బట్లర్‌ బాదేశాడు!

ABN , First Publish Date - 2022-04-03T09:40:22+05:30 IST

రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ ఐపీఎల్‌లో రెండో విజయం అందుకుంది. జోస్‌ బట్లర్‌ (68 బంతుల్లో 11 ఫోర్లు

బట్లర్‌ బాదేశాడు!

  • సెంచరీతో చెలరేగిన జోస్‌
  • రాజస్థాన్‌ చేతిలో ముంబై చిత్తు
  • తిలక్‌వర్మ మెరుపు బ్యాటింగ్‌


ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ ఐపీఎల్‌లో రెండో విజయం అందుకుంది. జోస్‌ బట్లర్‌ (68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100) సెంచరీతో చెలరేగడంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్‌ 20 ఓవర్లలో 193/8తో భారీ స్కోరు చేసింది. హెట్‌మయెర్‌ (14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), శాంసన్‌ (21 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 30) ధాటిగా ఆడారు. బుమ్రా, మిల్స్‌ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 170/8 స్కోరుకే పరిమితమై వరుసగా రెండో ఓటమి చవిచూసింది. హైదరాబాదీ తిలక్‌ వర్మ (33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61),  ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్‌ సెంచరీలు చేశారు. చాహల్‌, సైనీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. బట్లర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 


తిలక్‌, ఇషాన్‌ తుఫాన్‌: ముంబై జట్టు.. కెప్టెన్‌ రోహిత్‌ (10), వన్‌డౌన్‌ అన్మోల్‌ప్రీత్‌ (5) వికెట్లను పవర్‌ ప్లేలోనే 40 పరుగులకే కోల్పోయింది. అయినా..మరో ఓపెనర్‌ కిషన్‌, హైదరాబాద్‌ కుర్రోడు తిలక్‌ రాజస్థాన్‌ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇషాన్‌ సహజ శైలిలో విరుచుకుపడగా..అశ్విన్‌ బౌలింగ్‌లో అద్భుత సిక్స్‌తో బ్యాట్‌ ఝళిపించిన తిలక్‌..సైనీ బౌలింగ్‌లో 4,6తో ఆపై చాహల్‌ బౌలింగ్‌లో 6,4తో చెలరేగాడు. హాఫ్‌ సెంచరీ చేసిన కొద్దిసేపటికే బౌల్ట్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ పెవిలియన్‌ చేరడంతో 81 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. చాహల్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో ఐపీఎల్‌లో తొలి హాఫ్‌ సెంచరీ (28 బంతుల్ల్లో) చేసిన తిలక్‌.. అశ్విన్‌ బంతిని సిక్సర్‌గా మలిచి జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. కానీ స్వీప్‌షాట్‌ ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ముంబై ఒత్తిడిలో పడడంతో పొలార్డ్‌ (22) కూడా గట్టెక్కించలేకపోయాడు.


బట్లర్‌ భళా: టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. బట్లర్‌, శాంసన్‌, హెట్‌మయెర్‌ జోరుకు అలవోకగా 200 స్కోరు దాటేలా కనిపించింది. కానీ డెత్‌ ఓవర్లలో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో రాయల్స్‌ స్పీడుకు బ్రేకులు వేశాడు. యువ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్‌ (1), దేవదత్‌ పడిక్కళ్‌ (7) త్వరగానే అవుటవగా.. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్‌తో తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన బట్లర్‌.. సామ్స్‌ బౌలింగ్‌లో భారీసిక్సర్‌తో రెచ్చిపోయాడు. థంపి వేసిన ఇన్నిం గ్స్‌ నాలుగో ఓవర్లో 4,6,6,4,6తో ఏకంగా 26 రన్స్‌ రాబట్టాడు. సామ్స్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో 32 బంతుల్లోనే బట్లర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. పడిక్కళ్‌ స్థానంలో వచ్చిన కెప్టెన్‌ శాంసన్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో ముంబై బౌలర్ల ఆటలు సాగలేదు. అయితే సంజూను అవుట్‌ చేయడం ద్వారా పొలార్డ్‌ 82 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. క్రీజులో ఉన్నది కొద్దిసేపైనా హెట్‌మయెర్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబైకి చెమటలు పట్టించాడు. పొలార్డ్‌ వేసిన 17వ ఓవర్లో 6,6,4,4తో, ఆపై మిల్స్‌ బౌలింగ్‌లో 6,4తో కదం తొక్కిన హెట్‌మయెర్‌ను 19వ ఓవర్లో బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. ఇదే ఓవర్లో సింగిల్‌తో సెంచరీ సాధించిన బట్లర్‌తోపాటు, అశ్విన్‌(1)ను కూడా అవుట్‌ చేశాడు. చివరి ఓవర్లో సైనీ, పరాగ్‌ను మిల్స్‌ అవుట్‌ చేయడంతో రాజస్థాన్‌ అనుకున్న స్కోరు సాధించలేకపోయింది.


స్కోరుబోర్డు

రాజస్థాన్‌: బట్లర్‌ (బి) బుమ్రా 100, జైశ్వాల్‌ (సి) డేవిడ్‌ (బి) బుమ్రా 1, పడిక్కళ్‌ (సి) రోహిత్‌ (బి) మిల్స్‌ 7, శాంసన్‌ (సి) తిలక్‌ (బి) పొలార్డ్‌ 30, హెట్‌మయెర్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 35, రియాన్‌ పరాగ్‌ (సి) డేవిడ్‌ (బి) మిల్స్‌ 5, ఆర్‌. అశ్విన్‌ (రనౌట్‌) 1, నవ్‌దీప్‌ సైనీ (సి) ఇషాన్‌ (బి) మిల్స్‌ 2, బౌల్ట్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 193/8; వికెట్ల పతనం: 1-13, 2-48, 3-130, 4-183, 5-184, 6-185, 7-188, 8-193; బౌలిం గ్‌: బుమ్రా 4-0-17-3, సామ్స్‌ 4-0-32-0, థంపీ 1-0-26-0, మురుగన్‌ 3-0-32-0, మిల్స్‌ 4-0-35, 3, పొలార్డ్‌ 4-0-46-1.


ముంబై: ఇషాన్‌ కిషన్‌ (సి) సైనీ (బి) బౌల్ట్‌ 54, రోహిత్‌ శర్మ (సి) పరాగ్‌ (బి) ప్రసిద్ధ్‌ 10, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (సి) పడిక్కళ్‌ (బి) సైనీ 5, తిలక్‌ వర్మ (బి) అశ్విన్‌ 61, పొలార్డ్‌ (సి) బట్లర్‌ (బి) సైనీ 22, టిమ్‌ డేవిడ్‌ (ఎల్బీ) చాహల్‌ 1, డానియెల్‌ సామ్స్‌ (సి) బట్లర్‌ (బి) చాహల్‌ 0, మురుగన్‌ అశ్విన్‌ (రనౌట్‌) 6, బుమ్రా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 170/8; వికెట్ల పతనం: 1-15, 2-40, 3-121, 4-135, 5-136, 6-136, 7-165, 8-170; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-29-1, ప్రసిద్ధ్‌ 4-0-37-1, సైనీ 3-0-36-2, ఆర్‌. అశ్విన్‌ 4-0-30-1, చాహల్‌ 4-0-26-2,  పరాగ్‌ 1-0-11-0.


Updated Date - 2022-04-03T09:40:22+05:30 IST