Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 01 Feb 2020 19:51:34 IST

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు నష్టం

twitter-iconwatsapp-iconfb-icon
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు నష్టం

నవ్యాంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింప చేయవలసిన బాధ్యత రాష్ట్ర పాలకులపై వున్నది. ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడానికి కృషి చేయాలి. అలా కాకుండా రాజధాని అమరావతి భవిష్యత్తుపై అనిశ్చిత పరిస్థితిని సృష్టించడం సమంజసం కాదు.

ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చెందిన నగరాలు రాజధానులుగా ప్రకటింపబడ్డ సందర్భాలు ప్రపంచ చరిత్రలో చాలా అరుదు. అలా అయినట్టయితే, రోమ్ కాకుండా మిలన్ నగరమే ఇటలీ రాజధానిగా ఉండి వుండేది. అమెరికాలో భిన్నాభిప్రాయాల తర్వాత నూతన పాలనా కేంద్రంగా వాషింగ్టన్ నగరాన్ని ప్రత్యేకంగా నిర్మించారు తప్ప న్యూయార్క్‌ను రాజధానిగా నిర్ణయించలేదు. సముద్ర తీర నగరాలు వాణిజ్యపరంగా కీలకమైనవే అయినప్పటికీ మొగల్ చక్రవర్తులు ఢిల్లీనే తమ సామ్రాజ్య రాజధానిగా చేసారు.

 

ప్రపంచంలో ఏ దేశంలోనైనా రాజధాని నిర్మాణం అనేది పూర్తిగా రాజకీయ, చారిత్రక కారణాలతో మాత్రమే జరుగుతుంది. ఈజిప్టు రాజధాని కైరో కావచ్చు లేదా అమెరికా రాజధాని వాషింగ్టన్ కావచ్చు... అందుకు ఏదీ మినహాయింపు కాదు. దశాబ్ద కాలం ప్రయత్నాలు, ప్రణాళికల తర్వాత 1800 సంవత్సరంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ నిర్మాణం పూర్తయింది. అయితే ఆ తరువాత ఒక దశాబ్దానికి (1812లో) బ్రిటన్‌తో జరిగిన యుద్ధంలో అపూర్వంగా నిర్మించుకున్న రాజధాని – వైట్ హౌజ్, కాంగ్రెస్ భవనాలు, ట్రెజరీ కార్యాలయాలతో సహా -దాదాపుగా ధ్వంసమయింది. అమెరికా ప్రజలు అమితంగా బాధపడ్డారు. అదే ప్రదేశంలో వారు తమ రాజధాని నగరాన్ని పునర్నిర్మించుకున్నారు.

 

దుబాయి నుండి ఆబుధాబికి సరిగ్గా రోడ్డు కూడ లేని రోజుల్లో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ రాజధానిగా అబుధాబిని మిగిలిన ఆరు ఏమిరేట్లు ఆంగీకరిస్తూ ఆమోదం తెలిపాయి. సౌదీ అరేబియాలో వాణిజ్య నగరమైన జెద్ధాను రాజు, మంత్రులు తరుచుగా సందర్శిస్తారు. జెద్ధాలో రాజ ప్రసాదం, మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. అయినా రాజధాని రియాధ్ నుండి మాత్రమే పాలన జరుగుతున్నది. మన ముంబై కంటే కరాచీ చాలా మిన్నగా వుంటుంది.

 

మరి పాకిస్థాన్ పాలకులు కరాచీని కాదని పంజాబ్‌లోని మర్గల్లా పర్వత ప్రాంతాలలో తమ నూతన రాజధాని ఇస్లామాబాద్‌ను నిర్మించుకున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూపోతే ఇంకా అనేక ఉదాహరణలు లభిస్తాయి. సరే, మన కశ్మీర్‌కు శీతాకాల రాజధానిగా జమ్ము నగరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలన్నీ శ్రీనగర్‌లోనే వున్నాయి. ఈ ఆనవాయితీకి కొన్ని చారిత్రక కారణాలు వున్నాయి. ఇది మినహా మన దేశంలో మరే రాష్ట్రంలోను బహుళ రాజధానుల పద్ధతి లేదు.

 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది. సహజంగానే రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసింది. మూడు రాజధానుల ప్రతిపాదన దేశంలో ఉన్న ఆంధ్రులతో పాటు విదేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులలోనూ చర్చనీయాంశమయింది.

