బజ్జీస్‌...అదుర్స్‌!

ABN , First Publish Date - 2022-06-18T09:16:10+05:30 IST

సాయంకాలం వేళ చిరుజల్లులు కురుస్తున్న సమయంలో వేడి వేడి బజ్జీలు లాగిస్తే... ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.

బజ్జీస్‌...అదుర్స్‌!

సాయంకాలం వేళ చిరుజల్లులు కురుస్తున్న సమయంలో వేడి వేడి బజ్జీలు లాగిస్తే... ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అయితే బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ ఒకటే కాదు, క్యాప్సికంతో,  కాకరకాయతో, బీరకాయతో, అరటికాయతో బజ్జీలు వేసుకోవచ్చు. ఆ బజ్జీల తయారీ విశేషాలు ఇవి... 


క్యాప్సికం బజ్జీ

కావలసినవి

క్యాప్సికం - రెండు, శనగపిండి - అరకప్పు, పసుపు - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

క్యాప్సికంను తీసుకుని రెండు సమానభాగాలుగా కట్‌ చేసి మధ్యలో విత్తనాలు తీసేయాలి. తరువాత పొడవు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఒక మిక్సింగ్‌ బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో పసుపు, కారం, ఇంగువ, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండి బాగా పలుచగా కాకుండా చూసుకోవాలి.

ఇప్పుడు క్యాప్సికం ముక్కలకు పిండిని కోట్‌లా పట్టించి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పిండిలో ముంచిన క్యాప్సికం ముక్కలను వేసి వేయించుకోవాలి. 

గోధుమరంగులోకి మారే వరకు వేయించాక తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


ఆలూ బజ్జీ


కావలసినవి

బంగాళదుంపలు - నాలుగు, శనగపిండి - అరకప్పు, మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు, కారం - రెండు టీస్పూన్లు, వాము - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారీ విధానం

బంగాళదుంపల పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. తరువాత ముక్కలుగా కట్‌ చేసి నీళ్లలో వేసి పక్కన పెట్టుకోవాలి.

బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో మైదా, కారం, వాము, తగినంత ఉప్పువేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఇందులో ఒక టేబుల్‌స్పూన్‌ వేడి నూనె వేసి కలుపుకొంటే బజ్జీలు కరకరలాడతాయి.

ఈ మిశ్రమంలో కట్‌  చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు వేయాలి. 

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఒక్కో బంగాళదుంప ముక్కను నూనెలో వేసుకుంటూ రెండు వైపులా వేయించుకుంటే కరకరలాడే ఆలూ బజ్జీ రెడీ.


కరేలా బజ్జీ

కావలసినవి

కాకరకాయలు - రెండు, శనగపిండి - అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు - మూడు, వాము - ఒకటీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కారం - అరటీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

కాకరకాయలను శుభ్రంగా కడిగి పైపైన పొట్టు తొలగించాలి. తరువాత గుండ్రటి ముక్కలుగా తరగాలి.

బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో పసుపు, వాము, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కారం, ఇంగువ, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి మిశ్రమంలా కలుపుకోవాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక కాకరకాయ ముక్కలు వేసి చిన్నమంటపై వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న ముక్కలను శనగపిండిలో అద్దుకుంటూ మళ్లీ నూనెలో వేసి గోధుమరంగులోకి మారే వరకు వేయించుకోవాలి. 

వీటిని వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.


మంగళూరు బజ్జీ


కావలసినవి

మైదా - ఒకటిన్నర కప్పు, పెరుగు, ముప్పావు కప్పు, బేకింగ్‌సోడా - ఒక టీస్పూన్‌, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత. 

తయారీ విధానం

ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని చిలికి క్రీమ్‌లా తయారుచేసుకోవాలి.

తరువాత అందులో తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరితురుము వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు మైదాను కొద్దికొద్దిగా వేసుకుంటూ కలియబెట్టాలి. కొన్ని నీళ్లు పోసి మిశ్రమం చిక్కగా అయ్యేలా కలుపుకోవాలి. 

బేకింగ్‌ సోడా, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక స్పూన్‌ సహాయంతో మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నూనెలో వేయాలి. గోధుమరంగులోకి మారే వరకు వేయించాలి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే మంగళూరు బజ్జీలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.


బీరకాయ బజ్జీ

కావలసినవి

బీరకాయ - ఒకటి, శనగపిండి - ఒక కప్పు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - ఒకటేబుల్‌స్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, బేకింగ్‌సోడా - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి సరిపడా. 


తయారీ విధానం

ముందుగా బీరకాయ పొట్టు తీసి శుభ్రంగా కడిగి గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఒక బౌల్‌లో శనగపిండి  తీసుకుని అందులో బియ్యప్పిండి, కారం, పసుపు, బేకింగ్‌సోడా, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలియబెట్టాలి.

ఇప్పుడు గుంత పొంగణాల ప్లేట్‌ తీసుకుని కొద్దిగా అయిల్‌ వేయాలి. తరువాత బీరకాయ ముక్కలను పిండిలో ముంచుకుంటూ గుంతల్లో పెట్టాలి. 

కాసేపు వేగిన తరువాత బీరకాయ బజ్జీలను మరోవైపు తిప్పాలి. మరికాసేపు వేయించుకుని దింపుకోవాలి.

టీ టైమ్‌ స్నాక్‌గా వీటిని సర్వ్‌ చేసుకోవాలి.


అరటికాయ బజ్జీ

కావలసినవి

అరటికాయ - ఒకటి, శనగపిండి - అరకప్పు, పసుపు - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.

తయారీ విధానం

ముందుగా అరటికాయ తొక్క తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

మిక్సింగ్‌ బౌల్‌లో శనగపిండి తీసుకుని అందులో పసుపు, కారం, ఇంగువ, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లుపోసి మిశ్రమం తయారుచేసుకోవాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక అరటికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. 

తరువాత వేయించుకున్న అరటికాయ ముక్కలను శనగపిండిలో అద్దుకుంటూ మళ్లీ నూనెలో వేసి వేయించుకోవాలి.

గోధుమరంగులోకి మారే వరకు  వేయించుకున్నాక వేడి వేడి అరటికాయ బజ్జీలను ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2022-06-18T09:16:10+05:30 IST