కేసులెక్కువ.. టీకాలు తక్కువ!

ABN , First Publish Date - 2021-05-23T09:01:27+05:30 IST

కరోనాకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలూ వణికిపోతున్నాయి. మొదటివేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో పల్లెల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కేసులెక్కువ.. టీకాలు తక్కువ!

  • సెకండ్‌ వేవ్‌లో పల్లెలపై కొవిడ్‌ వైరస్‌ పంజా
  • గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు 
  • అక్కడ వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టని సర్కారు
  • కొన్ని జిల్లాల్లో 50 వేలు కూడా దాటని టీకాలు 
  • 10 జిల్లాల్లో ఇప్పటిదాకా లక్షలోపే వ్యాక్సినేషన్‌


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): కరోనాకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలూ వణికిపోతున్నాయి. మొదటివేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో పల్లెల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గ్రామాల్లో కేవలం జ్వర సర్వేతో సరిపెడుతున్నారు. కేసులు బాగా పెరుగుతున్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టడం లేదు. కేంద్రం ఇస్తున్న వ్యాక్సిన్‌ను అన్నిచోట్లకు పంపి తమ బాధ్యత తీరింది అన్నట్లుగా వైద్య శాఖ వ్యవహరిస్తోంది తప్ప పాజిటివ్‌లు ఎక్కువున్న చోట ఆ స్థాయిలో టీకాలను ఇవ్వడం లేదు. 


అర్బన్‌ కేంద్రీకృతంగానే వ్యాక్సినేషన్‌

గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ విస్తరిస్తుండటంతో అక్కడ టెస్టులు సంఖ్య పెంచడంతోపాటు, వ్యాక్సినేషన్‌ ఎక్కువగా ఉండాలని ఇటీవల అన్ని రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కొవిడ్‌ కేసులను దాచిపెట్టొద్దనీ సూచించారు. రాష్ట్రంలో జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు నెలల్లో మూస ధోరణిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది తప్ప, కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్న చోట్లలో ఎక్కువ టీకాలిచ్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ అంతా పట్టణ ప్రాంతాల కేంద్రీకృతంగానే నడుస్తోంది. సెకండ్‌వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 40 శాతం వరకు పాజిటివ్‌ రేటు వచ్చింది. అలాంటి జిల్లాలపై  టీకాల పరంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. సెకండ్‌ వేవ్‌లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒకదశలో పాజిటివ్‌ రేటు 40 వరకు నమోదు అయింది. అక్కడ వ్యాక్సినేషన్‌ చాలా తక్కువగా జరిగింది. సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో భారీగా కేసులు వెలుగుచూశాయి. కానీ వ్యాక్సినేషన్‌ చాలా తక్కువగా జరిగింది. ఆసిఫాబాద్‌ జిల్ల్లాలోని రొంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 49 మందికే టీకాలిచ్చారు. గ్రామీణ పీహెచ్‌సీల్లో ఏ స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరుగుతుందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. 


ఏజెన్సీ ప్రాంతాల్లో మరీ తక్కువ

రాష్ట్రంలో రాజధాని దూరంగా ఉన్న ఏజెన్సీ జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరీ మందకొడిగా సాగుతోంది. ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రం కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ నాలుగు జిల్లాల్లో  చాలా తక్కువగా వ్యాక్సినేషన్‌ జరిగింది. శుక్రవారం నాటికి  నారాయణపేట్‌ జిల్లాలో అత్యల్పంగా 37,981 మందికి, ఆసిఫాబాద్‌లో 48,037 మందికే టీకాలిచ్చారు. ఆదిలాబాద్‌, జనగాం, భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, ములుగు, వికారాబాద్‌; వనపర్తి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ జోరందుకోలేదు. ఒక్కో జిల్లాల్లో కనీసం లక్ష మందికి వ్యాక్సినేషన్‌ జరగలేదు. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువ వ్యాక్సినేషన్‌ జరిగింది. ఈ మూడు జిల్లాల్లో 19 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వేసిన 55,23,729 టీకాల్లో  ఎక్కువగా ఈ మూడు జిల్లాలోనే జరిగింది. టీకాల్లో 34 శాతం ఈ మూడు జిల్లాల్లోనే వేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 23 శాతం మందికి, అత్యల్పంగా నారాయణ్‌పేటలో 6.7 శాతం మందికి టీకాలు వేశారు. 


గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ఎక్కువగా జరగాలి

పట్టణ ప్రాంతవాసులకు కొవిడ్‌పై అవగాహన ఎక్కువ. పరీక్షలు చేయించుకునేందుకు సౌకర్యాలుంటాయి. పాజిటివ్‌ వస్తే వైద్యం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పల్లెల్లో ఈ మూడూ ఉండవు. పరీక్షలు చేయించుకోవాలన్నా అది దూరభారమే. పాజిటివ్‌ వస్తే సరైన వైద్యం అందే పరిస్థితి ఉండదు. అందుకే ప్రభుత్వం వైద్య సౌకర్యాలకు దూరంగా ఉండే ప్రాంతాలపై దృష్టిపెట్టాలి. అక్కడ ముందుగా వ్యాక్సిన్లు వేసే అవకాశాలను పరిశీలించాలి.  

- డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌  అకాడమీ ఆఫ్‌ ఇండియా

Updated Date - 2021-05-23T09:01:27+05:30 IST