సీడీపీ నిధులకు మోక్షం

ABN , First Publish Date - 2021-07-29T05:43:39+05:30 IST

రెండేళ్లుగా నిలిచిపోయిన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధులకు మోక్షం లభించింది. నియోజకవర్గానికి రూ.5కోట్ల చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలకు, నలుగురు ఎమ్మెల్సీలకు నిధులు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఉమ్మడి జిల్లాలకు సీడీపీ నిధులుగా మొత్తం రూ.80 కోట్లు విడుదలయ్యాయి. ఇదివరకు సీడీపీ కింద ప్రభుత్వం రూ.3కోట్ల చొప్పున ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ.5కోట్లకు పెంచింది. నిధుల మంజూరుతో ఇక నిలిచిపోయిన అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి.

సీడీపీ నిధులకు మోక్షం

రెండేళ్ల తర్వాత విడుదల
నియోజకవర్గానికి రూ.3కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంపు
నిధుల ఖర్చుకు కొత్త మార్గదర్శకాలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఊరట
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి


హన్మకొండ, ఆంధ్రజ్యోతి
రెండేళ్లుగా నిలిచిపోయిన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధులకు మోక్షం లభించింది. నియోజకవర్గానికి రూ.5కోట్ల చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలకు, నలుగురు ఎమ్మెల్సీలకు నిధులు అందుబాటులోకి  వచ్చినట్లయింది. ఉమ్మడి జిల్లాలకు సీడీపీ నిధులుగా  మొత్తం రూ.80 కోట్లు విడుదలయ్యాయి. ఇదివరకు సీడీపీ కింద ప్రభుత్వం రూ.3కోట్ల చొప్పున ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ.5కోట్లకు పెంచింది. నిధుల మంజూరుతో ఇక నిలిచిపోయిన అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి.

ప్రత్యేక కోటా
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా నిధులను మంజూరు చేస్తుంది. ఈ నిధులను ఆ శాఖల అధికారులు ప్రతిపాదిత పనులపై వెచ్చిస్తుంటారు. వీటిపై అజమాయిషీ కలెక్టర్లకు ఉంటుంది. నియోజకవర్గాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అవసర, అత్యవసర పనులు చేపట్టడం, మౌలిక సదుపాయలను కల్పించడంద్వారా తమను ఎన్నుకున్న ప్రజల్లో గుర్తింపు పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తోంది.

నిలిచిన నిధులు
టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా నిధుల కేటాయింపు జరగలేదు. 2020 బడ్జెట్‌లో ని ధులు కేటాయించిన కరోనా కారణంగా ప్రభుత్వం విడుద ల చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో సీడీపీ నిధులు రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచింది. కానీ కరోనా కారణం గా ఇప్పటివరకు ఒక్క పైసా మంజూరు కాలేదు. తాజా గా నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి.. పనుల మంజూరులో సమూల మార్పులు చేసింది. మౌ లిక వసతుల కల్పనకు ప్రధానంగా తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ భవనాల మరమ్మతులు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సామాజిక భవనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వీటిని ఖర్చు చేస్తారు.

ఇక జోరుగా..

ఇన్నాళ్లు సీడీపీ నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. ఇప్పుడు నిధులు విడుదల కావడమే కాకుండా ఆ మొత్తం పెరిగినందువల్ల ఈ హామీలను నెరవేర్చేందుకు అవకాశం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కూడా రూ.5కోట్ల చొప్పున నిధులు అందనున్నాయి. వారు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయనున్నారు.

అభివృద్ధి పనులకు మోక్షం

సీడీపీ నిధులు కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మోక్షం లభించనుంది. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు సీడీపీ నిధుల కేటాయింపు జరగగా, ఆయా గ్రామాలు, పట్టణాల్లో సామాజిక భవనాలు, మహిళా సంఘల భవనాలు నిర్మించారు. నామినేషన్‌ పద్ధతిపై పనులు కేటాయిస్తుండడంతో నిధులు సరిపడక ఆయా భవనాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అవి పూర్తయి వినియోగంలోకి రావాలంటే అదనంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న పనులకు సంబంధించి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు.

విధిగా ఆమోదం

సీడీపీ నిధులను వినియోగించడంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.  ఇదివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తమకు కేటాయించిన నిధులను తమకు తోచిన విధంగా ఖర్చు చేసే అధికారం ఉండేది. ఇప్పుడా అవకాశం లేదు. సీడీపీ కింద ప్రతిపాదించిన పనులకు నిధుల మంజూరుకు జిల్లా ఇన్‌చారి మంత్రి ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారులు సంబంధిత నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తర్వాతే పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తారు. సీడీపీ నిధులను రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ నిధులు ఇంకా రావలసి ఉంది.

అర్బన్‌ జిల్లాలో..

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2017-18, 2018-19 సంవత్సరాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి రూ.3కోట్ల చొప్పున రూ.9కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో 2017-18లో రూ.7.10 కోట్లను ఖర్చు చేశారు. రూ.8.94 కోట్లతో 238 పనులను ప్రతిపాదించగా వీటిలో రూ.7.10 కోట్లతో 198 పనులు పూర్తిచేశారు. మరో 40 పనులు పురోగతిలో ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో మంజూరైన రూ.9కోట్లలతో కేవలం రూ.3.13 కోట్లనే ఖర్చు చేశారు. రూ.6.19 కోట్లతో 114 పనులను ప్రతిపాదించగా రూ.3.13కోట్ల వ్యయంతో 66 పనులనే పూర్తి చేశారు. రూ.3.5కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 48 పనులు వివిధదశల్లో ఉన్నాయి. కాగా 2019-20, 2020-21 సంవత్సరంలో సీడీపీ నిధులను కేటాయిచలేదు. దీంతో ఈ రెండేళ్లలో సీడీపీ ద్వారా ఏ పనులు జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే ఇక ముందు పనులు జరగనున్నాయి.



Updated Date - 2021-07-29T05:43:39+05:30 IST