Abn logo
Sep 16 2020 @ 16:52PM

కేబుల్ బ్రిడ్జి.. ఈనెల 19న ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్ : హైదరాబాద్‌కు మరో ల్యాండ్‌మార్క్‌గా మారనున్న దుర్గం చెరువు కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. వాహనాల రాకపోకలకు వీలుగా అందుబాటులోకి రానుంది. 


ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బ్రిడ్జిని ఈ నెల 19 న ప్రారంభించేందుకు హైదరాబాద్ మహానగర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కె. తారకరామారావు ఈ వంతెనను ప్రారంభించనున్నారు. 


ఐటీ ఉద్యోగుల రాకపోకలకు వీలుగా ఉండేలా… ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మొత్తం రూ.184 కోట్లను దీని నిర్మాణానికి వ్యయం చేశారు. రెండేళ్ళలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్&టీకి అప్పగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో... ఈ దరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే. 


రోడ్ నంబర్ 45 ను... మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మనీ టెక్నాలజీతో… 8 దేశాల ఇంజినీర్లు… 22 నెలలపాటు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు.


దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైంది.. ఒక్కో పైలాన్‌కు 26 కేబుళ్లను వినియోగించారు. జులై 20 నే దీనిని ప్రారంభించాల్సి ఉన్నా… కరోనా నేపధ్యంలో ఆలస్యమైంది.

Advertisement
Advertisement
Advertisement