కుల నిర్మూలనవాది ఉసా

ABN , First Publish Date - 2020-07-31T07:19:35+05:30 IST

వివిధ ఉద్యమాలకు ఉపాధ్యాయుడిగా, సామాజిక సిద్ధాంతవేత్తగా సుపరిచితుడైన ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా) ఈ 69 ఏళ్లలో 20 ఏళ్లు విప్లవోద్యమంలో...

కుల నిర్మూలనవాది ఉసా

వివిధ అస్తిత్వవాద, సామాజిక, ప్రజాస్వామ్య, ప్రాంతీయ ఉద్యమాలకు తల్లికోడిలా నిలబడిన బుద్ధిజీవుడు ఉసా. గులాంగిరి చేయని స్వతంత్ర ప్రత్యామ్నాయ కుల-వర్గ పోరాటవాది, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉసా. 


వివిధ ఉద్యమాలకు ఉపాధ్యాయుడిగా, సామాజిక సిద్ధాంతవేత్తగా సుపరిచితుడైన ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా) ఈ 69 ఏళ్లలో 20 ఏళ్లు విప్లవోద్యమంలో, మరో 30ఏళ్లు సామాజిక అస్తిత్వ, ప్రాంతీయ ప్రజాస్వామ్య ఉద్యమాలలో కొనసాగారు. మొక్కువోని ధైర్యంతో అగ్రకుల దళారీ దోపిడీ వర్గ పాలకులకు గులాంగిరీ చేయకుండా మెజార్టీ బడుగు వర్గ శ్రామిక ప్రజల పక్షాన రాజీ లేకుండా పోరాడుతూ నిలబడిన గొప్ప ఉద్యమకారుడు ఉ.సా.


ఉ.సా. మెజార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి భూమిక మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు దృక్పథంతో పాటు మహాత్మజ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ల కులనిర్మూలన అవగాహనను విమర్శనాత్మకంగా స్వీకరించి అలవర్చుకోవడమే. మార్క్సిస్టు దృక్పథాన్ని దేశీయ నిర్దిష్ట పరిస్థితులకు తగ్గట్టు అన్వయించి ఈ దేశంలో సామాజిక విప్లవం తీసుకువచ్చే కార్యక్రమం అవసరమని నమ్మి ఆ దిశగా ఆచరణలో కొనసాగిన వ్యక్తి. ఆయన కొనసాగిన యుసిసిఆర్‌ఐ–-ఎంఎల్‌ విప్లవ పార్టీలో ఈ దేశంలో వర్గవ్యవస్థతో పాటు కులవ్యవస్థ ఉన్నదని చర్చరావడానికి గల కారణం 1982 కారంచేడు మారణహోమం. ఆ ఘటనపై ‘దళితులపై భూస్వాముల దాడి’ అంటూ యుసిసిఆర్‌-ఐ–-ఎంఎల్‌ విప్లవ పార్టీ తరఫున కరపత్రం వెలువడింది. కారంచేడులో దళితులపై అగ్రకుల కమ్మ భూస్వాములు దాడి చేశారంటూ కరపత్రం ప్రచురించినందుకే పార్టీ నుండి ఉ.సా.ను బ్రాహ్మణీయ అగ్రకుల మార్క్సిస్టులు బహిష్కరించారు. అగ్రకులాలు అని పేర్కొంటూ కర పత్రం వేస్తే కమ్మ కులస్థులు పార్టీకి సహకరించరని, ఉన్నవాళ్లు పార్టీని వీడుతారని కుంటిసాకులు చూపారు. ఇందులో అగ్రకుల కుటిలత్వం దాగి ఉందని గ్రహించి కుల-వర్గ దృక్పథంతో ‘ఎదురీత’ పత్రికను అమరుడు కెజి సత్యమూర్తిగారితో ఎంఎల్‌ సెంటర్‌ పేరుతో ఉ.సా. ప్రజల వద్దకు తీసుకువెళ్లగలిగారు. 


