ట్వీట్‌ చేయకుండా నిరోధించలేం

ABN , First Publish Date - 2020-10-02T08:02:01+05:30 IST

అభ్యంతరకర ట్వీట్లు చేసే ఖాతాలను ముందుగానే నిరోధించడం సాధ్యం కాదని ట్విటర్‌ సంస్థ హైకోర్టుకు తెలిపింది. ‘ఒక ఖాతాదారు హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సమాచారం అందజేస్తారు.

ట్వీట్‌ చేయకుండా నిరోధించలేం

అది ఐటీ చట్టాలకు వ్యతిరేకం

హైకోర్టుకు తెలిపిన ట్విటర్‌ 


హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరకర ట్వీట్లు చేసే ఖాతాలను ముందుగానే నిరోధించడం సాధ్యం కాదని ట్విటర్‌ సంస్థ హైకోర్టుకు తెలిపింది.


‘ఒక ఖాతాదారు హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సమాచారం అందజేస్తారు. అది వారిద్దరి మధ్య జరిగే సంభాషణ. దాన్ని చట్ట ప్రకారం మేం ఎడిట్‌ చేయలేం. అలా చేస్తే భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుంది. ఈ చర్య ఐటీ యాక్టులోని సెక్షన్‌ 69ఏకు వ్యతిరేకం. ప్రచురితమైన (ట్వీట్‌) సమాచారం ఆధారంగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ట్విటర్‌ తరఫున న్యాయవాది మైక్‌ ఎల్‌.రుబ్బో హైకోర్టుకు నివేదించారు.


ఫలానా ఖాతాలను బ్లాక్‌ చేయాలని న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలుంటే తప్ప చర్యలు తీసుకోలేమని తెలిపారు. అయితే అభ్యంతరకర సమాచారం ట్వీట్‌ చేసే ఖాతాల పట్ల ట్విటర్‌ సంస్థ పారదర్శకంగా వ్యవహరిస్తుందని న్యాయస్థానానికి తెలియజేశారు. ట్విటర్‌ సంస్థ అమెరికా చట్టాల ప్రకారం ఏర్పడిందని, ఈ వ్యాజ్యాన్ని విచారించే పరిధి హైకోర్టుకు లేదని చెప్పారు.

Updated Date - 2020-10-02T08:02:01+05:30 IST