California సర్కారు కొత్త ప్రతిపాదన.. ఆ కార్ల అమ్మకాలపై నిషేధం..!

ABN , First Publish Date - 2022-06-11T23:16:00+05:30 IST

పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కీలక మార్పులకు తెర తీసింది. ఇందులో భాగంగా.. 2035 తరువాత రాష్ట్రంలో పెట్రోల్ ఆధారిత కార్లు, చిన్నతరహా ట్రక్కులు విక్రయాలను నిషేధించాలనే కొత్త ప్రతిపాదనను తెచ్చింది.

California సర్కారు కొత్త ప్రతిపాదన.. ఆ కార్ల అమ్మకాలపై నిషేధం..!

ఎన్నారై డెస్క్: పర్యావరణ పరిరక్షణ కోసం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కీలక మార్పులకు తెర తీసింది. ఇందులో భాగంగా.. 2035 తరువాత రాష్ట్రంలో పెట్రోల్ ఆధారిత కార్లు, చిన్నతరహా ట్రక్కుల విక్రయాలను నిషేధించాలనే కొత్త ప్రతిపాదనను తెచ్చింది. 2035 తరువాత రాష్ట్రంలో విద్యుత్ కార్ల అమ్మకాలనే అనుమతించాలనే లక్ష్యంతో రాష్ట్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్‌డ్ క్లీన్ కార్ ఫ్యూల్స్ నిబంధనల్లో భాగంగా ఈ ప్రతిపాదనను రూపొందించింది. దీనిపై కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డు(సీఏఆర్‌బీ) ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. ఈ దిశగా జూన్ 9న తొలి మీటింగ్ జరిగింది.  ప్రజలు సులువుగా విద్యుత్ వాహనాల వినియోగం వైపు మళ్లేందుకు ఈ నిబంధనను రూపొందించామని అని సీఏఆర్‌బీ బోర్డు చెయిర్‌పర్సన్ లియేన్ ఎమ్. రాండాల్ఫ్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. 


కాగా.. కాలిఫోర్నియా ప్రభుత్వపు తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే అది పర్యావరణ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పదికిపైగా అమెరికా రాష్ట్రాలు కాలిఫోర్నియా విధానాన్ని తామూ అమలు చేస్తామని పేర్కొన్నాయి. కాగా.. విద్యుత్ కార్ల విక్రయాల వాటాను విడతల వారీగా పెంచాలని కాలిఫోర్నియా ప్రభుత్వం యోచిస్తోంది. 2026 కల్లా రాష్ట్రంలోని మొత్తం కార్ల విక్రయాల్లో కొత్త విద్యుత్ కార్ల అమ్మకాలు 35 శాతంగా ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

Updated Date - 2022-06-11T23:16:00+05:30 IST