ఈ ధరలేందిరో..!

ABN , First Publish Date - 2021-03-08T07:03:40+05:30 IST

కరోనా దెబ్బకు ఎంతో మంది ఉపాధి కోల్పోగా.. చాలా మంది ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.

ఈ ధరలేందిరో..!

  • మండిపోతున్న నిత్యావసరాల ధరలు.. 
  • రోజురోజుకూ పెరిగిపోతున్న వైనం
  • హడలిపోతున్న సామాన్య ప్రజలు
  • లీటర్‌ 150 దాటిన వంటనూనెల ధర
  • అదే దారిలో పామాయిల్‌.. పప్పులు
  • కొనుగోళ్లు తగ్గాయంటున్న వ్యాపారులు
  • పెట్రోలు, డీజిల్‌ ధరల ప్రభావం 
  • నిత్యావసరాలపై పడుతోందని గగ్గోలు


నిరుడు ఇదే సమయంలో పల్లీ నూనె లీటరు 100 లోపే! ఇప్పుడది రూ.150 దాటింది!! 

మేలి రకం చింతపండు కిలో రూ.150-160 దాకా ఉండేది. ఇప్పుడు రూ.200 అయింది!!

నూనె, చింతపండే కాదు.. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు.. అన్నీ పెరిగిపోయాయి. గతంలో నెల సరుకులకు రూ.2500 అయితే.. ఇప్పుడు దాదాపు రూ.5 వేలు అవుతున్న పరిస్థితి!! కరోనా దెబ్బకు తగ్గిన ఆదాయం ఒకవైపు.. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు మరోవైపు. తట్టుకోలేక సామాన్యులు విలవిలలాడుతున్నారు. బతుకు బండిని నడిపే మార్గం తెలియక బాధపడుతున్నారు.

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు ఎంతో మంది ఉపాధి కోల్పోగా.. చాలా మంది ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. వాటి నుంచి బయటపడేదెలాగో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి దుస్థితిలో ఉన్నవారిపై.. నిత్యావసరాల ధరల పిడుగు పడింది. ప్రత్యేకించి నూనెలు, పప్పుల ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు.. గత ఏడాది మార్చిలో పామాయిల్‌ ధర లీటర్‌కు రూ.88 వరకు ఉండగా, ఇప్పుడు రూ.120 దాకా ఉంది. కందిపప్పు, మినప పప్పు, పెసర పప్పు, చింతపండు సహా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఏ వస్తువు కొనాలన్నా, ఏది తినాలన్నా ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో వాహనదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా.. వాటి ప్రభావం నిత్యా వసర వస్తువుల రేట్లపై పడుతోందని, ధరల పెరుగుదలకు కారణం ఇదేనని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సరుకులను పంపుతున్న ఉత్పత్తిదారులు ఇంధన ధరలను కూడా సరుకులపై వేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏడాది వ్యవధిలో అన్ని రకాల నూనెల రేట్లూ 20 నుంచి 25 శాతం మేర పెరిగాయని చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరుగుతుండడంతోనే పామాయిల్‌ రేటు ఇక్కడ కూడా పెరుగుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. కారణాలేవైనా.. ఆ ప్రభావం మాత్రం అంతిమంగా కొనుగోలుదారులపైనే పడుతోంది. దీంతో మధ్య తరగతి ‘బడ్జెట్‌ పద్మనాభా’లు వస్తువుల కొనుగోళ్లను తగ్గించుకోవాల్సి వస్తోంది.


పడిపోతున్న రిటైల్‌ వ్యాపారం.. 

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా మధ్య తరగతి ప్రజలు కొనుగోళ్లు తగ్గించుకుంటున్నారని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. నెలకు సరిపడా వారు పెట్టుకున్న బడ్జెట్‌లో వచ్చిన సరుకులనే తీసుకెళ్తున్నారని అంటున్నారు. దీంతో తమ వ్యాపారాలపై కూడా ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు. గతంలో తాను రోజుకు రూ.60 వేల నుంచి 70 వేల వరకు వ్యాపారాన్ని నిర్వహించేవాడినని, ప్రస్తుతం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కూడా సాగడం లేదని అమీర్‌పేటకు చెందిన అమిత్‌ అనే వ్యాపారి తెలిపారు. 


ఈమె పేరు విజయలక్ష్మి. నగర శివారులోని మేడిపల్లిలో భర్త, ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటారు. ఆమె తమ ఇంటికి సరిపడే నిత్యావసర సరుకులను గతంలో నెలకు రూ.2500తో తెచ్చేవారు. కానీ, గడచిన రెండు నెలలుగా పరిస్థితి తారుమారయింది. రూ.5 వేలు వెచ్చించినా 20 రోజులకు సరిపోయే సరుకులు కూడా రావడం లేదని విజయలక్ష్మి చెబుతున్నారు. రిటైల్‌ దుకాణంలో ఆయిల్‌, పల్లీల రేట్లు విపరీతంగా పెరుగుతుండడంతో వారంలో రెండు రోజులు మాత్రమే టిఫిన్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇక నాన్‌వెజ్‌ కర్రీలు నెలకు రెండు, మూడుసార్లు మాత్రమే వండుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది ఒక విజయలక్ష్మి సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలోని సామాన్యులందరూ ఎదుర్కొంటున్న సమస్య. 


నూనెల రేట్లే ఎక్కువ..

హోల్‌సేల్‌ మార్కెట్‌లో నిత్యావసర వస్తువులన్నింటిలో నూనెల ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. సబ్బులు, టూత్‌పే్‌స్టల ఽవంటివి మాత్రం సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరుగుతున్నందునే నిత్యావసర ధరలు పెరుగుతున్నట్లు ఉత్పత్తిదారులు చెబుతున్నారు.

మహేందర్‌ వ్యాస్‌, 

హోల్‌సేల్‌ కిరాణం మర్చంట్‌ ప్రెసిడెంట్‌, బేగం బజార్‌


40-60 శాతం పెరిగాయి

అంతర్జాతీయస్థాయిలో నూనెల ఉత్పత్తి తగ్గడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. అన్నిరకాల నూనెల ధరలు 40-60 శాతం వరకు పెరిగాయి. ఈ ప్రభావం కొనుగోలుదారులపై పడుతోంది. బ్రాండెడ్‌ ఆయిల్‌ ప్యాకెట్లలో కొందరు నాసిరకం నూనెలు నింపి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. ఒక్కో ఆయుల్‌ ప్యాకెట్‌ నడుమ గతంలో రూ.5 నుంచి 6 వ్యత్యాసం ఉండగా, ఇప్పుడు రూ. 10 నుంచి 15 ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశీయ రైతులను ప్రోత్సహించి నూనె ఉత్పత్తులను ఎక్కువగా పండించాలి.

- చంద్రశేఖర్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్‌



Updated Date - 2021-03-08T07:03:40+05:30 IST