online games: మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బు గెలిచారా?.. అయితే మీ కోసం రంగంలోకి సీబీడీటీ..

ABN , First Publish Date - 2022-08-30T01:30:23+05:30 IST

దేశంలో ఆన్‌లైన్ గేమ్స్(Online Games) ఆడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ఈ గేమ్స్‌లో నగదు లావాదేవీలు, గెలిచిన డబ్బుపై పన్నులకు సంబంధించి అవగాహన పెద్దగా లేదు.

online games: మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బు గెలిచారా?.. అయితే మీ కోసం రంగంలోకి సీబీడీటీ..

న్యూఢిల్లీ : దేశంలో ఆన్‌లైన్ గేమ్స్(Online Games) ఆడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ఈ గేమ్స్‌లో నగదు లావాదేవీలు, గెలిచిన డబ్బుపై పన్నులకు సంబంధించి అవగాహన పెద్దగా లేదు. అందుకే ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బు గెలుపొందినవారు ట్యాక్స్‌లు కట్టకుండా తప్పించుకుంటున్నారు. అలాంటివారందరి చేతా ముక్కుపిండి మరీ పన్నులు కట్టించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)(CBDT) సంసిద్ధమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్ గేమ్స్‌(Online Games)లో గెలిచిన డబ్బుపై పన్నులు కట్టాలని చెల్లింపుదార్లను సీబీడీటీ హెచ్చరించింది. సీబీడీటీ నిబంధనల ప్రకారం.. అప్‌డేట్ ఐటీఆర్(ఐటీఆర్-యు)ను సమర్పించాలని పేర్కొంది. ట్యాక్సులు చెల్లించకపోతే చట్టపరమైన పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.


పీటీఐ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా ఈ అంశానికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. ఆన్‌లైన్ గేమ్స్, లాటరీలు, బెట్టింగ్స్ వంటి వాటిపై పొందే ఆదాయంపై తప్పనిసరిగా ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఐటీఆర్-యు(ITR-U) ఫామ్‌ని చెల్లింపుదార్లు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిబంధన కింద చెల్లింపుదార్లు ముందుకొచ్చి  పన్నులు చెల్లించాలని ఆయన కోరారు. లేదంటే జరిమానా లేదా ఆదాయ పన్ను చట్టం కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


కాగా ఐటీఆర్-యు(ITR-U) అనగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్-అప్‌డేటెడ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022 ప్రసంగంలో దీనిని ప్రకటించారు. ఐటీఆర్-యును ఆదాయ పన్ను చట్టం -1961లోని సెక్షన్ 139(8ఏ) కింద ఫైలింగ్ చేశారు. పన్ను చెల్లించే ఆదాయంలో లెక్కగట్టే విషయంలో పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునేందుకు చెల్లింపుదారుల సౌలభ్యం కోసం దీనిని తీసుకొచ్చారు. ఐటీఆర్-యు ద్వారా అంచనా ఏడాది ముగిసిన రెండేళ్ల వరకూ ఐటీఆర్‌ను సవరించుకునే వీలుంటుంది. ఐటీఆర్ ఫైలింగ్(ITR Filling) సమయంలో మరచిపోయిన ఆదాయాన్ని జతచేసేందుకు వీలుంటుంది. ఐటీఆర్‌ని అప్‌డేట్ చేసే సమయంలో చెల్లింపుదార్లు కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-08-30T01:30:23+05:30 IST