మోదీని బట్టేబాజ్‌, లుచ్చాగాడు అని తిట్టలేమా?

ABN , First Publish Date - 2022-04-21T08:07:44+05:30 IST

‘‘మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పులాగా విసిరేస్తా. నేను చెప్పే లెక్కలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా.

మోదీని బట్టేబాజ్‌, లుచ్చాగాడు అని తిట్టలేమా?

  • మాకు బూతులు రావా.. ఏం? 
  •  మేం అట్లా మాట్లాడం.. అది మా నేత నేర్పిన సంస్కారం
  • కేసీఆర్‌ లేకుంటే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడివి?
  • ఇవ్వాళ మొరుగుతున్న కుక్కలకు ఆ పదవులెక్కడివి?
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై కేటీఆర్‌ ధ్వజం
  • ఏడేళ్లలో కేంద్రానికి చెల్లించింది రూ.3,65,797 కోట్లు
  • తెలంగాణకు తిరిగి ఇచ్చింది రూ.1,68,647 కోట్లే
  • ఈ లెక్కలు తప్పయితే రాజీనామా చేస్తా
  • హనుమకొండ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ 
  • అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు


ఓరుగల్లు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పులాగా విసిరేస్తా. నేను చెప్పే లెక్కలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా. బీజేపీ నేతలకు దమ్ముందా. నా లెక్కలకు జవాబు చెప్పే ధైర్యం ఉందా’’ అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని అబద్ధపు మాటలు చెప్పే వారికి తగిన బుద్ధి చెప్పాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సాయంత్రం హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై తీవ్ర పదజాలంతో కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌ షాలను సైతం వదిలిపెట్టకుండా పరుష పదజాలంతో విమర్శించారు. మోదీ సర్కారు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఏడేళ్లలో మనం పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు చెల్లించగా.. వారు రాష్ట్రానికి కేవలం రూ.1,68,647 కోట్లే ఇచ్చారని చెప్పారు. ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులాగా విసిరేస్తానని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని తెలిపారు. దమ్మున్న వాళ్లు తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాదని, కేవలం గుజరాత్‌కు మాత్రమేనని విమర్శించారు. జాతీయ సంస్థల్లో ఒక్కటి కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదన్నారు. చట్టాన్ని కూడా బేఖాతరు చేసి కొత్త జిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాలా ఏర్పాటు చేయలేదని చెప్పారు. 


తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు వెన్నెముక లేని వారని, మోదీ ఎదుట నిలబడడానికే వణికిపోతారని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం అడుగుతారా? అని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ఆడంబరంగా ప్రకటించారని, ఇప్పుడా సంస్థకు ప్రధానమంత్రి మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శంకుస్థాపన చేశారని చెప్పారు. తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది? టీబీజేపీ ఎక్కడిదని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిల్లర, బట్టేబాజ్‌గాళ్లను ఎవడైనా పట్టించుకున్నడా అన్నారు. ‘కేసీఆర్‌ లేకపోతే ఇవ్వాళ మొరుగుతున్న కుక్కలు, గాడిదలకు ఆ పదవులెక్కడివి? ఎవడీ రేవంత్‌రెడ్డి, ఎవడీ సంజయ్‌. వీళ్లుగూడ మాట్లాడతరు మొగోళ్ల లెక్క. కేసీఆర్‌ వయసు అంటే గౌరవం లేదు. ఆయన రెండుసార్లు ప్రజలచేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి అని మరిచిపోయిండ్రు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకు మాట్లాడడం రాదా? మాకు రావా బూతులు. మోదీని ఏమిరా.. రారా పోరా.. అనరాదా. అమిత్‌ షాను అనరాదా. మోదీ బట్టేబాజ్‌గాడు అనరాదా. లుచ్చాగాడు అనరాదా? కానీ, అనడం లేదు. అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం. నాలుక వాడుడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడూ మాట్లాడలేడు. ఆ తంబాకు బుక్కెటోడు ఒకడున్నడు.


 వాడు మాట్లాడుకుంట తిరుగుతాండు పాలమూరుల. వాణ్ణి గెలిపించింది కరీంనగర్ల. అమ్మకు అన్నంపెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని గాడ తిరుగుతాండు. కరీంనగర్‌లా వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్నప్పుడు ఒక ట్రిపుల్‌ ఐటీ కావాలని ప్రయత్నం చేసి ఆఖరుదాక తీసుకొచ్చిండు. దాన్ని మోదీ ఇవ్వడు. అది వేరే కథ. గా ట్రిపుల్‌ ఐటీని కూడా తేరాని చేతగాని దద్దమ్మ.. వీడట ఏదో ఉద్దరిస్తడట. పాలమూరుల ప్రజా సంగ్రామ యాత్రనట. ఎవడి మీద మీ సంగ్రామం. భారతీయ జనతా పార్టీ డఫర్‌ నాయకుల్లారా.. బేకార్‌ నాయకుల్లారా.. బఫూన్‌ నాయకుల్లారా.. నేను అడుగుతున్నా. ఏంది మీరు చేసింది తెలంగాణకు. వడ్లు కొనండి రా అంటే.. మీ వాళ్లకు నూకలు తినిపియండని ఒక చిల్లర గాడంటరు.. అసలు అదీ చిల్లర పార్టీ.. బేకార్‌ పార్టీ. ఏమనాలి వాళ్లను?’ అని కేటీఆర్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘ఈ పార్టీకి నలుగురు ఎంపీలున్నరు. ఒకడేమో కరీంనగర్‌లో గెలిచిండు. అక్కడ పీకింది లేదు. ఇక నిజామాబాద్‌ ఎంపీ గెలిచిన తర్వాత ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ మీద రాసిచ్చిండు. యాడ బోయింది పసుపుబోర్డు. అడ్రస్‌ ఉన్నదా ఆయనకు. నోరు తెరిస్తే కేసీఆర్‌ మీద బూతులు తప్ప ఏం మాట్లాడతడు? ఆదిలాబాద్‌కు సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెప్పిస్తానన్నాడు. ఇప్పటికీ పత్తా లేదు. సికింద్రాబాద్‌లో గెలిచిన కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయిండు. వెన్నెముక లేని నాయకుడు ఈయన. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కోచ్‌ ఫ్యాక్టరీ కాజీపేటలో పెట్టమంటే దేశంలో కొత్త కోచ్‌ ఫ్యాక్టరీల అవసరం లేదని పార్లమెంట్‌ సాక్షిగా అబద్దం చెప్పారు. రెండేళ్లు దాటకుండానే బీజేపీ పాలిత మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టారు. ఇంత మోసం చేసిన భారతీయ జనతా పార్టీని లుచ్చా అనాలా, లోఫర్‌  అనాలా, బట్టే బాజ్‌ అనాలా?’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.


