కృష్ణా జల జగడం ముగించలేమా?
ABN , First Publish Date - 2021-06-29T06:26:53+05:30 IST
చైతన్యవంతులమని గొప్పలు పోయే తెలుగు ప్రజల మధ్య కృష్ణా నదీజలాల వివాదం ఒక పట్టాన తెగడం లేదు. ఎప్పటికప్పుడు చర్చ మొదలవుతుంది తప్ప, ఒక కొలిక్కిరాదు....
చైతన్యవంతులమని గొప్పలు పోయే తెలుగు ప్రజల మధ్య కృష్ణా నదీజలాల వివాదం ఒక పట్టాన తెగడం లేదు. ఎప్పటికప్పుడు చర్చ మొదలవుతుంది తప్ప, ఒక కొలిక్కిరాదు. ఏ ఒత్తిడి పని చేసిందో కానీ తెలంగాణ ప్రభుత్వం జూన్ 19న చాలా గట్టిగా స్పందించింది. ఇక ఆగేది లేదని, బీమా వరద కాలువ, జోగులాంబ బ్యారేజీ, సుంకేశుల దగ్గర ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు, పులిచింతల ఎడమకాలువ చేపడతామని, వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని, ఇక మౌనంగా ఉండేది లేదని ప్రకటించింది. అయితే ఏడేళ్ల పాటు ఈ పథకాలు, నిర్మాణాలు చేపట్టకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా? ఎందుకు ఈ పథకాలు చేపట్టకుండా, చేపట్టిన వాటిని పూర్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వం, సమాజం తనను తాను మోసగించుకున్నదో ఆలోచించాలి. ఇప్పటికైనా వివాదాన్ని ముగిస్తామా? లేక చిన్నయసూరి కథలో లాగ రొట్టెముక్క పంచే పనిని పైవాడి చేతిలో పెట్టి బిక్కమొగం వేస్తామా?
ముంబాయి, బొగ్గుబాయి, దుబాయి అని పిలుచుకున్న వలస బతుకుల వెతల నుంచి కాపాడుకోవడానికి నీళ్లు, నిధులు, నియామకాల నిర్వహణలో మనమే అధికారం పొంది న్యాయం సాధించుకోవడానికి రాష్ట్రం కావాలని పోరాడాం. ఉమ్మడి రాష్ట్రంలో ‘కర్ర ఎవడిదో బర్రె వాడిది’ అన్నట్టు అన్యాయమే న్యాయంగా చలామణి అయిందని అర్థం చేసుకున్నాం. అప్పటి జల విధానమంతా డెల్టా ప్రయోజనానికే అమలయిందని రుజువు చూపించాం. 1980ల తరువాత దృశ్యం కొంత మారటం మొదలయింది. అది రాయలసీమ ప్రయోజనాలను ఆలోచించింది. నాగార్జునసాగర్‌కు ఎడమకాలువ నిర్మించినా నీటి పంపకంలో తెలంగాణకు సమన్యాయం లభించలేదు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి కుడి కాలువ మాత్రమే పోతిరెడ్డిపాడు పేరున తెలుగుగంగ పేరున నిర్మాణమైంది. శ్రీశైలం ఎడమకాలువ మూలనపడింది. అటు బ్రిటిష్ కాలం నాటి కెసి కాలువకు, ఇటు నిజాం కాలం నాటి ఆర్డీఎస్ కాలువకు సమాన వాటా నీరందాలని ఒప్పందాలున్నా అమలుకాలేదు. కెసి కాలువకు నీరిచ్చే సుంకేశులకు తెలంగాణకు నీరివ్వగల ఎడమ కాలువ లేదు. వరద రాకపోతే తుంగభద్ర సుంకేశుల దగ్గర ఆగిపోతుంది. అలాగే ఆర్డీఎస్ కట్ట దగ్గర ఆంధ్రకు నీరిచ్చే కాలువ లేదు. ఆర్డీఎస్ తూములు మూయలేదు గనుక, ఆ కట్టను సుంకేశుల వలె ఆధునికీకరించి పెద్ద ప్రాజెక్టు నిర్మించలేదు. కనుక కాలువకు అందకుండానే నీరు సుంకేశులకు చేరుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుదలతో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకి కూడా తెలంగాణ వైపు నీరిచ్చే ఎడమ కాలువ లేదు. వెరసి ఆంధ్ర-రాయలసీమల కోసమే కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది కానీ తెలంగాణ కోసం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడు వివక్ష లేకుండా, తెలుగుప్రజల మంతా ఒకటేకదా అనే ఆర్ద్ర దృష్టి, విశాల హృదయంతో పని చేయలేదు. సాంకేతిక విజ్ఞానం పెరిగిన తరువాత చేపట్టిన ఎత్తిపోతల పథకాలలో కూడా తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది.
