అయ్యో.. గురు!

ABN , First Publish Date - 2020-09-05T08:33:47+05:30 IST

సెప్టెంబరు 5... గురుపూజోత్సవం! ‘హ్యాపీ టీచర్స్‌ డే’ అంటూ పిల్లలంతా శుభాకాంక్షలు చెప్పే రోజు! కానీ... ఈసారి

అయ్యో.. గురు!

బోధన చేసేవారు బతుకువేటలో

అసలే అంతంతమాత్రం జీతాలు

కరోనాతో మరింతగా దుర్భర స్థితి

పీహెచ్‌డీ చేసి పొలం పనులకు కడపలో ఓ ప్రైవేటు లెక్చరర్‌

కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యువల్‌పై మాట దాటని సర్కారు చేతలు

ప్రభుత్వ టీచర్లకు ఒకటే నరకం 

బోధనేతర విధుల్లో ఉపాధ్యాయులు

హ్యాపీ లేని టీచర్స్‌ డే

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం


రోడ్డు మీద చెప్పులు, మాస్కులు అమ్ముకొంటున్న ప్రైవేటు టీచర్లు

కూలీలుగా, తాపీ మేస్ర్తీలుగా, చిల్లర వర్తకులుగా నానా పాట్లు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): సెప్టెంబరు 5... గురుపూజోత్సవం! ‘హ్యాపీ టీచర్స్‌ డే’ అంటూ పిల్లలంతా శుభాకాంక్షలు చెప్పే రోజు! కానీ... ఈసారి అంతా ప్రత్యేకం! టీచర్స్‌ డే వచ్చింది. కానీ... ‘హ్యాపీ’ లేదు. మరీ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. అనేక మంది టీచర్లను కరోనా మహమ్మారి బజారుపాలు చేసింది. క్లాసులు లేవంటూ పేరెంట్స్‌ ఫీజులు కట్టడంలేదు. ఫీజులు వసూలు కావడంలేదని యాజమాన్యాలు జీతాలు ఇవ్వడంలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల టీచర్లలో అత్యధికులకు అరకొర జీతమే అందుతోంది. మరెందరో ఉద్యోగాలు కోల్పోయి... ఇతర ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. దొరికిన కూలి పనులు చేసుకొంటూ ప్రైవేటు టీచర్లు కనాకష్టంగా బతుకుబండి లాగుతున్నారు. చెప్పులమ్ముకొంటూ విజయవాడ నడిరోడ్డుపై నిలబడ్డ ప్రైవేటు టీచర్‌ వెంకటేశ్వరరావు ఉదంతమే దీనికి నిదర్శనం. 


మాస్కులమ్ముకొని కొందరు, తాపీ పట్టిన వారు మరికొందరు, పలుగూ పారా భుజాన వేసుకొని పొలం పనిలోకి  ఇంకొందరు! మరోవైపు బండెడు రికార్డు వర్క్‌, తమవి కాని విధుల నిర్వహణతో ప్రభుత్వ టీచర్లు పని ఒత్తిడికి గురవుతున్నారు. ఖాళీగాపడిఉన్న టీచరు పోస్టులను నింపితే రెగ్యులర్‌ స్టాప్‌పై భారం కొంత తగ్గుతుంది. కానీ, కొత్త పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా, పాత నోటిఫికేషన్‌లో డీఎస్సీ-2018 రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వం కనీసం ఊరటని ఇవ్వలేకపోయింది. సెప్టెంబరు ఐదు, టీచర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ అధ్యాపకుల అవస్థలపై ప్రత్యేక కథనం.. 


బతకడానికి తాపీ పట్టారు..


కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన చంద్రశేఖర్‌ బ్రిగేడ్‌ పాఠశాలలో ప్రైవేటు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఈ పాఠశాల కరోనా కారణంగా మూతబడటంతో ఆరు నెలలుగా జీతాలు లేవు. వివాహమై, సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొన్న చంద్రశేఖర్‌.. ఎక్కువ రోజులు ఇంట్లో ఊరికే ఉండలేకపోయారు. తెలియని పని అయినా కుటుంబ పోషణ కోసం ఇప్పుడు తాపీ పని చేస్తున్నారు.


కలం వదిలి కూలికి..


