పెట్టుబడులపై బడ్జెట్‌ ప్రభావం ఎంత?

ABN , First Publish Date - 2020-02-16T06:52:20+05:30 IST

కొత్త విధానం పన్ను వ్యవస్థను మరింత సరళం చేస్తుందని ప్రకటించినప్పటికీ అదే మీకు మంచిదని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో పాత విధానమే లాభదాయకం కావచ్చు. అధిక శాతం మంది ఐటీ మదింపుదారులను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల వరకు

పెట్టుబడులపై బడ్జెట్‌ ప్రభావం ఎంత?

ఈ నెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను విధానంలో ఒక రకంగా భారీ మార్పులే ప్రతిపాదించారు. బడ్జెట్‌ పత్రాల ప్రకారం ఐటీ పరిధిలోకి వచ్చే వారికి రెండు ఆప్షన్లు సమాంతరంగా అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అలాగే ఇతర సెక్షన్లలో కూడా మరికొన్ని మార్పులు ప్రకటించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వైఖరి అవలంబించాలో ‘ఆంధ్రజ్యోతి బిజినె్‌సప్లస్‌’ పాఠకులకు వివరిస్తున్నారు బ్యాంక్‌ బజార్‌ సీఈఓ అదిల్‌ శెట్టి.


20% మినహాయింపులతో..

కొత్త విధానం పన్ను వ్యవస్థను మరింత సరళం చేస్తుందని ప్రకటించినప్పటికీ అదే మీకు మంచిదని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో పాత విధానమే లాభదాయకం కావచ్చు. అధిక శాతం మంది ఐటీ మదింపుదారులను దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 20 శాతం మినహాయింపులపై దృష్టి పెట్టవచ్చు. ఉదాహరణకు రూ.10 లక్షల ఆదాయంపై స్టాండర్డ్‌ డిడక్షన్‌ (రూ.50 వేలు), సెక్షన్‌ 80సీ (రూ.1.5 లక్షల వరకు), 80డీ (రూ.25,000-రూ.1 లక్ష), 24బీ (రూ.2 లక్షలు), ఇతరత్రా మినహాయింపులేవైనా ఉంటే అవి అన్నీ వర్తిస్తాయి. ఈ ఆదాయం శ్రేణిలో పాత  విధానం ప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా రూ.1.17 లక్షల పన్ను భారం పడుతుంది. కొత్త విధానం ప్రకారం పడే పన్ను భారం రూ.78 వేలు. ఈ శ్రేణిలోని వారు పాత విధానం ఎంచుకుని మినహాయింపులన్నీ పొందితే పన్ను భారం రూ.75,400కి తగ్గుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే మినహాయింపులన్నీ వర్తింపచేసుకుంటూ, తగినంత బీమా ప్రయోజనం పొందుతూ పన్ను ఆదా చేసుకునే వ్యూహం మంచిది. 


ఎఫ్‌డీలు మంచివే.. రాబడులే తక్కువ

డిపాజిట్‌ బీమా, క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) కింద బ్యాంకు డిపాజిట్లపై బీమాను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు బడ్జెట్‌లో పెంచారు. అంటే వాణిజ్య, సహకార బ్యాంకుల్లో మనం చేసే డిపాజిట్లపై ఆయా బ్యాంకులు దివాలా తీసిన పక్షంలో రూ.5 లక్షల వరకు పరిహారం అందుతుంది. మిగులు సొమ్మును అధిక వడ్డీ ఆశ చూపే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కాని వీటిపై పన్ను చెల్లింపు అనంతర రాబడి చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 7 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్‌పై గిట్టుబాటయ్యే చివరి వడ్డీ రేటు 5.6 శాతం మాత్రమే అవుతుంది. యువతరం అయితే లిక్విడిటీ అవసరాల కోసం ఇలాంటి డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు తప్పితే దీర్ఘకాలంలో సంపద కూడబెట్టాలనుకునే వారికి మాత్రం ఇవి అంత అనుకూలం కాదు. 


బడ్జెట్‌ హౌసింగ్‌కు ప్రోత్సాహకాలు

మధ్యతరగతికి చెందిన ఇంటి యజమానులకు క్రెడిట్‌ అనుసంధానిత సబ్సిడీలను బడ్జెట్‌లో రెన్యూ చేయలేదు. కానీ 80 ఈఈఏ సెక్షన్‌ కింద అందిస్తున్న ప్రయోజనాలను మాత్రం మరో ఏడాది పొడిగించారు. మనకు పన్ను లాభాలందించే అద్భుతమైన మార్గం గృహ రుణాలే. మీ గృహ రుణం 80 ఈఈఏ సెక్షన్‌కు అర్హత గలదైతే మినహాయింపులు రూ.5 లక్షల వరకు పెంచుకునే ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చూస్తే పాత ఐటీ శ్లాబ్‌లు లాభదాయకం. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఇన్వెంటరీ అందుబాటులో ఉండడం, తక్కువ వడ్డీ రేట్ల శకం, భారీ పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్‌ గృహాల కొనుగోలు మంచి ఆప్షన్‌.


బీమాను నిర్లక్ష్యం చేయొద్దు  

జీవిత, ఆరోగ్య బీమా ఏదైనా పన్ను ఆదా కోణంలోనే చూస్తారు. ఇది చాలా తప్పు. బీమా అనేది ఆర్థిక రక్షణ కల్పించే సాధనంగానే పరిగణించాలి. పన్ను ఆదా అనేది ద్వితీయ ప్రాధాన్యం గల అంశం. అందువల్ల కొత్త, పాత పన్ను విధానాల్లో దేన్ని ఎంచుకున్నప్పటికీ తీవ్ర అనారోగ్యాల పాలై కుటుంబ ఆర్థిక స్థితి తలకిందులు కాకుండా ఉండాలంటే రెండు రకాల బీమా తప్పనిసరి. భార్య, పిల్లల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌, తల్లిదండ్రుల కోసం మరో ప్లాన్‌ తీసుకోవడం మంచిది.  


ఎంఎఫ్‌లు ఆకర్షణీయమే 

మ్యూచువల్‌ ఫండ్ల (ఎంఎఫ్‌) పై వచ్చే డివిడెండుపై 10 శాతం టీడీఎ్‌సను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఈ సందర్భంగా వాడిన పదజాలం కొంత గందరగోళానికి దారి తీసింది. దానిపై ఐటీ శాఖ ఇచ్చిన వివరణ ప్రకారం ఏడాదికి డివిడెండ్లపై వచ్చే ఆదాయం రూ.5 వేలు దాటితే ఆ డివిడెండు మొత్తం మీదనే పన్ను పడుతుంది. కొత్త పన్ను విధానంలోకి మారాలనుకునే వారి కోణంలో దీన్ని పరిశీలించినట్టయితే పన్ను ఆదాను మరిచిపోయి కేవలం సంపద సృష్టిపై దృష్టి పెట్టడం మంచిది. ఇందుకు క్రమానుగత పెట్టుబడులు (సిప్‌) మంచి సాధనం. ఒకవేళ పాత పన్ను విధానంలోనే ఉంటే పన్ను మినహాయింపుతో పాటు సంపద సృష్టికి ఈఎల్‌ఎ్‌సఎస్‌ చక్కగా ఉపయోగపడుతుంది.

Updated Date - 2020-02-16T06:52:20+05:30 IST