Abn logo
Oct 13 2021 @ 00:56AM

కుల గణనపై కుంటి సాకులు

నిమ్నకులాలు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో కులం పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగానో, కొత్తగానో చర్చించాల్సిన అవసరం లేదు. సామాజిక జీవితంలో కులం తెచ్చే తలనొప్పి కూడా అస్తిత్వాల స్థాయిని అధిగమించి శాంతిభద్రతల స్థాయికి చేరుతోంది. వలస పాలన వచ్చే వరకూ ప్రజలను కులాలుగా విభజించి నిట్టనిలువు సామాజిక నిర్మాణాలు రూపొందించి ఏ కులం ఏ కులం పైన ఉండాలి, ఏ కులం ఏ కులం కింద ఉండాలి, కిందా పైనా ఉండేవాళ్ల మధ్య సామాజిక ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలి అన్నది నిర్ధారించటానికి ఏకంగా ఏ ధర్మ(?) శాస్త్రాలే పుట్టుకొచ్చాయి. నాలుగువేల ఏళ్లు ఈ విధంగా జనాన్ని కులాలుగా విభజించి తమ పబ్బం గడుపుకున్న పాలకవర్గానికి ఆ కులమే ఇప్పుడు శిరోభారంగా మారుతున్న పరిణామాన్ని మనం గమనిస్తున్నాము. 


ఒక ఏడాది కాలంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది. సామాజిక న్యాయ నినాదాన్ని బలపర్చే పార్టీలు, రిజర్వేషన్ల ప్రాతిపదికను బలపర్చే పార్టీలు అన్నీ ఈ నినాదాన్ని బలపరిచాయి. కాంగ్రెస్‌ తన వైఖరిని మరింత విపులీకరించటానికి ఏకంగా మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ నాయకత్వంలో ఓ అధ్యయన బృందాన్నే నియమించింది. ఈలోగా సామాజికన్యాయ మంత్రిత్వశాఖ తరపున సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలైంది. కులగణన డిమాండ్‌ను తిరస్కరించేందుకు కారణాలు వెతుక్కునే ప్రయత్నంలోనే కేంద్రప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కుల గణన డిమాండ్‌ను తిరస్కరించటానికి చెప్పిన కారణాలు సమంజసమైనవీ కాదు. హేతుబద్ధమైనవీ కాదు. కుల గణనను ప్రోత్సహించరాదన్న వైఖరిని కొనసాగించాలని భావిస్తున్నామన్నది ఆ డిమాండ్‌ను తిరస్కరించటానికి కేంద్రం ముందుకు తెచ్చిన మొదటివాదన. ఆచరణలో సమస్యలు కుప్పలుతెప్పలుగా వస్తాయన్న భయం రెండో కారణం. జనం చెప్పే సమాచారం తప్పుల తడకగా ఉంటుందన్నది మూడో వాదన. కులగోత్రాల పేర్లు సర్వవ్యాపితంగా ఉన్నందున ఏ గోత్రం ఏ కులం ప్రామాణికమైనవో చెప్పలేమన్నది మరో వాదన. చివరిగా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో స్పష్టంగా చెప్పలేమన్నది మరో వాదన. ఇవన్నీ కుంటిసాకులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


కులగోత్రాలకు సంబంధించిన వాదనను ముందుకు తేవడం ద్వారా కేంద్రప్రభుత్వం ఓ మంచి పని చేసిందనిపిస్తోంది. కులవ్యవస్థ దైవాధీనమనీ, కుల వృత్తిని దాటి బయటకు రాకూడదనీ, అలా బయటికి వచ్చిన వాళ్లను వెలివేయాలన్న కట్టుబాట్లు రూపొందించింది ఎవరు? భారతీయ సమాజ నిర్మాణం కులం ఆధారితమతా? గోత్రం ఆధారితమా? కులం ఆధారితమే అయినప్పుడు గోత్రం గురించిన పట్టింపులెందుకు? గోత్రమే ప్రామాణికమైనప్పుడు ఒకే గోత్రం వేర్వేరు కులాల్లో ఎందుకు విస్తరించి ఉంది? ఆఖరికి జాతీయ దురహంకారులు ముందుకు తెస్తున్నట్లు ఒకే జాతి ఒకేరకమైన జన్యు నిర్మాణాన్ని కలిగి ఉంటుందన్న వాదనే నిజమైతే ఒకే జన్యు నిర్మాణం ఆసియా మొదలు ఆఫ్రికా వరకూ కొన్ని కోట్ల కుటుంబాల్లోకి ఎలా ప్రవేశించింది? ఇటువంటి ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌తో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలన్నా కులగణన జరగాలి. కుల పొందికల గురించిన సమాచారం మానవ సమాజ శాస్త్ర నిర్మాణం గురించి మరింత లోతైన పరిశోధనలకు దారితీస్తుంది. అంతిమంగా కులాల పుట్టుక గురించి వేల ఏళ్లుగా మన మెదళ్లలో నూరిపోస్తున్న సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలని, కులవ్యవస్థ ఆధిపత్య వర్గాలచే నిర్మితమైనదనీ రుజువవుతుంది.


