తిరుపతిలో మంత్రి పెద్ది‌రెడ్డి ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డు

ABN , First Publish Date - 2020-10-01T01:01:39+05:30 IST

మారుతీనగర్, రాయల్ నగర్ అనే రెండు ప్రాంతాలను కలుపుతూ నగర పాలకసంస్థ అధికారులు ఒక సిమెంట్ రోడ్డు వేశారు. దీని ఖర్చు..

తిరుపతిలో మంత్రి పెద్ది‌రెడ్డి ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డు

తిరుపతి: మారుతీనగర్, రాయల్ నగర్ అనే రెండు ప్రాంతాలను కలుపుతూ నగర పాలకసంస్థ అధికారులు ఒక సిమెంట్ రోడ్డు వేశారు. దీని ఖర్చు ఇరవై లక్షల రూపాయలు. ఈ లింకు రోడ్డుతో స్థానికులకు ఎంతో మేలు జరిగిందని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. 300 మీటర్ల పొడవు ఉన్న ఈ సిమెంట్ రోడ్డు మంత్రి పెద్దిరెడ్డి ఇంటి కోసం వేసింది. ఈ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద మొదలై పెరటు ద్వారం వద్ద అంతమైపోతుంది. రోడ్డుకు అటొక గేటు, ఇటొక గేటు ఉంటుంది. మంత్రి గారికి తప్ప మరొకరికి ఉపయోగపడని రోడ్డును మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ నిధులతో నిర్మించారు. తిరుపతి 18వ డివిజన్ పరిధిలో ఉన్న మారుతీనగర్‌లో మంత్రి పెద్దిరెడ్డి నివాసం ఉంటున్నారు. 


సువిశాలమైన ప్రాంగణంలో లంకంత ఇల్లు. దానికి పశ్చిమ ప్రవేశ ద్వారం ఉంది. చాలా ఏళ్లుగా రాకపోకలకు ఆ మార్గాన్నే వినియోగిస్తున్నారు. వెనుక వైపున అంటే తూర్పున కూడా వారి ప్రాంగణం రోడ్డును తాకుతుంది. దాన్ని వినియోగిస్తే మంత్రి, ఆయన కుటుంబీకులు సులువుగా ఎయిర్ పోర్టు బైపాస్ రోడ్డు చేరుకోవచ్చు. ట్రాఫిక్ సమస్య లేకపోవడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. ముందు గేటు నుంచి వెనుక గేటు వరకు మధ్య దూరం 300 మీటర్లు. నిజానికి మంత్రి అర్ధ బలానికి రోడ్డు వేసుకోవడం ఏ మాత్రం కష్టంకాదు. 


కానీ ఎందుకో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు మంత్రి మెప్పుకోసం ఉత్సాహపడ్డారు. ప్రభుత్వ ఖాతాలో రోడ్డు వేసి ఆయన వద్ద మార్కులు కొట్టివేయాలని ఉబలాట పడ్డారు. మంత్రి ఇంటి ముందు పశ్చిమ ద్వారం నుంచి తూర్పు గేటు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి, రెండు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయించి చకచకా నిర్మాణం కూడా పూర్తి చేశారు. 

Updated Date - 2020-10-01T01:01:39+05:30 IST