Abn logo
Aug 2 2020 @ 02:59AM

గవర్నర్‌ మరణ శాసనం!

  • వైసీపీ నమ్మించి మోసం చేసింది
  • బీజేపీ నేతలు అంగుళమైనా కదలదన్నారు
  • ఇప్పుడేం సమాధానం చెబుతారు
  • ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోతోంది
  • అమరావతి రైతుల ఆగ్రహ జ్వాలలు
  • 228వ రోజుకు చేరిన నిరసనలు

గుంటూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై సంతకం చేసి రాష్ట్ర గవర్నర్‌ తమ పాలిట మరణ శాసనం రాశారని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిర్ణయంతో వారిలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్ర పరిపాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ వారు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 228వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఇళ్లలోనే ఆందోళనలు కొనసాగిస్తున్న 29 గ్రామాల రైతులు, మహిళలు... శనివారం తిరిగి రోడ్డెక్కారు.  భౌతిక దూరం పాటిస్తూ.. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని.. ఏడ్చి ఏడ్చి కన్నీరు సైతం ఇంకిపోతోందని, అయినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.


గవర్నర్‌ గుడ్డిగా సంతకం చేశారని మండిపడ్డారు. అమరావతితో ఒక్క అంగుళం కూడా కదలదన్న బీజేపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఆంధ్రుల రాజధాని కోసం భూములను త్యాగం చేయడమే తాము చేసి తప్పిదమా అని కన్నీరు పెట్టుకుంటూ బోరుపాలెం మహిళలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఒకప్పుడు అమరావతికి అంగీకరించిన జగన్‌.. ఎన్నికల సమయంలోనూ తాను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని.. రాజధాని మార్చబోమని చెప్పి ఇప్పుడు నిలువునా మోసం చేశారని తుళ్లూరు రైతులు జోరు వర్షంలో ఆందోళనలు కొనసాగించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కృష్ణాయపాలెం రైతులు డిమాండ్‌ చేశారు. 


సీఎం దళిత ద్రోహి..

సీఎం దళిత ద్రోహి అని స్పష్టమైందని దళిత జేఏసీ నేతలు అన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదన్న కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా రాజఽధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందంటే.. దేశంలో కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అనేక రాష్ట్రాల్లో దేశ రాజధానులను ఏర్పాటు చేయాలని బీజేపీని డిమాండ్‌ చేశారు. జేఏసీ నేతలు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


బోరుపాలెంలో మహిళా రైతు మృతి

గవర్నర్‌ రాజధాని బిల్లులపై సంతకం చేయడంతో ఆవేదన చెందిన బోరుపాలెంవాసి నెలకుదిటి సామ్రాజ్యం (70) గుండెపోటుతో మరణించింది. ఆమె తనకున్న 60 సెంట్ల భూమిని రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చింది.


ఒకటే రాష్ట్రం.. ఒకే రాజధాని

ఎన్నికల సమయంలో రాజధాని అమరావతి ఎక్కడకూ పోదని నమ్మించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మోసగించిందని పొలిటికల్‌, నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేతలు మండిపడ్డారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర గవర్నర్‌ సంతకం చేయడాన్ని నిరసిస్తూ శనివారమిక్కడి లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద వారు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

Advertisement
Advertisement
Advertisement