Abn logo
Oct 2 2020 @ 02:34AM

కాళేశ్వరంపై కేసు విచారణ 7కు వాయిదా

అదేరోజు ఉత్తర్వులు జారీచేస్తామన్న  జాతీయ హరిత ట్రైబ్యునల్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి ఈ నెల 7వ తేదీ విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేస్తామని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు మూడో టీఎంసీ విస్తరణకు పర్యావరణ అనుమతులు లేవంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చైర్మన్‌ ఏ కే గోయల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.


పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె. శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ పనులు మొదలు పెట్టిందని తెలిపారు. దీనికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని చెప్పారు. కాళేశ్వరంపై ఒరిజనల్‌ కేసు విచారణ నవంబరులో రానుండగా తొందర ఎందుకని ఽతాజా పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.


రూ. 80 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టునే రెండేళ్లలో పూర్తి చేశారని,   విస్తరణ పనులు చేపట్టడానికి ఎక్కువ సమయం పట్టదని, అందుకే పిటిషన్‌ వేయాల్సి వచ్చిందని శ్రవణ్‌ కుమార్‌  సమాధానం చెప్పారు.  విస్తరణ పనులు నిలిపివేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాసినా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.


ఈ అంశంపై వైఖరి ఏంటని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాసిన మాట వాస్తమేనని, తాము కేంద్ర జల సంఘానికి కూడా లేఖ రాశామని తెలిపారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.  


Advertisement
Advertisement
Advertisement