పుర పోరుకు ప్రచారాస్త్రాలు!

ABN , First Publish Date - 2021-02-25T09:07:49+05:30 IST

పుర పోరుకు ప్రతిపక్షాలు ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తమను గెలిపించే అంశాలను గుర్తించి, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను పెంపు నిర్ణయంతో పాటు మౌలిక

పుర పోరుకు ప్రచారాస్త్రాలు!

ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు, మౌలిక వసతుల కల్పనే ప్రధానం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

పుర పోరుకు ప్రతిపక్షాలు ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తమను గెలిపించే అంశాలను గుర్తించి, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.  పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను పెంపు నిర్ణయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా ప్రజల దృష్టికి తేవాలని యోచిస్తున్నాయి. ‘సంస్కరణల’ పేరిట ఆస్తిపన్నును భారీగా పెంచేందుకు ఇటీవల రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై పలు ప్రజాసంఘాలు, ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్లతో కలసి సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. ప్రణాళిక ప్రకారం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ ఏప్రిల్‌ 1నుంచి ఆస్తి పన్నును కొన్ని రెట్ల మేర పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


తాగునీరు, డ్రైనేజీ తదితర రుసుములనూ భారీగా పెంచబోతోందని, దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు జీవనం దుర్భరమవుతుందని హెచ్చరిస్తున్నాయి. ఆస్తిపన్ను, ఇతర సేవా రుసుముల పెంపు ప్రతిపాదనలను ప్రధాన ప్రచారాంశంగా తీసుకోవాలని యోచిస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని పట్టణ ప్రాంతాలూ కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోనందున ప్రజాజీవనం నరకప్రాయమవుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం కూడా మున్సి‘పోల్స్‌’లో మరొక ప్రధాన ప్రచారాస్త్రం కానుంది. మరోవైపు 74, 75 రాజ్యాంగ సవరణల ప్రకారం పట్టణ స్థానిక సంస్థలకు దక్కాల్సిన విధులు, నిధులను ఇవ్వడం ద్వారా స్థానిక సురాజ్యం తిరిగి వేళ్లూనుకునేలా చూడాలన్న డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాయి. 

Updated Date - 2021-02-25T09:07:49+05:30 IST