 

అంతే కాకుండా ఒక హస్యాస్పదమైన విషయంగా కూడా మారిందని చెప్పక తప్పదు. వివిధ రాజకీయ అంచనాలు, సమీకరణల వలన జగన్మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంతం నచ్చకపోవచ్చు. అయితే అంత మాత్రాన రాజధాని విషయమై ఈ రకమైన అగమ్యగోచర పరిస్ధితిని సృష్టించడం ఎంతవరకు సబబు? ఒక రాష్ట్రాధినేత ఇలా వ్యవహరించవచ్చునా? ఒక రాజకీయవేత్తగా ఇది ఆయనకు శ్రేయస్కరం కూడా కాదనడం సత్యదూరం కాదు.

 

అమరావతిలో భూముల విషయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ఒక వైపు; ఇస్తాంబుల్ (టర్కీ రాజధాని) నమూనా, సింగపూర్ నమూనా అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు మరో వైపు.. అన్నీ కలిసి నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని వ్యవహారాన్ని రచ్చ చేసాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రాజధాని కంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ కోణం కూడా ఉందనే సత్యాన్ని దాయలేం. ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మరింత అయోమయ స్ధితిలోకి నెట్టారు.

 

మధ్య యుగాలలో దూరదృష్టితో పాలన చేసిన వారిలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒకడు. ఈ ఢిల్లీ సుల్తాన్‌ (1325-–51) ప్రజా సంక్షేమానికి కట్టుబడిన పాలకుడు కూడా. ఉత్తరం నుండి దక్షిణాది వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేసిన ఘనుడు. కీలకమైన నౌకాయాన మార్గాలపై పట్టు సాధించి విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ఈ తుగ్లక్ పూనుకున్నాడు. అందుకు దక్కన్ రాజ్యాలను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోదలిచాడు. ఈ సంకల్పంతోనే తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి 1500 కిలో మీటర్ల దూరంలో వున్న (మహారాష్ట్రలోని) దేవగిరికి మార్చాడు. ఆ సందర్భంగా ఢిల్లీ ప్రజలు నూతన రాజధానికి తరలి వెళ్ళాలని ఆదేశించాడు. వారి ప్రయాణాలకు అనేక సదుపాయాలూ కల్పించాడు. తీరా దౌలతాబాద్ (దేవగిరి కొత్త పేరు)కు పూర్తిగా మారిన తరువాత, దక్కన్‌పై ఆధిపత్యం అలా వుంచి, ఉత్తరాది ప్రాంతాలు శత్రు పాలకుల హస్తగతమవుతుండడంతో రాజధానిని మళ్ళీ ఢిల్లీకే మార్చి వేశాడు. దీంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్ చరిత్రలో ‘పిచ్చి తుగ్లక్’గా అప్రతిష్ఠ పాలయ్యాడు.

 

సాధారణంగా రాజధాని నగరాలు దేశంలోని అత్యధిక ప్రాంతాలకు సుదూరంగా వుండడం కద్దు. ఇందుకు న్యూఢిల్లీయే ఒక ఉదాహరణ. లాహోర్ - ఆగ్రాలకు మధ్యలో నిర్మాణమైన నూతన రాజధాని ఢిల్లీపై 18వ శతాబ్దిలో ఇరాన్ పాలకుడు నాదిర్ షా దాడి చేశాడు. కర్నాల్ యుద్ధం (1739) లో గెలిచిన తరువాత ఢిల్లీలో నాదిర్ షా మారణహోమం సృష్టించాడు. నగరాన్ని దాదాపుగా ధ్వంసం చేశాడు. ఇప్పుడు జగన్ ఎలాంటి యుద్ధం చేయకుండా మూడు రాజధానుల ప్రకటనతో ఒక నూతన రాజధానికి నష్టం కల్గించారని చెప్పవచ్చు. నాదిర్ షా క్రౌర్యానికి బలయిన తర్వాత కూడా ఢిల్లీలోని చాందీని చౌక్ నేటికీ కళకళాడుతుండగా ఇప్పుడిప్పుడే పురుడుపోసుకొంటున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై నీలిమేఘాలు కమ్ముకొంటున్నాయి.

 

వర్తమాన భారతదేశంలో అన్ని విధాల పురోగమిస్తోన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర పేరు ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపచేయవలసిన బాధ్యత రాష్ట్ర పాలకులపై వున్నది. ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడానికి కృషి చేయాలి. అలా కాకుండా రాజధాని అమరావతి భవిష్యత్తుపై అనిశ్చిత పరిస్థితిని సృష్టించడం సమంజసం కాదు. పైగా అది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు తీరని నష్టం.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.