తవ్వా వెంకటయ్య తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. విజ్ఞానదాయకమైన ఎన్నో పుస్తకాలు రచించారు. ఇంతటి అక్షర సేద్యం చేసిన ఆయన ఇప్పుడు పలుగూ, పారా పట్టుకొని పొలం పనులకు వెళుతున్నారు.  బీఈడీ చేసిన వెంకటయ్య కడప జిల్లా ఖాజీపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసేవారు. పాఠాలు చెబితే వచ్చే రూ. 10వేలు జీతంపైనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన జీవితంలో కరోనా కల్లోలం రేపింది. పనిలేదు..జీతాలు లేవంటూ యాజమాన్యం కొన్నాళ్లుగా వేతనాలు ఆపేసింది. వెంకటయ్యకు కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియలేదు. కొన్నాళ్లు గంజి తాగి అర్ధాకలితో జీవితం నెట్టుకొచ్చారు. చివరకు భార్యాపిల్లలను పోషించుకోడానికి తన ఊరు అవ్వారుపల్లెలో ఏ పని దొరికితే ఆ పనికి వెళుతున్నారు.


కూటికోసం.. కూలి కోసం..


కృష్ణాజిల్లా బందరుకు చెందిన హరిప్రసాద్‌ కోరి టీచర్‌ వృత్తిని ఎంచుకొన్నారు. ఏరికోరి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొన్నారు. విజయవాడ రవీంద్రభారతిలో కొన్నినెలల క్రితం దాకా ఆయన పాఠాలు చెప్పారు. లాక్‌డౌన్‌ కాలంలో ఆ బడి మూతబడింది. చేతిలో పనిపోయిందని కూర్చోకుండా దొరికిన కూలి పనులకు వెళుతున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య పుట్టినరోజు నాడు కోరిన దుస్తులు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నానని హరిప్రసాద్‌ వాపోయారు. కర్నూలులో ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేసే లక్ష్మణ్‌ వ్యవసాయ కూలీగా మారాడు.


మాస్క్‌లమ్ముతున్న టీచరమ్మ


కరోనా ఆమె ఉపాధిని లాగేసుకొంది. ఆ వైర్‌సను నిలువరించే మాస్క్‌లను అమ్ముతూ ఇప్పుడామె కుటుంబాన్ని పోషించుకొంటున్నారు. రహమతున్నీసాది కృష్ణాజిల్లా మచిలీపట్నం. స్థానికంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో పాఠాలు చెప్పేవారు. నాలుగు నెలలుగా బడి మూతబడింది. అయినా, ఇల్లు గడవాలిగా మరి. అందుకని ఎంత కష్టంగా ఉన్నా రోడ్డు మీద మాస్కులు అమ్ముతున్నానని, ఏ రోజు డబ్బులతో ఆ రోజు పొట్ట పోసుకుంటున్నామని రహమతున్నీసా పేర్కొన్నారు. 


ఒక పూట తింటే మరో పూట పస్తు..


విజయవాడ నగరంలో ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న తడికిమళ్ల మోహన్‌ తొమ్మిది ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి. ఆరు నెలలుగా జీతం లేదు.  బయటకువెళ్లి ఏదైనా పని చేసుకుందామంటే ఇంట్లో గుండె ఆపరేషన్‌ చేయించుక్ను తండ్రికి తోడుగా తానేఉండాలి. దీంతో ప్రైవేటు టీచర్‌గా దాచుకున్న డబ్బులతో ఓ పూట తిని మరో పూట పస్తులు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆయన వాపోయారు. 


కొత్త పోస్టుల్లేవు.. భారమంతా కొందరిపైనే..

విద్యాసంస్కరణలు, పథకాల పేరిట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వ టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ‘నాడు-నేడు’ వంటి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వారి మెడపైనే పెట్టారు. రకరకాల పథకాల మాటున బోధనేతర పనులే ఎక్కువగా చేయాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.ఈ భారం తగ్గించాలంటే కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి టీచర్లను కొత్తగా భర్తీ చేయాలి. కానీ, ఇప్పటికీ  సర్కారీ బడుల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగానే పడిఉన్నాయి.  ఈ విషయంలో విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదు. గత ప్రభుత్వం నోటిఫై చేసిన డీఎస్సీ-2018కు సంబంధించి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ అభ్యర్థులకు న్యాయం చేస్తామన్న మాట నిలుపుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది టీచర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2020-09-05T08:33:47+05:30 IST