అమరవీరుడు మారోజు వీరన్నతో ఉసాగారికి భావసారూప్యత వలన సాహచర్యం ఏర్పడింది. భారత దేశానికి తగ్గట్టు సిద్ధాంతం, ఆచరణ ఉండే విప్లవ పార్టీ అవసరమని అందుకు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) ఆవిర్భవాన్ని ఆహ్వానించారు. ఆనాటికే ఉ.సా. తూర్పు గోదావరి జిల్లా కొండ మొదలులో గిరిజనులకు అండగా పోరాడడం జరిగింది. తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మోత్కురు ప్రాంతంలో యుసిసిఆర్‌-ఐ–ఎంఎల్‌ పార్టీ తరఫున రైతాంగ పోరాటాలు నిర్మించారు. స్త్రీలపై బ్రాహ్మణీయ మగపెత్తందారీ దోపిడి, వివక్ష, ఆధిపత్యం కొనసాగరాదనీ, తాను తెలంగాణేతరుడైనా, తెలంగాణలో కోస్తాంధ్ర అగ్రకుల దళారీలు, పాలకులు దోపిడీ చేస్తున్నారని ‘ఎదురీత’ తరఫున చర్చకు తెరలేపాడు. మారోజు వీరన్న సారథ్యంలో ఏర్పడిన అణగారిన కులాల ఐక్యదండోర-మహాజన ఫ్రంట్‌ను నిర్వీర్యం చేసేందుకు అగ్రకుల ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని భగ్నం చేశాడు ఉ.సా. ‘దండోరా’ అగ్రకుల పాలకులకు తాకట్టు కాకుండా ప్రజల పక్షాన రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకునే వైపుగా సమన్వయం చేసే క్రియాశీల పాత్ర పోషించాడు.


అణగారిన కులాల ఓట్లు అణగారిన కులాలే వేసుకొని రాజకీయాధికారం కైవసం చేసుకునే ప్రయత్నంలో ఫ్రంట్ తరఫున 4% ఓట్లు సాధించిన సందర్భంలో మారోజుతోపాటు ఉ.సా. చేసిన కృషి మరువలేనిది. ఉద్యమశక్తులే రాజకీయ శక్తులుగా మారాలని నినదించారు ఉ.సా. ఇదే క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని, వివిధ సామాజిక, ప్రజాస్వామ్య, అస్తిత్వవాద ఉద్యమాలను విప్లవ పార్టీ నాయకత్వంలో నిర్మించడం అవసరమని ఆకాంక్షించిన ఉద్యమకారుడు కూడా. ఉ.సా. సారథ్యంలో మహాజన పార్టీ ఏర్పడినా అగ్రకులాల ధనదాహానికి, ప్రజారాజ్యం పార్టీ బూటకపు సామాజిక న్యాయం కుట్రకి ఆ పార్టీ రద్దు అయింది. వీరన్న రూపొందించిన- ఇండియాలో ఏం చేయాలనే కులవర్గ సిద్ధాంతాన్ని తయారు చేయడంలో ఉ.సా. సహకారపాత్ర పోషించారు.


వివిధ అస్తిత్వవాద సామాజిక, ప్రజాస్వామ్య, ప్రాంతీయ ఉద్యమాలకు తల్లికోడిలా నిలబడిన బుద్ధిజీవుడు ఉ.సా. అన్యాయాలకు గురైన వారి పక్షాన నిలబడి సిద్ధాంతాన్ని రూపొందించి ఆచరించడం ఉ.సా. నైజం. గులాంగిరి చేయని స్వతంత్ర ప్రత్యామ్నాయ కుల-వర్గ పోరాటవాది, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా. తెలంగాణ మాట ఎత్తని కాలంలో సామాజిక తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని యూనివర్శిటీలో ఉ.సా. నినదించడంతో ఆ ఉద్యమాల ఉపాధ్యాయుడి ఎదురీతతో ఏర్పడినదే సామాజిక తెలంగాణ మహాసభ. ఉ.సా.గారితో నాకు ఆత్మీయ ‘గురుశిష్య’ అనుబంధం పదేళ్ళుగా కొనసాగింది. ఉసా 69ఏళ్ల జీవితంలో 49 ఏళ్లు ప్రజలపక్షాన ప్రత్యామ్నాయ విప్లవవాదిగా జీవించడం అరుదైన చారిత్రక విషయం. ఉ.సా. మరణం విషాదాన్ని, దుఃఖాన్ని మిగిల్చింది. నిబద్ధతతో, నిజాయితీతో ప్రజల పక్షాన నిలబడిన ఆయనకు జోహార్లు.

పాపని నాగరాజు 

సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్రప్రధాన కార్యదర్శి

Updated Date - 2020-07-31T07:19:35+05:30 IST