సంక్రాంతి తర్వాత Corona కేసులు పెరుగుతాయి..

ABN , First Publish Date - 2021-12-06T08:55:06+05:30 IST

రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు.

సంక్రాంతి తర్వాత Corona కేసులు పెరుగుతాయి..

  • ఫిబ్రవరి నెలలో పతాక స్థాయికి చేరుతాయి
  • ఒమైక్రాన్‌ కేసులను దాస్తున్నామన్నది అబద్ధం
  • ఏ క్షణాన్నైనా రాష్ట్రంలోకి వేరియంట్‌ రావొచ్చు
  • వచ్చే 4 నుంచి 6 వారాలు కీలకం.. అప్రమత్తం
  • విదేశాల నుంచి వచ్చినవారిలో 13 పాజిటివ్‌లు
  • రెండ్రోజుల్లో వీరందరి జన్యు విశ్లేషణ ఫలితాలు
  • లాక్‌డౌన్‌కు అవకాశం ఉండదు: డీహెచ్‌ గడల


హైదరాబాద్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ కోఠిలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితా లోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌కు 900 మందిపైగా వచ్చారని తెలిపారు. విమానాశ్రయంలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపామని చెప్పారు. ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయన్నారు. ‘‘ఏ క్షణమైనా ఒమైక్రాన్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శంషాబాద్‌ విమానాశ్రయంలో స్ర్కీనింగ్‌, ఆర్టీపీసీఆర్‌  టెస్టులు పకడ్బందీగా జరుగుతోంది.


ఇప్పటివరకు కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదు’’’ అని డాక్టర్‌ గడల స్పష్టం చేశారు. ఒమైక్రాన్‌ కేసులను దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు ప్రచారంతో వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.  ప్రభుత్వం కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నదని.. ప్రతి రోగికి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైరస్‌ వ్యాప్తి పెరిగినా రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ విధించేంతటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు.. ఒమైక్రాన్‌ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉంటాయని.. ఈ లక్షణాలున్నవారు దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వేరియంట్‌ తీవ్రతపై అధ్యయనాలు జరుగుతున్నాయని, పూర్తి స్పష్టత వచ్చేందుకు మరో వారం పడుతుందని తెలిపారు. కాగా, ఒమైక్రాన్‌ ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కేసులు పెరుగుతున్నాయన్నాయని,  ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశమని శ్రీనివాసరావు చెప్పారు.


రానున్న ఆరు వారాలు కీలకం

ఒకటి, రెండు నెలల్లో భారత్‌లోనూ ఒమైక్రాన్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్‌ గడల పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అర్హులంతా టీకా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు. ఒమైక్రాన్‌ నేపథ్యంలో టీకా పంపిణీని వేగిరం చేశామని.. శనివారం 3.70 లక్షల డోసులు పంపిణీ చేశామని వివరించారు. నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తిచేస్తామని తెలిపారు.

Updated Date - 2021-12-06T08:55:06+05:30 IST