మతం పేరుతో చిల్లర రాజకీయాలు 

‘మతం పేరుతో చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారు. గీ చిల్లర మాటలకు కన్ఫ్యూజ్‌ కావద్దు. దేవుడు, మఠాలు, మతాలు అంటరు. కర్ణాటకలోని ఓ మఠాధిపతి బయటకు వచ్చి చెప్పిండు. మా మఠాల నుంచి 30 శాతం కమీషన్‌ తింటున్న దౌర్భాగ్యులని చెప్పిండు. గిసోంటోళ్లట ఇక్కడేదో పొడుస్తరట. ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడున్నడు మహబూబ్‌నగర్‌లో నడుస్తున్నడు. కొద్దిగ పక్కనే రాయచూరు ఉన్నది. మొన్ననే రాయచూరు ఎమ్మల్యే చెప్పిండు. మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలపండీ అని. ఇక్కడున్న బట్టేబాజ్‌గాళ్లేమో అక్కడేదో పొడిసినట్టు అవకాశం ఇస్తే ఇక్కడేదో పొడుస్తరట. సోషల్‌మీడియా వచ్చిందాన్ని చూసి ఆగం కావలసిన అవసరం లేదు. ప్రజల గుండెల్లో నిండుగా కేసీఆర్‌ ఉన్నడు. కాంగ్రెస్‌ ఎప్పుడో చచ్చిపోయింది. రాహుల్‌ గాంధీ ఆయన పోటీ చేసిన అమేథీలోనే ఓడిపోయిండు. మరొకాయన ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిన చిల్లర దొంగ. ఇలాంటి బుట్టాచోర్‌గాళ్లు, బట్టేబాజ్‌గాళ్లు తిడితే పడతామా. తప్పకుండా మర్లపడతాం. ఓరుగల్లు పోరుగల్లు నుంచే. మొన్న జనగామలో ఎట్లయితే సత్తా చూపించారో.. అదే తీరుగా బుద్ధి చెప్పాలే. కార్యకర్తలను ఎమ్మెల్యేలు కడుపులో పెట్టుకొని కాపాడాలి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 


సుడిగాలి పర్యటన

కేటీఆర్‌ హనుమకొండ పర్యటన సుడిగాలిలా సాగింది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చకచకా చేసేశారు. ముందుగా మంత్రి హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల నుంచి గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) కార్యాలయం వద్దకు ఉదయం 10:27 నిమిషాలకు చేరుకున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో రూ.158.20 కోట్ల అంచనాలతో చేపట్టే మొత్తం 14 అభివృద్ధి పనులకు 10:32 గంటలకు ఒకేచోట కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.27.62 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పబ్లిక్‌గార్డెన్‌లో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించి 10 నిమిషాల్లో బయటకు వచ్చారు. 11.15 గంటలకు అక్కడి నుంచి నర్సంపేటకు బయలుదేరారు. మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటనపై గులాబీ దళాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేటీఆర్‌ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులెవరితోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను కేటీఆర్‌ ఆవిష్కరించారు. 


పట్టణంలో ఇంటింటికీ పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా పథకంతోపాటు రూ.50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం, రూ.30 లక్షలతో మెప్మా భవనం, రూ.30 లక్షలతో మిషన్‌ భగీరథ పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే రూ.4 కోట్లతో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు రూ.115 కోట్ల విలువైన అభయహస్తం, స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలను, క్రీడల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. రాష్ట్ర పురపాలక శాఖలో 3,712 మంది ఉద్యోగుల నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, దీంతో మునిసిపాలిటీల్లో త్వరలో సిబ్బంది కొరత తీరుతుందని కేటీఆర్‌ తెలిపారు. హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 51 వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను జీడబ్ల్యూఎంసీల్లో విలీనం చేశామని చెప్పారు. వరంగల్‌లో ప్రస్తుతం అమలవుతున్న స్మార్ట్‌సిటీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.250 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిందిగా ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వరంగల్‌ వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని కేటీఆర్‌ చెప్పారు. 

Updated Date - 2022-04-21T08:07:44+05:30 IST