ఖైరతాబాద్ సదర్‌లో దున్నపోతు బీభత్సం
ABN , First Publish Date - 2021-11-06T02:25:02+05:30 IST
ఖైరతాబాద్ సదర్‌లో దున్నపోతు బీభత్సం
హైదరాబాద్: భారీ దున్నపోతులతో హైదరాబాద్ నగరానికి మాత్రమే ప్రత్యేకమైన సదర్ వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. నగరంలోని ఖైరతాబాద్ సెంటర్‌లో సదర్ వేడుకలలో ప్రదర్శించేందుకు ఒక దున్నపోతు బీభత్సం సృష్టించింది. వేడుకలు జరిగే ప్రాంతంలో దున్నపోతుకు అలంకరణం చేస్తుండగా హోరెత్తిన డీజేల మ్యూజిక్, భారీ శబ్దాల హారన్‌లకు బెదిరిపోయి జనంపైకి ఆ దున్న దూసుకెళ్లింది. దున్నపోతుకున్న తాడు ఆ ప్రదేశంలో వున్న ఓ స్కూటీకి చిక్కుకుని చాలా దూరం ఈడ్చుకెళ్ళింది. ఆ దున్నపోతు దాడిలో ముగ్గురు వాహనదారులకు గాయాలై పలు వాహనాలు ధ్వంసమైయ్యాయి. దాదాపు గంటసేపు ఈ బీభత్సం కొనసాగగా చివరకు దున్నపోతును అతికష్టంమీద నిర్వాహకులు పట్టుకోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. సదర్ ఉత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ప్రతి ఏటా దీపావళి మరునాడు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో యాదవ సామాజికవర్గం వేడుకగా నిర్వహించే ఈ సదర్ ఉత్సవానికి వేలాదిగా ప్రజలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతుంటారు. దున్నపోతులను బాగా అలంకరించి డీజేల సంగీతం మధ్య వాటితో రకరకాల విన్యాసాలు చేయిస్తుంటారు. ఇందుకోసం దున్నపోతులను లక్షలాది రూపాయల ఖర్చుతో మంచి ఆహారం పెట్టి ఆ దున్నలను పోషిస్తారు. ఈ సదర్ వేడుకల కోసం హర్యానా తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది రూపాయల విలువచేసే దున్నపోతులను తీసుకొస్తుంటారు.