కు మించదు. తవ్వి తీసే మట్టి రాష్ట్ర ప్రభుత్వ లేక పంచాయతీల ఆస్తి అనుకుంటే, ఆ నిధులను ఆ విభాగాల  లేక పంచాయతీల అకౌంట్లలో జమ చేయాలి. కానీ, వైసీపీ నేతలకు ఎందుకు చెల్లిస్తున్నారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. 60 శాతం పనులు కూలీలతో చేయించి, 40 శాతం పనులకు మెటీరియల్‌ నిధులు వాడాల్సి ఉంది. ఆ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. యంత్రాలు వినియోగించి మొత్తం మెటీరియల్‌ కింద పనులు చేపట్టారు. ఇది కూలీల కోసం ఉద్దేశించిన పథకం. పనులు కూలీలకు పని కల్పించేవిగానూ, ప్రజలకు ఉమ్మడి ఆస్తులు సమకూర్చేవిగానూ ఉండాలి.  జేసీబీ, ప్రొక్లెయన్‌ తదితర యంత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. ట్రాక్టర్లు, రోలర్లు తదితర కొన్ని సూచించిన యంత్రాలను మాత్రమే వినియోగించేందుకు అవకాశముందని పథకం స్పష్టంగా పేర్కొన్నారు. అయితే చేసిన పనుల్లో కూలీల భాగస్వామ్యం 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి పనులతో పథకం స్ఫూర్తి దెబ్బతింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


సచివాలయాల నిర్మాణాలకు ఇలా..

గ్రామ సచివాలయాల నిర్మాణాలకూ ఉపాధి హామీ పథకంలో అనుమతి లేదు. ఉపాధి నిధులతో గ్రామ పంచాయతీల భవనాలు మాత్రమే నిర్మించుకునే అవకాశముంది. అయితే, గ్రామ పంచాయతీల పేరున సచివాలయ భవనాల నిర్మాణాలు చేపట్టేశారు. పలుచోట్ల రెండు మూడు గ్రామ పంచాయతీలను కలిపి ఒకే సచివాలయం ఏర్పాటు చేశారు. అలాంటి చోట్ల ఇప్పటికే సచివాలయ భవనాలు మంజూరై నిర్మాణాలు పూర్తయ్యాయి. అయినా అక్కడ మళ్లీ కొత్త భవనాలు నిర్మించతలపెట్టారు. నిబంధనలకు తిలోదకాలిచ్చారు. కేంద్ర అధికారులు తనిఖీ నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు మూల్యం చెల్లించక తప్పదు. సుమారు రూ.2 వేల కోట్ల రికవరీ తప్పదనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

Updated Date - 2022-08-08T08:00:09+05:30 IST