రష్యా వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి అప్రూవ్ చేయలేం: కెనడా

ABN , First Publish Date - 2020-08-12T23:50:00+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నామంటూ రష్యా

రష్యా వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి అప్రూవ్ చేయలేం: కెనడా

ఆంటారియో: ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నామంటూ రష్యా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచదేశాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. రష్యా వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి తాము అప్రూవ్ చేయడం లేదని కెనడా ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచార లోపం కారణంగానే తాము అప్రూవ్ చేయడం లేదని కెనడా డిప్యూటీ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోవార్డ్ జో మంగళవారం తెలిపారు. రష్యాలో వ్యాక్సిన్‌కు వెంటనే ఆప్రూవల్ రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని హోవార్డ్ అన్నారు. ప్రయోగం మొదలుపెట్టిన అతి కొద్ది రోజులకే చివరి దశకు చేరుకుని అప్రూవల్ పొందడం పట్ల హోవార్డ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోపక్క చీఫ్ పబ్లిక్ ఆఫీసర్ డాక్టర్ థెరీసా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రయోగాలు జరుగుతుండటం ఆనందంగా ఉందన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రపంచదేశాలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామన్నారు.


కాగా.. ‘స్పుత్నిక్‌-వి’ పేరుతో వ్యాక్సిన్ సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. కరోనాకు టీకా అభివృద్ధి చేసిన మొదటి దేశంగా రష్యా నిలిచిందన్నారు. ఈ టీకా వేయించుకుంటే రెండేళ్లపాటు కొవిడ్‌ నుంచి రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయోగాల్లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇవ్వగా.. ఆమె శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తిఅయినట్టు వెల్లడించారు. కొద్దిపాటి జ్వరం తప్ప ఆమెకు ఇతరత్రా ఎలాంటి సమస్యలూ రాలేదన్నారు. ఇద్దరిలో ఎవరికి వ్యాక్సిన్‌ ఇచ్చిందీ ఆయన చెప్పలేదు. ఇప్పటికే 20 దేశాలు 100 కోట్ల డోసులకు ఆర్డర్లు ఇచ్చాయని తెలిపారు. సెప్టెంబరులో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీస్థాయిలో ప్రారంభించి.. అక్టోబరు నుంచి ప్రజలకు ఇవ్వనున్నట్టు రష్యా అధికారులు చెప్పారు.



Updated Date - 2020-08-12T23:50:00+05:30 IST