బచావత్ కమిషన్ పంచిన నీటిలో తెలంగాణకు దక్కింది చాలా తక్కువ. ఇది గుర్తించినందు వల్లనే రాజారావు కమిటీ నివేదిక తరువాత అతి కొద్ది నీరు తెలంగాణకు సర్దుబాటు చేశారు. అది 299 టిఎంసిలు మించలేదు. బచావత్ తన తీర్పులో ఆయా రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని సర్దుబాటు చేసుకుని ఉపయోగించుకోవచ్చునని కూడా సూచించినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను చాలా వివక్షతో చేపట్టారు. వాటిని ఆనాటి తెలంగాణ నేతలు ప్రశ్నించ లేదు. ఈ అన్యాయాల నుంచే తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగసింది. కొత్త రాష్ట్రం సిద్ధించింది. అయినా ఇప్పటి ప్రభుత్వం దక్షిణ తెలంగాణను వివక్షకు గురి చేస్తోంది. ఈ ఏడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్డీఎస్ కుడి కాలువ సాధించుకున్నట్టుగా, తెలంగాణ ప్రభుత్వం సుంకేశుల, పులిచింతల ఎడమ కాలువలు సాధించి ఉండవచ్చు. శ్రీశైలం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఉండవచ్చు. సుంకేశుల ఆర్డీఎస్ను ఆధునికీకరించి తెలంగాణ సరిహద్దు వద్ద మన వాటా నీటిని సాధించి ఉండవచ్చు. పాత ఎత్తిపోతల పథకాలు, కాలువల సామర్థ్యాన్ని సమీక్షించి సీమ పథకాల వలె 30 రోజులలో నీరు తీసుకునే విధంగా అభివృద్ధిపరచి ఉండవచ్చు. నీటిని ఒడిసిపట్టి, ఎత్తి పోసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ఎగువ ప్రాంత బాధిత రైతాంగానికి కనీస న్యాయం చేసి ఉండవచ్చు. అందువల్లనే షర్మిల వంటివారు మా తండ్రి ఇచ్చిన నీరే మీకు దిక్కయిందని మాట్లాడగలుగుతున్నారు. కృష్ణానదీ జలాల వినియోగానికి సంబంధించి రైతాంగానికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక విధానం రూపొందించలేకపోయింది. తనకు సంక్షోభం వచ్చినప్పుడే కృష్ణా జల వివాదం ముందుకు తెస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన జీవో 72ను అమలు చేయడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. అమ్రాబాదు, గట్టు, బల్మూరు ఎత్తిపోతల గానీ, డిండి పథకానికి బస్వాపూర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించడం కానీ, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరును పూర్తిచేసి గోదావరి-కృష్ణా నదుల నీటికి సంగమస్థలంగా అభివృద్ధి చేయడం కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. గోదావరి నీళ్లు శ్రీశైలానికి తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటోంది. ఆంధ్రా పాలకులకు తెలివి తక్కువ అని భావించి ఆ పనిని తెలంగాణ తలకెత్తుకుంటుందా? ఈ ఏడేళ్లలో అటు గోదావరి నుంచి, ఇటు కృష్ణ నుంచి ఎంత నీరు తరలించుకునే వ్యవస్థలను ఆంధ్ర పాలకులు నిర్మించుకున్నారో తెలంగాణ నేతలకు, అధికారులకు సోయి ఉందా?
ఇప్పుడు మరోసారి జలజగడం, ప్రజాయుద్ధం, ఫిర్యాదులు, అప్పీళ్లు అంటున్నారు. ఏవీ అక్కరకు రాగలిగేవి కావు. తెలంగాణ వైపు కూడా న్యాయమైన వాటా నీరు తీసుకునే లిఫ్టులు, బ్యారేజీలు నిర్మించండి. కాలువలు తవ్వండి. నీరుంటే అందరికీ ఉంటుంది. లేకపోతే ఎవరికీ ఉండదు. బెదిరింపులు, యాచనలు ఎందుకు? పాత పథకాలను అవసరమైన సామర్థ్యంతో పూర్తి చేయడంతో పాటు, బీమా-కృష్ణా సంగమస్థలి నుంచి వరదకాలువ లేదా ఎత్తిపోతల చేపట్టండి. జాప్యం లేకుండా జూరాల దిగువన పేరేదైనా కానివ్వండి వనపర్తి-–అలంపూర్ నియోజకవర్గాల మధ్య అడ్డుకట్ట నిర్మించండి. పైన వంతెన నిర్మించండి. మంచాల కట్ట దగ్గర మరో వంతెన అవసరం లేదు.
నాగార్జునసాగర్, శ్రీశైలం మొదలు ప్రస్తుత నిర్వాసితులందరినీ ఆదుకునే చర్యలు చేపట్టే పనిని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండా చేసుకోవాలి. లేస్తే ఆగము అని ఎంతకాలం మభ్యపెడతారు... ఇప్పటికే ఏడేళ్ల కాలం నష్టమైంది.
ఎం. రాఘవాచారి
కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక