రాజధాని మార్పు మూర్ఖత్వమే

ABN , First Publish Date - 2020-09-25T08:27:32+05:30 IST

‘అమరావతి గౌతమ బుద్ధుడి చారిత్రక ప్రాంతమని, ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన రాజధానిని ఇప్పుడు తరలించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

రాజధాని మార్పు మూర్ఖత్వమే

అమరావతి బుదుఽ్ధడి చారిత్రక ప్రాంతం..

భూములిచ్చిన వారిలో బడుగులే ఎక్కువ

వారిని దగా చేయడం మంచిది కాదు

కేంద్ర మంత్రి అఠావలే వ్యాఖ్యలు

ఢిల్లీలో కలిసిన మహిళా జేఏసీ నేతలు

మరో మంత్రి మురళీధరన్‌తోనూ భేటీ

రాజధాని ఉద్యమానికి  ఇద్దరి సంఘీభావం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి గౌతమ బుద్ధుడి చారిత్రక ప్రాంతమని, ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన రాజధానిని ఇప్పుడు తరలించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో బడుగు, బలహీన వర్గాలవారే అధిక సంఖ్యలో ఉన్నారు. రాజధాని కోసమే భూములిచ్చిన రైతులను దగా చేయడం మంచిది కాదు‘ అని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) నేత రామ్‌దాస్‌ అఠావలే వ్యాఖ్యానించినట్లు అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ చెప్పారు.

ఆమెతో పాటు జేఏసీ నేతలు రాయపాటి శైలజ, కంభంపాటి శిరీష, గుర్రం ప్రియాంక తదితరులు గురువారమిక్కడ ఆయనతోను.. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్‌తోను విడివిడిగా సమావేశమయ్యారు.




అనంతరం పద్మశ్రీ విలేకరులతో మాట్లాడారు. ‘భూములిచ్చిన రైతులను జగన్‌ ప్రభుత్వం దగా చేస్తోందని.. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని అమరావతి కోసమే స్వచ్ఛందంగా భూములిచ్చామని మంత్రులకు వివరించాం. మా ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తోందని తెలియజేశాం.

పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తెచ్చి, అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి యత్నిస్తున్న తీరును వివరించాం. కేంద్ర మంత్రులిద్దరూ మా గోడును సానుభూతితో విన్నారు. సానుభూతితో స్పందించారు. రాజధాని తరలింపునకు నిరసనగా గాంధేయ మార్గంలో చేపడుతున్న మా పోరాటానికి సంఘీభావం తెలిపారు. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు’ అని తెలిపారు.


Updated Date - 2020-09-25T08:27:32+05:30 IST