1951 నాటికి కులగణన వద్దనుకోవటానికి 2021లో కులగణన వద్దనుకోవటాన్నీ ఒకే గాటన కట్టలేము. నేటి పరిస్థితి ఆనాటి కంటె భిన్నమైనది. తొలి జనగణన కోసం ప్రధానంగా రెవిన్యూ యంత్రాంగంపై ఆధారపడితే నేడు కోట్ల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ విభాగాల సిబ్బంది భాగస్వాములు. నేడు ఎంతో ఆధునికమైన సాంకేతిక సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత సేవలు అందుబాటులో ఉన్నాయి. 


సమసమాజ స్థాపనకు సమన్యాయ సాధన తొలి మెట్టు అవుతుంది. సమన్యాయ సాధన అన్నది రూళ్లకర్ర సిద్ధాంతం కాదు. ఆయా సామాజిక తరగతుల వెనకబాటుతనాన్ని కొలిచి, ఏ మోతాదులో వారికి చేయూతనిస్తే ఇతర కులాలు, వర్గాలు, తరగతులతో సమానంగా అభివృద్ధి స్రవంతిలోకి ప్రవేశించి సమానమైన పాత్ర పోషించగలుగుతారో ఆ విధమైన వెసులుబాటు కల్పించటమే సమన్యాయ సాధన సూత్రానికి పునాది. ఈ పునాది ప్రాతిపదికన ముందుకొచ్చిందే అఫర్మేటివ్‌ యాక్షన్‌. రిజర్వేషన్లు సమాజంలో వెనకబడిన తరగతులు, కులాలకు చేయూతనిచ్చే సాధనాలు అని భావించినప్పుడు వాటి ఫలాలు ఆయా తరగతులు, కులాలకు సమానంగా అందాలని ఆశించటం చట్టవిరుద్ధం కాదు. కేంద్రంలో బిజెపి అధికారానికి వచ్చిన నాటి నుంచి రిజర్వేషన్ల సాఫల్యతను ప్రశ్నించటం కూడా పెరిగింది. విలువైన జాతీయ సంపద సంక్షేమాలు, రిజర్వేషన్ల పేరిట వృథా అవుతోందని గుండెలు బాదుకునే కుహనా మేధావులు కూడా పెరిగారు. వాళ్ల ఆరోపణ నిజమేనని రుజువు చేయటానికైనా కులగణన చేయాల్సిన అవసరం ఉంది. అఫర్మేటివ్‌ యాక్షన్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి కులగణన, జనగణన సమాంతరంగా జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిమండలిలో బిసి కులాలకు స్థానం కల్పించినంత మాత్రాన ఆ సామాజికవర్గాలు వెనకబాటుతనాన్ని అధిగమించలేవు. రాజకీయపార్టీలు కులగణన దిశగా సాగిస్తున్న ప్రయత్నాలతో ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు, సామాజిక న్యాయం కాపాడబడాలనుకునేవాళ్లతో పాటు నిజంగా దేశంలో వెనకబాటుతనాన్ని నిర్మూలించాలని ఆలోచిస్తున్న వాళ్లు, పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్లూ గొంతు కలపాల్సిన అవసరం ఉంది. అలాంటి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. తద్వారానే కులాన్ని పాలకవర్గాల శిరోభారంగా మార్చగలం. లేనిపక్షంలో కులపీడన, అంటరానితనం, కుల అణిచివేత ఎదుర్కొనే వారికే ఇది శిరోభారంగా కొనసాగే ప్రమాదం ఉంది.

కొండూరి వీరయ్య