భిన్నమైన సమాజాన్ని నిర్మించుకోగలమా?

ABN , First Publish Date - 2022-08-05T09:57:23+05:30 IST

పెట్టుబడిదారీ సమాజానికి భిన్నమైన సమాజాన్ని, పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి విధానాన్ని ఈ ప్రపంచం, కనీసం మన దేశం...

భిన్నమైన సమాజాన్ని నిర్మించుకోగలమా?

పెట్టుబడిదారీ సమాజానికి భిన్నమైన సమాజాన్ని, పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి విధానాన్ని ఈ ప్రపంచం, కనీసం మన దేశం రూపొందించుకోగలదా? ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా సామ్యవాదం, కమ్యూనిజం, గాంధీజీ సర్వోదయం వంటివి వచ్చాయి కానీ, ఏ దేశంలోనూ పూర్తిగా నిలదొక్కుకోలేదు. భారతదేశంలో నేడు పెట్టుబడిదారులను జాతి నిర్మాతలుగా కొనియాడే పరిస్థితి ఉంది. ఈ దేశ ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని సుస్థిరం చేసి ఆ తరువాత తన వ్యాపారంలో లాభాన్ని పొందాలనే దృష్టి గల దేశభక్తుడైన వ్యాపారవేత్తను, ఒట్టిపోయే వరకు ఆవుపాలు పితికి తర్వాత దాన్ని కబేళాకు అప్పగించే ధోరణి గల వ్యాపారవేత్తను ఒకటిగానే చూసే కురచ దృష్టి నేటి యువతకు అలవడుతోంది. మంత్రులు, ముఖ్యమంత్రులు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని విదేశాలలో మార్కెటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. రాష్ట్రాల మధ్య పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పోటీ నెలకొని పక్క రాష్ట్రంలో పరిస్థితులు దెబ్బతింటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయని నాయకులు భావించే పరిస్థితి కూడా ఉంది. అలా భావిస్తూ అందుకై ప్రయత్నించే సంకుచిత నాయకులే మహానేతలుగా నేడు చెలామణి అవుతున్నారు.


బలవంతుడు బలహీనుడిని, తెలివిగలవాడు తెలివి లేనివాడిని దోచుకోవడం పెట్టుబడిదారీ విధానంలో అంతర్భాగం. పూర్తిస్థాయి పెట్టుబడిదారీ సమాజంగా మారిపోతున్న భారతదేశంలో ఆకలితో అలమటింపులు–అజీర్తి బాధలు, రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు–తరాలు తిన్నా తరగని సంపదలు పక్కపక్కనే తాండవిస్తున్నాయి. ఒక సమాజం వ్యవస్థీకృత అవినీతినేగాక తనను నిలువుదోపిడీ చేస్తున్నప్పటికీ సహిస్తూ నిర్లిప్తంగా ఉందంటే అది పురోగామి ఎంతమాత్రమూ కాదు. పెట్టుబడిదారీ విధానం పుట్టుక దగ్గర నుంచి చావు వరకు ప్రతిదాన్నీ సరుకుగా మారుస్తుంది, బతకడానికి డబ్బు అన్నట్టు కాకుండా డబ్బు కోసమే బతుకు అన్న తత్త్వాన్ని మనిషికి అలవాటు చేసి అతని జీవితాన్ని సంక్లిష్టమయం చేస్తుంది. జాతీయవాదం, పెట్టుబడిదారీ విధానం మిలాఖత్ అయిన నేటి భారతదేశంలో, పశ్చిమానికి నకలుగా మారుతున్న నేటి హిందూస్థానంలో నవశకం ఉదయించాలంటే నవతరం దృక్పథంలో మార్పు రావాలి. ప్రాచీన భారతదేశం అందించిన విలువలకు నేటితరం పునరంకితం కావాలి.

కుమార్ బాబు

Updated Date - 2022-08-05T09:57:23+05:30 IST