జగన్‌ బెయిల్‌ రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-04-07T08:25:39+05:30 IST

అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సహనిందితుడు విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నరసాపురం ఎంపీ

జగన్‌ బెయిల్‌ రద్దు చేయండి

సాక్షులను ప్రభావితం చేస్తున్నారు

స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు

చిన్న చిన్న సాకులతో కోర్టుకు గైర్హాజరు

రాజ్యాంగ పదవిలో ఉంటూ అరాచక పాలన

రాష్ట్ర ప్రజల గొంతు నొక్కేస్తున్నారు

అనూహ్య హింసను ప్రేరేపిస్తున్నారు

అక్రమాస్తుల కేసు సహ నిందితులకు రాజకీయ, అధికార పదవులు

సీబీఐ కోర్టులో రఘురామరాజు పిటిషన్‌


అమరావతి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సహనిందితుడు విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. వీరిద్దరూ అరాచకాలకు పాల్పడుతున్నారని.. చిన్న చిన్న సాకులతో కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. బెయిల్‌ ద్వారా సంక్రమించిన స్వేచ్ఛను జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బెయిల్‌ ఎందుకు రద్దుచేయాలో వివరిస్తూ 26 అంశాలను, ఉప అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. సీఎం గా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక సాక్షులను ప్రభావితులను చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉంటూ అరాచక పాలన సాగించడాన్ని.. నిష్కళంకమైన పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెంది.. నరసాపురం లోక్‌సభ సభ్యుడిగా రాజ్యాంగంపై ఉన్న గౌరవంతో.. సహించలేకపోతున్నానన్నారు. సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం.. పోలీసు దర్యాప్తులో భాగంగా ఎవరు పిటిషన్‌ వేసినా.. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేదా ప్రభావితం చేస్తున్నారని భావిస్తే.. కోర్టులు సుమోటో గా బెయిల్‌ను రద్దు చేయవచ్చని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసినవాడిగా..నిజాలు బయటకు వచ్చి..విచారణ త్వరితగతిన ముగియాలంటే ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరారు.


సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితులను చేయకుండా ఉండేందుకు ఇదే మార్గమన్నారు. నిందితుడు జగన్‌ పథకం ప్రకారం రాష్ట్ర ప్రజల గొంతును నొక్కేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని.. అనూహ్యమైన హింసను ప్రేరేపిస్తూ భావ ప్ర కటనా స్వేచ్ఛనూ అడ్డుకుంటున్నారని తెలిపా రు. ‘ప్రజాస్వామ్య మూలస్తంభాలైన ఎలకా్ట్రనిక్‌, ప్రింట్‌ మీడియాకు చెందిన కొన్ని సంస్థలపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను తనపార్టీకి మద్దతుగా మలచుకుని అన్యాయంగా పాలిస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా పాలక పక్షానికి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్య హక్కులను హరించివేస్తోంది. ఈ అరాచకాలను పరిగణనలోకి తీసుకుని జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలి’ అని కోరారు.


సుప్రీం ఆదేశాలు జీర్ణించుకోలేక..

ఏడాది కింద ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయాలని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని రఘురామరాజు పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ ఆదేశాలను జగన్‌, విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని.. ఇది తమ రాజకీయ అధికారానికి విఘాతంగా భావిస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న సాకులు చూపుతూ సీబీఐ కోర్టు విచారణకు రాకుండా తప్పించుకుంటూ జాప్యం చేస్తున్నారని అన్నారు. బెయిల్‌ పొందేటప్పుడు..విచారణకు హాజరవుతానని.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు కుంటి సాకులతో రావడం లేదని తెలిపారు. తన సహనిందితులకు రాజకీయ, అధికారిక పదవులు కట్టబెట్టారని.. విజయసాయిరెడ్డికి రాజకీయ పదవిని, ఆదిత్యనాథ్‌దా్‌సకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి, మరో సహనిందితుడు కోనేరు ప్రసాద్‌కు లోక్‌సభ టికెట్‌ ఇచ్చారని అన్నారు. మరో సహ నిందితురాలు ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించి పదోన్నతులు కల్పించారని.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌కూ సలహాదారు పదవి కట్టబెట్టారని వివరించారు.

Updated Date - 2021-04-07T08:25:39+05:30 IST